Sai Pallavi: నేను డాక్టర్‌ని, ప్రాణం విలువ తెలిసిన దాన్ని - ఆ వివాదంపై సాయి పల్లవి స్పందన
‘కశ్మీర్ ఫైల్స్’పై సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సాయి పల్లవి ఇన్‌స్టా ద్వారా తన స్పందన వ్యక్తం చేసింది.
‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాలో ఉగ్రవాదుల మారణకాండను, గోరక్షకులు ఓ ముస్లిం వ్యక్తిపై చేసిన దాడి గురించి ప్రస్తావిస్తూ నటి సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం తెలిసిందే. సాయి పల్లవి వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ భజరంగ్ దళ్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. ఈ నేపథ్యంలో సాయి పల్లవి తన ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా ఈ ఘటనపై స్పందించింది.
‘‘ఇలా మీ ముందుకు వచ్చి ఒక విషయం మీద క్లారిటీ ఇవ్వడం ఇదే మొదటిసారి. మాట్లాడేందుకు ముందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం కూడా ఇదే ఫస్ట్ టైమ్ అనుకుంటా. ఎందుకంటే నేను మాట్లాడిన మాటలు కొందరికి తప్పుగా అర్థమయ్యాయి. వాస్తవానికి నేను హింస ఏదైనా హింస అనే చెప్పే ప్రయత్నం చేశాను. లెఫ్ట్, రైట్ వింగ్స్ గురించి మాట్లాడుతూ.. కశ్మీరీ ఫైల్, గోరక్షకుల దాడి అంశాలను ప్రస్తావించాను. మెడికల్ గ్రాడ్యూయేట్‌గా నాకు ప్రాణం విలువ తెలుసు. నా వ్యాఖ్యలు వల్ల ఎవరైనా ఇబ్బందిపడి ఉంటే క్షమించండి. ఇలాంటి పరిస్థితిలో నాకు సపోర్ట్ చేసినవారికి కూడా థాంక్స్’’ అని తెలిపింది.
Also Read: సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలేమిటీ? ఆ కామెంట్స్‌ను వక్రీకరించారా?
ఇంటర్వ్యూను పూర్తిగా చూడకుండానే..: ‘‘నేను ఇచ్చిన ఇంటర్వ్యూను పూర్తిగా చూడకుండా, చిన్న క్లిప్ చూసి మీడియా నా వ్యాఖ్యలను ప్రచారం చేశారు. పూర్తిగా చూసి ఉంటే నేను అలా ఎందుకు మాట్లాడానో అర్థమయ్యేది. ఆ ఇంటర్వ్యూలో మీ మద్దతు రైట్ వింగ్‌కా, లెఫ్ట్ వింగ్‌కా అని అడిగారు. దానికి సమాధానంగా నేను.. వారికి వీరికి అని కాదు, మనం మంచి మనుషులా జీవించాలనే ఉద్దేశంతోనే ఆ ప్రస్తావన తీసుకొచ్చాను’’ అని సాయి పల్లవి స్పష్టం చేసింది. మరి, సాయి పల్లవి క్షమాపణలతో ఈ వివాదం ఇంతటి ముగుస్తుందో లేదో చూడాలి.
View this post on Instagram