Poonam Kaur Health Update: పూనమ్ కౌర్ ఆరోగ్యంపై అప్‌డేట్, రెండేళ్లుగా ఆ వ్యాధితో పోరాటం!
నటి పూనమ్ కౌర్ ఆరోగ్యంపై అధికారిక ప్రకటన వచ్చింది. తన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు జాతీయ చేనేత దినోత్సవ రూపకర్త యర్రమాద వెంకన్న నేత వెల్లడించారు.
కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్న పూనమ్ కౌర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు జాతీయ చేనేత దినోత్సవ రూపకర్త యర్రమాద వెంకన్న నేత తెలిపారు. ఆమె ఆరోగ్యం గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. పూనమ్ హెల్త్ కండీషన్ గురించి ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా పూనమ్ ఎలా అనారోగ్యం పాలైందో వివరించారు.
ఈ నెల 12న కేరళకు వెళ్లిన పూనమ్
గత సంవత్సర కాలంగా జీరో జీఎస్టీ ఉద్యమంలో పూనమ్ చురుగ్గా పాల్గొంటున్నట్లు వెంకన్న చెప్పారు. నవంబర్ 10న తమతో కలిసి సూరత్ గాంధీ పార్కులో చేనేతపై పన్ను ఎత్తివేయాలని చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నట్లు వెల్లడించారు. 11న సబర్మతి ఆశ్రమంలో మౌన దీక్ష చేసిన తర్వాత, 12న ఢిల్లీలో జరిగే బ్రహ్మకుమారి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారని చెప్పారు. ఢిల్లీలో ఆమెకు వెన్ను నొప్పి రావడంతో, చికిత్స కోసం కేరళ వెళ్లినట్లు తెలిపారు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకునే క్రమంలో ఆమెకు ఫైబ్రో మైయాల్జియా నిర్ధారణ అయ్యింది. కేరళలో ట్రీట్మెంట్ అనంతరం ఆమె ప్రస్తుతం మహారాష్ట్రలో విశ్రాంతి తీసుకుంటుంది. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఆమె త్వరలోనే కోలుకుంటారనే పూర్తి ఆత్మశ్వాసంతో ఉన్నట్లు వెంకన్న వెల్లడించారు.
2 ఏండ్లుగా పూనమ్ కు అరుదైన రుగ్మత
పూనమ్ సుమారు రెండు సంవత్సరాలుగా ఈ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ రుగ్మత కారణంగా చాలా ఇబ్బందులు పడుతోందట. ఫైబ్రో మైయాల్జియా కారణంగా అలసట, నిద్ర, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, మానసిక స్థితిలో సమస్యలు, కండరాల నొప్పి సహా పలు ఇబ్బందులు పడుతోందట. తాజాగా తన చికిత్సకు సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కేరళలో ఆయుర్వేద చికిత్స
కేరళలోని ఆయుర్వేద నిపుణులు పూనమ్ కు ప్రత్యేక చికిత్స అందించారు. గత కొంత కాలంగా ఆమె అక్కడే ఉండి చికిత్స తీసుకున్నది. వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స పొందింది. ఎక్సర్ సైజ్, టాకింగ్ థెరఫీతో పాటు సరైన సమయానికి మందులు తీసుకుంటోంది. గత కొంతకాలంగా తీసుకుంటున్న చికిత్స మెరుగైన ఫలితాలను ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇంత కాలం ఈ విషయాన్ని పూనమ్ రహస్యంగా ఉంచింది. తాజాగా ఆమె చికిత్సకు సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో అసలు విషయం వెల్లడైంది.
రాహుల్ జోడో యాత్రలో పాల్గొన్న పూనమ్
తాజాగా పూనమ్ కౌర్ రాహుల్ గాంధీ జోడో యాత్రలో పాల్గొన్నది. ఈ సందర్భంగా తన చేతిని పట్టుకుని నడవడం పట్ల తీవ్ర విమర్శలు వచ్చాయి. వాటికి పూనమ్ కౌంటర్ ఇచ్చింది. తాను పడిపోతుంటే రాహుల్ పట్టుకున్నారని వివరణ ఇచ్చింది. ఇలాంటి విషయాలపై విమర్శలు చేయడం సరికాదని వెల్లడించింది. ఈ యాత్రలో రాహుల్ గాంధీకి చేనేత కార్మికుల సమస్యలను వివరించింది. వారికి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరింది.
Read Also: పూనమ్ కౌర్ కు అరుదైన వ్యాధి, కేరళలో చికిత్స