Saakini Daakini OTT Release: విడుదలైన 2 వారాల్లోనే ఓటీటీలోకి, ‘శాకిని డాకిని’ స్ట్రీమింగ్ మొదలు
క్యూట్ బ్యూటీ నివేదా థామస్, హాట్ బ్యూటీ రెజీనా కసాండ్ర కలిసి నటించిన మల్టీ స్టారర్ మూవీ ‘శాకిని డాకిని’. సుధీర్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా కేవలం రెండు వారాల్లోనే ఓటీటీలోకి అడుగు పెట్టింది.
సౌత్ కొరియన్ హిట్ మూవీ ‘మిడ్ నైట్ రన్నర్’కి రీమేక్‌గా తెలుగులో తెరకెక్కిన సినిమా ‘శాకిని డాకిని’. సుధీర్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రెజీనా, నివేదా థామస్ కలిసి నటించిన ఈ మూవీ ఈ నెల(సెప్టెంబర్) 16న థియేటర్లలో విడుదల అయ్యింది. బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమ్ కాబోతుంది. ఇవాళ్టి(సెప్టెంబర్ 30) నుంచి ఓటీటీలో అందుబాటులో ఉంటుంది. సినిమా విడుదలైన రెండు వారాల్లోనే ఓటీటీలో ఫ్లాట్ ఫామ్ లో చూసే వెసులుబాటు కలుగుతుంది. వాస్తవానికి ఈ సినిమాను నేరుగా ఓటీటీలోనే విడుదల చేయాలని సినిమా నిర్మాతలు భావించినా.. చివరకు థియేటర్లలో రిలీజ్ చేశారు.
సినిమా విడుదలకు ముందు ప్రమోషన్స్ భారీగా జరిగాయి. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా మూవీపై అంచనాలు పెంచాయి. కానీ, సినిమా మాత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయినట్లు టాక్ వచ్చింది. స్క్రీప్ట్ ఎంగేజింగ్‌గా ఉండకపోవడం, కథనం స్లోగా ఉండటం, కామెడీ పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో ఆడియెన్స్ ను ఆకర్షించలేకపోయింది. పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటున్న షాలిని, దామిని అనే ఇద్దరు యువతులు హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠాను ఎలా ఎదుర్కొన్నారనే కథాంశంతో కామెడీ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందింది. ప్రేక్షకుల్ని నవ్వించడంతో పాటు థ్రిల్‌ను పంచడంలో సక్సెస్ కాలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా మిగిలిపోయింది.ఈ నేపథ్యంలో సినిమాను ఓటీటీకి ఇవ్వమే బెటర్ అని మూవీ మేకర్స్ నిర్ణయానికి వచ్చాయి.
ఇవాళ్టి నుంచి ఈ సినిమా ఓటీటీలో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కాబోతుంది. ఇప్పటికే ఈ విషయాన్ని సినిమా యూనిట్ ప్రకటించింది. ఈ సినిమా విడుదలకు ముందే నెట్ ఫ్లిక్స్ తో నిర్మాతలు అగ్రమెంట్ చేసుకున్నారు. అందులో భాగంగానే ఈ సినిమా సదరు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ మీద రన్ అవుతోంది. ఇక ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్‌తో కలిసి సునీత తాటి నిర్మించారు. వకీల్ సాబ్ తర్వాత నివేదా థామస్ నటించిన సినిమా ఇది. రెజీనా కూడా చాలా రోజుల తర్వాత తెలుగులో చేసిన సినిమా ఇదే.
‘శాకిని డాకిని’ సినిమా విడుదలైన రెండు వారాల్లోనే ఓటీటీలోకి రావడం పట్ల సర్వత్రా కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తెలుగు చలనచిత్ర వాణిజ్యమండలి ప్రకటన ప్రకారం.. ప్రతి సినిమా థియేటర్ లో విడుదఅయ్యాక 8 వారాలకు ఓటీటీలో విడుదల కావాలి. అంతేకాదు, ముందుగా సినిమా స్ట్రీమ్ కాబోయే ఓటీటీ లేదంటే శాటిలైట్ ఛానెల్ కు సంబంధించిన వివరాలు వెల్లడించకూడదు. కానీ, ఈ సినిమా కేవలం రెండు వారాల్లోనే థియేటర్ల నుంచి ఓటీటీలోకి రావడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది.
Also Read : 'నేనే వస్తున్నా' రివ్యూ : ధనుష్ డబుల్ యాక్షన్ ఎలా ఉంది? హిట్టా ఫట్టా?