RRR Movie Updates: ట్రిపుల్ ఆర్ విడుదల వాయిదా? రాజమౌళి పెట్టబోయే ప్రెస్‌మీట్ అందుకేనా?
బాహుబలి తర్వాత రాజమౌళి రూపొందిస్తున్న RRR పై అంచనాలు మామూలుగా లేవు. ఇప్పటికే రెండుసార్లు రిలీజ్ డేట్ ఇచ్చిన వాయిదా వేసిన జక్కన్న అక్టోబరు 13న విడుదల తేదీ ఫిక్స్ చేశాడు. కానీ...!.
బాహుబలితో టాలీవుడ్ రేంజ్ మార్చేసిన రాజమౌళి తర్వాతి ప్రాజెక్ట్ ఆర్ ఆర్ ఆర్ పై భారీ అంచనాలున్నాయి. పైగా మెగా-నందమూరి వారసులు నటిస్తుండడంతో అంచనాలను మాటల్లే చెప్పలేం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపిస్తుండగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. అలియా భట్, సముద్రఖని, అజయ్ దేవగన్ లాంటి స్టార్లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ట్రిపుల్ ఆర్ ఈ ఏడాది అక్టోబర్ 13న విడుదల కాబోతున్నట్టు దర్శక నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. 'RRR' మూవీ ఇప్పటికే రెండు సార్లు విడుదల తేదీ మార్చుకుంది. ముందుగా 2020 జులై 30న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చెప్పారు. ఆ తర్వాత 2021 జనవరి 8న పక్కా థియేటర్లలోకి వస్తామని ప్రకటించారు. అయితే అనివార్య పరిస్థితుల్లో మళ్ళీ వాయిదా వేయాల్సి వచ్చింది. చివరగా అక్టోబర్ 13న రిలీజ్ చేస్తామని ప్రకటించగా.. ఈసారి కరోనా సెకండ్ వేవ్ ఇబ్బందులు తెచ్చి పెట్టింది. చెప్పిన తేదీకి ట్రిపుల్ ఆర్ ని విడుదల చేయాలని గట్టిగానే ట్రై చేశారు కానీ.. పరిస్థితులు చూస్తుంటే అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.
ఈ సినిమాలోని ఫైనల్ సాంగ్ షూటింగ్ కోసం 'RRR' బృందం ఈ నెల ప్రారంభంలో ఉక్రెయిన్ వెళ్లిన సంగతి తెలిసిందే. పదిహేను రోజుల పాటు జరిగిన ఈ ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ బుధవారం పూర్తైంది. కంప్లీట్ అయిన తర్వాత జక్కన్న అండ్ టీమ్.. ఆగస్ట్ నెలాఖరున సినిమాపై ఓ ప్రెస్ మీట్ పెట్టనున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో ఏం చెబుతారు. సినిమా విశేషాలతో సరిపెడతారా లేకుంటే వాయిదా బాంబు పేలుస్తారా అన్న సస్పెన్స్ అయితే కొనసాగుతోంది.
ఆర్ ఆర్ ఆర్' చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 13న విడుదల చేయనున్నట్లు మేకర్స్ చెబుతూ వస్తున్నారు. అంటే విడుదలకు రెండు నెలల కంటే తక్కువ సమయమే ఉంది. ఇంత తక్కువ టైంలో ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మరియు ప్రమోషన్స్ చేయగలరా అనేది ప్రశ్నార్థకమే. అందులోనూ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాల్సిన సినిమా కాబట్టి.. ఇతర ఇండస్ట్రీలలో పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. బాలీవుడ్ లో పెద్ద మార్కెట్ గా భావించే మహారాష్ట్రతో సహా పలు రాష్ట్రాల్లో థియేటర్లు ఇంకా క్లోజ్ అయ్యే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అన్ని భాషల్లో సినిమాని రిలీజ్ చేయడం అంటే సాధ్యం కాని పని. ఇలాంటివి లెక్కలోకి తీసుకుంటే 'ఆర్ ఆర్ ఆర్' మరోసారి పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందని సినీ అభిమానులు భావిస్తున్నారు.
చెర్రీ మందే హింటిచ్చాడా..!
