Charmme Kaur: బాలీవుడ్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది, ‘లైగర్’ నిర్మాత ఛార్మీ భావోద్వేగం
లైగర్ రిలీజ్ తర్వాత ఛార్మి కౌర్ తొలిసారి స్పందించారు. మూడేళ్లు ఎంతో కష్టపడ్డా ఇలాంటి ఫలితం రావడం పట్ల బాధేస్తుందన్నారు..
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియన్ మూవీ ‘లైగర్’. భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా ఈ సినిమా విడుదల అయినా.. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని సినిమా యూనిట్ ప్రకటించినా.. తొలి షో నుంచే నెగెటివ్ టాక్ తెచ్చుకుని అట్టర్ ఫ్లాప్ సినిమాగా మిగిలిపోయింది. మైక్ టైసన్ లాంటి అంతర్జాతీయ బాక్సర్ ను తీసుకొచ్చి ఈచిత్రంలో నటించేలా చేసినా.. కథలో దమ్ములేకపోతే ఎవరూ నిలబెట్టలేరని నిరూపితం అయ్యింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయిందని టాక్. తొలి రోజు వసూళ్లు ఫర్వాలేదు అనిపించినా.. రెండో రోజు నుంచి ప్రేక్షకులు థియేట్లకు వెళ్లడమే మానేశారు. బాలీవుడ్ లో అయితే పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఈ సినిమాను అక్కడి ప్రేక్షకులు ఏమాత్రం ఆదరించలేదు. మొత్తంగా సౌత్ నుంచి నార్త్ వరకు లైగర్ పెద్ద ఫ్లాప్ సినిమాగా నిలిచింది.
తాజాగా లైగర్ సినిమా డిజాస్టర్ మీద నిర్మాత ఛార్మి స్పందిచారు. మూడేళ్ల పాటు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడినా.. చివరకు ఇలాంటి ఫలితం రావడం బాధిస్తుందని వెల్లడించారు. “ఈ రోజుల్లో ప్రజలు ఇంట్లో కూర్చొని ఒకే ఒక్క క్లిక్ తో మంచి కంటెంట్ ఉన్న సినిమాలను చూసే అవకాశం ఉంది. ఫ్యామిలీ అంతా ఇంట్లోనే భారీ బడ్జెట్ సినిమాలను చూస్తున్నారు. అందుకే, సినిమాలు వారిని ఎగ్జైట్ చేయనంత వరకు థియేటర్లకు వచ్చేందుకు ఇష్టపడటం లేదు. అలా ఎగ్జైట్ కలిగించిన బింబిసార, సీతారామం, కార్తికేయ-2 వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. సుమారు రూ 150 కోట్ల నుంచి రూ. 170 కోట్ల వరకు వసూలు చేశాయి. బాలీవుడ్‌లో పరిస్థితి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉంది. ఒక్క మాటలో చెప్పలంటే అత్యంత దారుణంగా ఉంది. 2019 నుంచి లైగర్ కోసం ఎంతో కష్టపడ్డాం. కరోనా కారణంగా చాలా ఇబ్బందులు పడ్డాం. వాటన్నింటినీ ఎదుర్కొని మూడేళ్ల తర్వాత లైగర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాం. అడ్డంకులను దాటుకుంటూ థియేటర్‌లో విడుదల చేశాం. కానీ, సినిమా ఫ్లాప్ అయ్యింది. ఇన్నాళ్ల తమ కష్టం వృథా అయ్యిందనే బాధ మమ్మల్ని వెంటాడుతుంది” అని ఛార్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. కీలక పాత్రల్లో రమ్య కృష్ణ, మైక్ టైసన్ నటించారు. బాలీవుడ్ దిగ్గజ దర్శక నిర్మాత కరణ్ జోహార్, ఛార్మి కౌర్, పూరి జగన్నాథ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. కథ, కథనం, దర్శకత్వం లోపం కారణంగానే ఈ సినిమా ఫ్లాప్ అయినట్లు పలువురు సినీ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. మరోవైపు బాయ్ కాట్ బాలీవుడ్ లాంటి వివాదాస్పద అంశాల్లో విజయ్ దేవరకొండ తలదూర్చడం, విపరీతమైన ఆటిట్యూడ్ చూపించడం మూలంగానే సినిమా ఫ్లాప్ అయ్యిందని మరికొందరు విమర్శిస్తున్నారు.
Also Read : హిందీ నటుడు, విమర్శకుడు కేఆర్కేను అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు