Happy Birthday Ramya Krishna: నీలాంబరి నుంచి శివగామి వరకూ అందంతో పాటూ నటనలోనూ సరిలేరు తనకెవ్వరు అనిపించుకున్న రమ్యకృష్ణ బర్త్ డే స్పెషల్
అమ్మో ఐరెన్ లెగ్ అన్నవారితోనే రామ్మా గోల్డెన్ లెగ్ అనిపించుకుంది రమ్యకృష్ణ. నీలాంబరి నుంచి శివగామి వరకూ తరం మారినా క్రేజ్ తగ్గని రమ్య బర్త్ డే స్పెషల్
అమాయకమైన మరదలు..అండగా నిలచే అమ్మోరు..పూల్ లోంచి హాట్ గా పైకిలేచే బికినీ బ్యూటీ..పొగరబోతు పోట్లగిత్త..అల్లుడిని బెదిరించే అత్త..కూతుర్ని బుజ్జగించే తల్లి.. నీలాంబరి, శివగామి ఇలా ఒకటా రెండా పాత్ర ఏదైనా ఉతికి ఆరేస్తుంది. ఒకప్పుడు ఆమె సినిమాలో ఉందంటే ఫ్లాప్ అని ముద్రవేశారు. కానీ ఒడిదొడుకులు ఎదుర్కొని నిలబడింది. విమర్శించిన వాళ్లనుంచే ప్రశంసలు అందుకుంది. ఇప్పటికీ ఆ అందానికి, నటనకు ఫిదా కానివారుండరు. దటీజ్ రమ్యకృష్ణ.
ఒకప్పుడు హీరోయిన్‌గా అలరించిన రమ్య తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ హిందీ భాషల్లో దాదాపు 260 చిత్రాల్లో నటించింది. 1990లో వచ్చిన “అల్లుడు గారు” తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నప్పటి నుంచీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. 1990 నుంచి 2000 ఈ పదేళ్లలో ఓ వెలుగు వెలిగింది రమ్య. చిరంజీవి,బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున లాంటి అగ్రహీరోలతోపాటూ దక్షిణాది అన్ని భాషల్లో అగ్రహీరోలందరితోనూ నటించింది. రాఘవేంద్రరావు వండర్స్ అల్లరి మొగుడు, మేజర్ చంద్రకాంత్, అల్లరి ప్రియుడు, ఘరానా బుల్లోడు, ముగ్గురు మొనగాళ్ళు, ముద్దుల ప్రియుడు, అన్నమయ్యలో రమ్యకృష్ణ నటన చూసేందుకు రెండు కళ్లు చాలవు. చిరంజీవితో అల్లుడా మజాకా, బాలకృష్ణతో బంగారుబుల్లోడు, వంశానికొక్కడు, నాగార్జునతో హలో బ్రదర్ నుంచి సోగ్గాడే చిన్నినాయన వరకూ ఆమె కెరీర్లో ఎన్నో సూపర్ హిట్స్. అప్పటి వరకూ గ్లామర్ పాత్రలు చేసిన రమ్య కెరీర్ని మార్చిన పాత్ర మాత్రం నీలాంబరి. నరసింహ సినిమా తర్వాత ఆమెకు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు ఎక్కువగా వచ్చాయి.
నవరసాలను అలవోకగా పలికించే అతికొద్ది నటుల్లో రమ్య టాప్ 5లోనే ఉంటుందని చెప్పుకోవాలి. నరసింహలో నీలాంబరి పాత్రను ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. వాస్తవానికి రజనీకాంత్ లాంటి హీరో ఉన్నప్పుడు స్క్రీన్ పై మరెవ్వరి నటనా కనిపించదు. కానీ ఆ సినిమాలో కొన్ని సీన్స్ లో రజనీకి దీటుగా నటించింది రమ్య. అప్పటి నుంచి ఎన్నో ఛాలెంజింగ్ రోల్స్‌లో నటించి మెప్పించింది. ’బాహుబలి’లో శివగామి పాత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బాహుబలి షూటింగ్ టైంలో ఓ సందర్భంలో ప్రభాస్ అన్న మాటని రాజమౌళి ఓ ఇంటర్యూలో చెప్పాడు. అదేంటంటే “ శివగామి పాత్రలో ఎంట్రీ ఇచ్చే సీన్‌లో రమ్యకృష్ణని చూసిన ప్రభాస్..ఈమె ముందు ఎంత నటిస్తే కనపడగలం డార్లింగ్’ అని జక్కన్నతో అన్నాడట. అప్పటికీ ఇప్పటికీ నటనలో తగ్గలేదామె. గ్లామర్, నటన రెండింటిలోనూ రమ్య నంబర్ వన్. ఇప్పటి యంగ్ హీరోయన్లకు కూడా షాకిస్తోంది అప్పుడప్పుడు.
సెప్టెంబర్ 15, 1967లో తమిళనాడులో జన్మించిన రమ్యకృష్ణ తమిళ సినిమా ‘వెళ్లై మనసు’తో కెరీర్ ప్రారంభించింది. హీరోయిన్‌గా నాగార్జున సరసన ఎక్కువ సినిమాల్లో నటించిన రమ్యకృష్ణ..సోగ్గాడే చిన్నినాయనే సినిమాలోనూ మరోసారి ముచ్చటైన జోడీ అనిపించుకుంది. రమ్యకృష్ణ-కృష్ణవంశీ దంపతులకు ఓ బాబు ఉన్నాడు. ప్రస్తుతం రమ్యకృష్ణ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతోన్న లైగర్లో నటిస్తోంది. అలాగే సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న రిపబ్లిక్ లోనూ ముఖ్యపాత్ర పోషిస్తోంది.