వాస్తవానికి RRR వాయిదాపై జక్కన్న ఇప్పటికే రామ్ చరణ్ ద్వారా క్లారిటీ ఇచ్చాడనే చెప్పాలి. సినిమాను తెరకెక్కించడంలోనే కాదు సినిమాపై అంచనాలను పెంచడంలోనూ తనదైన ముద్ర వేసే రాజమౌళి ఇంటర్య్వూలు, ఇన్‌స్టా స్టేటస్‌లు.. థీమ్ పోస్టర్లే కాదు.. ట్రిపుల్ ఆర్ అఫీషియల్ ఇన్‌స్టాను ఎన్టీఆర్‌కు అప్పజెప్పాడు. కొన్ని రోజులు ట్రిపుల్ ఆర్ ఇన్‌స్టా ఎన్టీఆర్‌కే సొంతం అని అనౌన్స్ చేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. అంటే ఎలాంటి పోస్ట్ పెట్టినా.. ఎలాంటి అప్‌డేట్ ఇవ్వాలన్నా అది ఎన్టీఆర్ ఇష్టమేనని.. చెప్పకనే చెప్పారు.
అకౌంట్‌ను హ్యాండోవర్ చేయగానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఓ వీడియో పోస్ట్ చేశాడు. అల్లూరి సీతారామరాజు అలియాస్ రామ్‌చరణ్‌ను డ్రమ్స్ ప్రాక్టీస్ చేశావా అంటూ ఓ వీడియో తీశారు. దానికి ఏంటయ్యా ఓ డ్రెస్సు లేదు డ్రమ్స్ లేవు దసరాకి సినిమా అవుతుందా లేదా అన్నట్టు కాస్త సీరియస్‌గా జక్కన్న కొడుకును అడిగేశాడు చెర్రీ. ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయింది. అంటే ఈ లెక్కన అప్పుడే రామ్ చరణ్ తో సినిమా వాయిదా తప్పదనే మాట చెప్పకనే చెప్పారని టాక్ నడుస్తోంది.
జక్కన్నకి వాయిదా కొత్తా ఏంటి..!
రాజమౌళికి సినిమాలు వాయిదా వేయడం అస్సలు కొత్త కానే కాదు. ఆరంభంలో మూవీస్ వాయిదా గురించి ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈగ నుంచి RRR వరకూ వాయిదాల పర్వం ఓ రేంజ్‌లో సాగుతూనే ఉంది. ఈగ సినిమా వాయిదాలు చూసి ఓ దశలో ప్రేక్షకులు విసిగిపోయారు. ఈ సినిమాకో నమస్కారం అనేశారు. అయితే సినిమాపై ఇంట్రెస్ట్ తగ్గకుండా ఉండేందుకు రాజమౌళి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. 2012లో ఈ సినిమా రిలీజైనప్పటికీ అప్పటికి 15 ఏళ్ల క్రితం తన తండ్రి ఈ కథను అందించారని... ఈగపై సినిమా తీయడం ఎంతో రిస్క్‌తో కూడుకున్న పని అని... 175 సెంటీమీటర్ల మనిషిని 0.75 సెంటీమీటర్ల ఈగ మధ్య సన్నివేశాలను చిత్రీకరించడం ఊహించడానికే కష్టమని తన వాయిదాల వెనుక అసలు కారణాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఎట్టకేలకు విడుదల తర్వాత తిరుగులేని సక్సెస్ అందుకుని అప్పటి వరకూ విసిగిపోయిన ప్రేక్షకులను ఫిదా చేయడంలో సక్సెస్ అయ్యాడు జక్కన్న.
ఈగ కన్నా ముందొచ్చిన మగధీర కూడా ముందు ప్రకటించిన తేదీ కన్నా వాయిదా పడ్డాకే విడుదలైంది. ఇక వాయిదాకా బాప్ అంటే మాత్రం బాహుబలి అని చెప్పాలి. ఏడాది గ్యాప్‌లో రిలీజ్ కావాల్సిన బాహుబలి ది బిగినింగ్...బాహుబలి ది కంక్లూజన్ మధ్య రెండేళ్ల విరామం వచ్చింది. ఈ రెండేళ్లు ఎవ్వరి నోట విన్నా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న డైలాగే. చివరకు ఎన్నికల ప్రచారంలో నరేంద్రమోదీ కూడా ఈ సినిమా గురించి కట్టప్ప గురించి ప్రస్తావించారు. సినిమా రిలీజైన తర్వాత నుంచి ఆ సినిమా కలెక్షన్లు చూసి...నాన్ బాహుబలి రికార్డ్స్ అని మాట్లాడుకునే స్థాయికి వెళ్లింది ఆ సినిమా. షూటింగ్ మొదలైనప్పటి నుంచీ మూడేళ్లలో రిలీజ్ కావాల్సిన రెండు భాగాలకి ఐదేళ్లు పట్టింది. కానీ రిలీజ్ తర్వాత మాత్రం మాహిష్మతి రాజ్యమే కాదు యావత్ ప్రపంచం జయహో బాహుబలి అంటూ నినదించింది. కానీ వాయిదాల మీద వాయిదాలు మాత్రం విసుగెత్తించాయనే చెప్పాలి...
