Sai Pallavi: సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలేమిటీ? ఆ కామెంట్స్‌ను వక్రీకరించారా?
సాయి పల్లవి మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిందా? ఆమె కామెంట్స్‌ను వక్రీకరించారా? లేదా ఆమె వ్యాఖ్యలు ఎందుకు వివాదాస్పదమయ్యాయి.
‘విరాటపర్వం’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా నటి సాయి పల్లవి ఓ ఇంటర్వ్యులో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాలో కశ్మీర్ పండిట్ల మారణ హోమాన్ని ముస్లిం డ్రైవర్‌పై దాడితో పోల్చుతూ ఆమె చేసిన కామెంట్స్‌పై హిందూవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఆమె చెప్పాలనుకున్న విషయం ఒకటైతే. ప్రచారం మరోలా సాగుతోందని ఆమె అభిమానులు అంటున్నారు. కొన్ని టీవీ చానెళ్లు ఆమె వ్యాఖ్యలను వక్రీకరిస్తూ.. పదే పదే ప్రచారం చేయడం కూడా వివాదం పెద్దది కావడానికి కారణమైందని తెలుపుతున్నారు.
సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలేమిటీ?: నక్సలిజం, హింస తదితర అంశాల గురించి సాయి పల్లవి మాట్లాడుతూ.. ‘‘అందరూ మంచి మనుషుల్లా ఉండాలి. ఎవరో ఎవరినో హర్ట్ చేస్తున్నారు. మనం కూడా అలా చేయకూడదు. బాధితుల గురించి ఆలోచించాలి. కొన్ని రోజుల క్రితం వచ్చిన ‘కశ్మీర్ ఫైల్స్’ అనే సినిమాలో కశ్మీర్ పండిట్లను ఎలా చంపారో చూపించారు. ఇప్పుడు మనం దాన్ని మత సంఘర్షణలా వాటిని చూస్తే.. ఈ మధ్య ఓ ముస్లిం డ్రైవర్ తన బండిలో ఆవుని తీసుకెళ్తుండగా.. కొంతమంది అతడిని కొట్టి, జైశ్రీరామ్ అని చెప్పమన్నారు. అప్పుడు జరిగిన దానికి, ఇప్పుడు జరిగిన దానికి తేడా ఎక్కడ ఉంది..? మనమంతా మంచి మనుషులుగా ఉండాలి. అప్పుడే ఐక్యత ఉంటుంది’’ అని పేర్కొంది.
హింసకు తావు ఉండకూడదని చెప్పడం సాయి పల్లవి ఉద్దేశమని ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. అయితే, హింస గురించి వివరించేందుకు సాయి పల్లవి ఆ సెన్సటివ్ సంఘటనలను ప్రస్తావించకుండా ఉంటే బాగుండేదని పలువురు అంటున్నారు. మరికొందరు మాత్రం ఆమె వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను కించపరిచేలా ఉన్నాయని, ఆమె క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కొన్ని టీవీ చానెళ్లు ఆమె వ్యాఖ్యలను పదే పదే ప్రసారం చేయడం వల్ల కూడా ఆందోళనకు ఆజ్యం పోసినట్లయ్యింది. ఇలాంటి సున్నితమైన విషయాల్లో బాధ్యతగా ఉండాల్సిన టీవీ న్యూస్ చానెళ్లు అదే విషయంపై డిబెట్స్ పెడుతూ రచ్చ చేయడం ఏమిటని పలువురు మండిపడుతున్నారు. మరి, ఈ వివాదం నుంచి సాయి పల్లవి ఎలా భయటపడుతుందో చూడాలి. ప్రస్తుతం ఈ వివాదం.. ఆమె నటించిన ‘విరాటపర్వం’ సినిమాపై కూడా పడింది. ఇప్పటికే సోషల్ మీడియాలో #BoycottVirataParvam ట్రెండ్ అవ్వుతోంది.