Raghava Lawrence: రజనీ మూవీలో లారెన్స్, సూపర్ స్టార్ కోసం విలన్ క్యారెక్టర్
ఎప్పటి నుంచో రజనీకాంత్ తో స్ర్కీన్ షేర్ చేసుకోవాలి అనుకుంటున్న లారెన్స్ కోరిక తీరబోతోంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం లో రూపొందుతున్న ‘తలైవర్ 171’లో కీలక పాత్ర పోషించబోతున్నారు.
‘జైలర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. రజనీ కెరీర్ లోనే ఈ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ‘జైలర్’ హిట్ తో ఫుల్ జోష్ ఉన్న రజనీకాంత్, వరుస సినిమాలను లైన్ లో పెట్టారు. 'జై భీమ్' ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీ ‘తలైవర్ 170’ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రంలో రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ లతో పాటు పలు ఇండస్ట్రీల నుంచి అనేక మంది టాలెంటెడ్ యాక్టర్స్ భాగం అవుతున్నారు. ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ మొదలయ్యింది.
రజనీ సినిమాలో విలన్ గా లారెన్స్
మరోవైపు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘తలైవర్ 171’ సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అదేంటంటే? ఈ మూవీలో ప్రముఖ దర్శకుడు, నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారట. నిజానికి రజనీకాంత్ కు లారెన్స్ వీరాభిమాని. ఆయనతో కలిసి నటించాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఇన్నాళ్లకు ఆయన కోరిక నెరవేరబోతోంది. లోకేష్ కనగరాజ్, రజినీ కాంబోలో వస్తున్న ఈ సినిమాలో పవర్ ఫుల్ నెగిటివ్ రోల్ చేయబోతున్నారట. రజినీ సినిమాలో ఏ పాత్ర చేయడానికైనా రెడీ అన్నారట లారెన్స్. సినిమా పాత్ర గురించి చెప్పగానే తను ఓకే చెప్పారట.
త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం
లారెన్స్ ఆఫర్ గురించి మూవీ మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ, తమిళ సినిమా పరిశ్రమలో జోరుగా చర్చ జరుగుతోంది. త్వరలోనే ఈ విషయాన్ని ప్రకటించే అవకాశం ఉందనే టాక్ నడుస్తుంది. నిజానికి లోకేష్ సినిమాల్లో హీరోలు విలన్స్ గా నటించడం కామన్. ఇప్పటి ఆయన తెరకెక్కించిన పలు చిత్రాల్లోనూ హీరోలు విలన్ క్యారెక్టర్స్ చేశారు. తాజాగా ఈ లిస్టులో లారెన్స్ కూడా చేరబోతున్నారనే వార్తలు వినిపించడంతో సినీ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో లారెన్స్ ఏ రేంజిలో కనిపిస్తారోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
రీసెంట్ గా, లోకేష్ ‘లియో’ సినిమాతో ప్రేక్షకుల ముందుక వచ్చారు. విజయ్ దళపతి హీరోగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బాగానే ఆడింది. అటు రాఘవ లారెన్స్ తాజాగా ‘చంద్రముఖి 2’తో థియేటర్లలోకి అడుగు పెట్టారు. అయితే, ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఇంకా చెప్పాలంటే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. త్వరలోనే ‘జిగర్తాండ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
Read Also: ‘మంగళవారం’ నుంచి మరో సాంగ్, ‘అప్పడప్పడ తాండ్ర’ అంటూ తరుణ్ భాస్కర్ రచ్చ!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial