Virupaksha Teaser: ‘చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి’ - విరూపాక్ష థ్రిల్లింగ్ టీజర్ వచ్చేసింది!
సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ టీజర్ విడుదల అయింది.
Virupaksha Teaser: సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘విరూపాక్ష’. యాక్సిడెంట్ నుంచి కోలుకున్నాక తను చేస్తున్న మొదటి సినిమా ఇదే. ఈ సినిమా టీజర్‌ను గురువారం సాయంత్రం విడుదల చేశారు. ఇది ఒక సూపర్ న్యాచురల్ హర్రర్ థ్రిల్లర్ అని తెలుస్తోంది.
‘చరిత్రలో ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారి. దీని నుంచి బయట పడటానికి ఒకే ఒక మార్గం ఉంది.’ అని ఫిదా ఫేమ్ సాయిచంద్ చెబుతూండగా ఈ టీజర్ ప్రారంభం అవుతుంది. తెల్లటి గుబురు గడ్డంతో ఆయనను ఈ టీజర్‌లో చూడవచ్చు. వెంటనే సాయి ధరమ్ తేజ్‌ను యాక్షన్ మోడ్‌లో చూపించారు. ఊరి ప్రజలందరూ సాయి ధరమ్ వెనక పడటం, తను జీప్‌లో వెళ్లిపోవడం వంటివి టీజర్‌లో చూడవచ్చు.
‘సమస్య ఎక్కడ మొదలైందో పరిష్కారం అక్కడే వెతకాలి.’ అనే సాయి ధరమ్ తేజ్ డైలాగ్‌తో ఆ ఊరిని ఏదో సమస్య వెంటాడుతుందని అర్థం చేసుకోవచ్చు. టీజర్‌ను యాక్షన్, సూపర్ న్యాచురల్, హార్రర్, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో నింపేశారు. ఈ టీజర్ మొత్తంలో సాయి ధరమ్ తేజ్ ఒకే షర్ట్ ధరించాడు. అక్కడక్కడ అదే షర్ట్ మీద బ్లాక్ కలర్ జాకెట్ వేసుకుంటాడు. దీన్ని బట్టి ఇది ఒక రోజులో లేదా ఒక రాత్రిలో జరిగే కథ అయి ఉండవచ్చు.
ఎన్టీఆర్ వాయిస్ ఓవర్... గ్లింప్స్‌కు సూపర్ రెస్పాన్స్!
''అజ్ఞానం భయానికి మూలం... భయం మూఢ నమ్మకానికి కారణం... ఆ నమ్మకమే నిజమైనప్పుడు? ఆ నిజం జ్ఞానానికి అంతు చిక్కనప్పుడు? అసలు నిజాన్ని చూపించే మరో నేత్రం'' అంటూ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌తో 'విరూపాక్ష' గ్లింప్స్ విడుదలైంది. సాయి ధరమ్ తేజ్ పాత్రను తారక్ తన వాయిస్ ద్వారా పరిచయం చేసిన తీరు వల్ల ఇంపాక్ట్ క్రియేట్ అయ్యింది. విజువల్స్ కూడా బావున్నాయి. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఏప్రిల్ 21న రిలీజ్!
'విరూపాక్ష' సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చే ఏడాది ఏప్రిల్ 21న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మిస్టరీ థ్రిల్లర్‌గా '' సినిమాను రూపొందిస్తున్నారు. దీనికి కార్తీక్ వర్మ దండు (Karthik Varma Dandu) దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన సుకుమార్ శిష్యుడు. ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దీనికి సుకుమార్ కథ, కథనం అందించారు. హీరోగా సాయి ధరమ్ తేజ్ 15వ సినిమా ఇది.
ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన సంయుక్తా మీనన్ (Samyuktha Menon) కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా కంటే ముందు 'భీమ్లా నాయక్'లో రానా దగ్గుబాటి జోడీగా నటించారు. నందమూరి కళ్యాణ్ రామ్ 'బింబిసార' సినిమాలో కూడా ఓ కథానాయికగా ఎస్సై పాత్రలో కనిపించారు. తాజాగా ధనుష్ 'సార్'లో హీరోయిన్ కూడా ఆమె. సాయి చంద్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, సునీల్, అజయ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాయి తేజ్‌కు రోడ్ యాక్సిడెంట్ కావడానికి ముందు ఈ సినిమా స్టార్ట్ అయ్యింది. ఆ ప్రమాదం వల్ల కొన్ని రోజులు బ్రేక్ పడింది. మళ్ళీ ఆయన కోలుకున్నాక షూటింగ్ రీ స్టార్ట్ చేశారు. కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసి హైదరాబాద్‌లో రెండు సెట్స్ వేశారు. సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తి అయ్యిందని సమాచారం.