Rahul Ramakrishna: ‘గాంధీ గొప్పవాడని నేను అనుకోను’.. నటుడు రాహుల్ రామకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు!
నటుడు రాహుల్ రామకృష్ణకు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కామన్ అయిపోయింది. తాజాగా, జాతిపిత మహాత్మాగాంధీ మీదపడ్డాడు. ట్విట్టర్ వేదికగా ఆయనపై కాంట్రవర్శియల్ కామెంట్ చేశాడు.
టాలీవుడ్ లో తనదైన నటనా శైలితో వరుస సినిమాలు చేస్తున్న రామకృష్ణ, ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో తలదూర్చుతూ వార్తల్లో నిలుస్తునే ఉంటున్నాడు. సమయం సందర్భం లేకుండా ట్విట్టర్లో ఏదో ఒక పోస్టు పెట్టడం, ఆ తర్వాత దాన్ని డిలీట్ చేయడం కామన్ అయ్యింది. ఇవాళ గాంధీ జయంతి కావడంతో అందరూ ఆ మహనీయుడికి నివాళులర్పించి.. దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఆయన పోరాట పటిమను పలువురు కొనియాడుతుండగా.. రాహుల్ రామకృష్ణ మాత్రం ఆయనపై వివాదాస్పద పోస్టు పెట్టాడు. ట్విట్టర్ వేదికగా.. ‘గాంధీ గొప్పవాడని నేను అనుకోను’ అంటూ ట్వీట్ చేశాడు. రాహుల్ రామకృష్ణ ట్వీట్ మీద పలువురు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆయన గ్రేట్ కాదు.. నువ్వే గ్రేట్ అన్నా అంటూ విరుచుకుపడుతున్నారు. ఇవాళ మందు దొరకదు కదా.. అందుకే పిచ్చిలేచి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని విమర్శిస్తున్నారు. మరికొన్ని రాజకీయ పార్టీల నాయకులు సైతం రామకృష్ణ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతున్నారు.
I don’t think Gandhi was great
— Rahul Ramakrishna (@eyrahul) October 2, 2022
రాహుల్ రామకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో పలు మార్లు ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. కొన్నిసార్లు తన పోస్టులను డిలీట్ కూడా చేసిన సందర్భాలున్నాయి. సినిమా రివ్యూలు రాసిన వారి మీద అడ్డగోలుగా మాట్లాడి తీవ్ర ట్రోల్ కు గురయ్యాడు. సినిమా బాగాలేదు అన్న వారిపై “గు.. దమ్ముంటే.. సినిమా తీయండ్రా ఇడియట్స్” అంటూ ట్వీట్ చేశాడు. ఉన్నమాట అంటే ఉలుకెందుకు అంటూ ఆయనపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడటంతో వెనక్కి తగ్గి ట్వీట్ డిలీట్ చేశాడు. మళ్లీ ఇప్పుడు గాంధీ మీద పడ్డాడు.
ఇక తెలుగు సినిమా పరిశ్రమలో తెలంగాణ నుంచి మంచి నటుడిగా గుర్తింపు సంపాదించాడు రాహుల్ రామకృష్ణ. కొద్ది రోజుల్లోనే తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. తొలుత తరుణ్ భాస్కర్ చేసిన ‘సైన్మా’ అనే షార్ట్ ఫిలిం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రాహుల్.. ఆ తర్వాత’జయమ్ము నిశ్చయమ్మురా’ అనే సినిమాతో వెండితెర మీద దర్శనం ఇచ్చాడు. ఈ సినిమాలోనూ మంచి నటన కనబర్చాడు. వెంటనే విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ వంగా తెరకెక్కించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాలోనూ కీలకపాత్ర పోషించాడు. ఈ సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తున్నాడు. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు. తన సినిమాల వివరాలు చెప్పడంతో పాటు పలు రాజకీయ, సామాజిక విషయాల మీద కూడా తను స్పందిస్తుంటాడు. రాహుల్ చివరగా నటించిన సినిమా ‘విరాట్ పర్వం’. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది.
Also read: విడాకుల కోసం కోర్టుకెక్కిన కలర్స్ స్వాతి, అప్పుడు వద్దన్నా పెళ్లి చేసుకుని ఇప్పుడిలా!