అప్పుడు వేరు ఇప్పుడు వేరు
ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ విషయంలోనూ అదే జరుగుతోంది. అయితే గత సినిమాలు వాయిదా పడడం వెనుక కారణాలు వేరు. ఇప్పుడు వేరు. ఈగ, బాహుబలి లాంటి సినిమాల షూటింగ్, గ్రాఫిక్స్ వర్క్ ఆలస్యం కావడంతో వాయిదాపడ్డాయి. పైగా చెక్కుడు కార్యక్రమంలో రాజమౌళిని మించిన వారు లేరనే ఉద్దేశంతోనే జక్కన్న అనే పేరు ఫిక్స్ చేసేశారు. కానీ ఇప్పుడు జక్కన్న చెక్కడం కామన్ కారణం అయినా...అంతకుమించిన మరో కారణం కరోనా. కరోనా కల్లోలంతో ఎవ్వరూ ఇంట్లోంచి బయట అడుగుపెట్టే పరిస్థితే లేకుండా పోయింది. పోనీ ఏదో సినిమాలు పూర్తి చేసినా రిలీజ్ చేసే అవకాశం లేదు. ఇప్పటికీ థియేటర్లు కూడా పూర్తిస్థాయిలో తెరుచుకోపోవడంతో ఇప్పటికే పూర్తిచేసి విడుదలకు సిద్ధంగా ఉన్నా ఆశించిన స్థాయిలో విడుదల, కలెక్షన్లు కష్టమే.
ఓ రేంజ్‌లో ఉన్న సంక్రాంతి రష్
ఇప్పటికే సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల లిస్టు పెద్దదే ఉంది. సంక్రాంతి అనగానే పెద్ద సినిమాల హడావిడి గట్టిగానే ఉంటుంది. అలాగే చిన్న సినిమాల కంటెంట్ బావుంటే కూడా జనాలు ఎగబడి చూస్తారు. ఇప్పటికే సంక్రాంతి బరిలో ప్రభాస్ రాధేశ్యామ్ ఉంది. జనవరి 14న రాబోతున్నట్లు అఫీషియల్‌గా పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చేశారు. అసలైతే ఈ ఏడాది ఆగస్ట్ లేదా అక్టోబర్‌లోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ రిస్క్ చేయడం ఇష్టం లేక సేఫ్ జోన్‌లో సంక్రాంతి బరిలో దించుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ - రానా నటిస్తున్న భీమ్లా నాయక్, మహేశ్ బాబు సర్కారు వారి పాట కూడా సంక్రాంతికే విడుదలకానున్నాయి. ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి అగ్ర హీరోల మధ్య పోటీ అంటే ఎవరు కూడా రిస్క్ చేయడానికి అంతగా ఇష్టపడరు. కానీ అనిల్ రావిపూడి దర్శకత్వంతో తెరకెక్కిన F2 2019లో సంక్రాంతి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఆ సెంటిమెంట్ తో F3ని కూడా సంక్రాంతి బరిలోనే ఉంచారు. మరోవైపు కోలీవుడ్ హీరో విజయ్ బీస్ట్ కూడా తెలుగులో భారీగా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇన్ని సినిమాలు షెడ్యూల్ చేసి ఉండగా ఆ టైమ్ లో RRR విడుదలైతే మామూలుగా ఉండదు. ట్రిపుల్ ఆర్‌కు రిస్క్ లేకపోయినా మిగతా సినిమాలపై చాలా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. సహజంగా జక్కన్న వెయిటింగ్‌తో విసిగించినా రిలీజ్ తర్వాత ఇచ్చే కిక్కే వేరు. ఆర్ ఆర్ ఆర్ కూడా అలాగే ఉంటుందని ఫిక్సయ్యారు.
Also Read: వినాయక చవితి నాడు ‘లవ్ స్టోరీ’ చెప్పనున్న నాగచైతన్య , సాయిపల్లవి
Also Read: భీమ్లానాయక్ జోష్ తగ్గకముందే ‘హరి హర వీరమల్లు’ రిలీజ్.. 3 నెలల గ్యాప్‌లోనే వస్తోన్న పవన్ కళ్యాణ్
Also Read: పవన్ కళ్యాణ్ సేఫ్ జర్నీ.. రిమేక్ సినిమాలే బెటర్ అనుకుంటున్న పవర్ స్టార్?
Also Read: చక్కనమ్మ చిక్కినా అందమే అంటే ఏమో అనుకున్నాం గానీ హనీలా ఉంటుందనుకోలేదు
Also Read: చీరకట్టులో శ్రద్ధా దాస్.. ఎంత శ్రద్ధగా అందాలు ఆరబోస్తుందో చూడండి