Bandla Ganesh: యువ హీరోలకు బండ్ల గణేష్ క్లాస్, మండిపడుతున్న నెటిజన్లు!
బండ్ల గణేష్ తాజాగా చేసిన ఓ ట్వీట్ పై నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఓ ఈవెంట్ లో యువ హీరోలు కూర్చున్న తీరును పవన్ తో పోల్చుతూ సంస్కారం గురించి క్లాస్ పీకారు బండ్ల.
ఏం చేసినా పద్దతిగా ఉండాలి. పద్దతి తప్పితే పెంటవుతుంది. అభిమానం ఉండాలి. ఆ అభిమానం ఉన్మాదంగా మారితేనే ప్రమాదం. ఆ మాట అంటోంది మరెవ్వరో కాదు.. సినీ ప్రేమికులు. తాజాగా నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చేసిన ఓ ట్వీట్ నెటిజన్లకు ఆగ్రహాన్ని కలిగిస్తోంది. దీంతో అంతా ఆయన్ని బాగా ట్రోల్ చేస్తున్నారు. అభిమానముంటే మనసులో పెట్టుకోవాలి గానీ, ఇతర హీరోలను తక్కువ చేసిన మాట్లాడకూడదని మండిపడుతున్నారు. తాజాగా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కి యంగ్ హీరోలు అడివిశేష్, సిద్ధూ జొన్నలగడ్డ సహా పలువురు హాజరయ్యారు. ఈవెంట్లో పెద్ద నటులు గానీ, సినీ పెద్దలు గానీ లేరు. దీంతో ఆ హీరోలు కాళ్లు పైకి పెట్టుకుని కంఫర్టుగా కూర్చున్నారు.
బండ్ల గణేష్ ఈ యువ హీరోలు కూర్చున్న ఫోటోని, ఒక ఆడియో వేడుకలో పవన్ పద్దతిగా కూర్చున్న ఫోటోను షేర్ చేశారు. ‘నమస్కారానికి నిలువెత్తు నిదర్శనం మా దేవర పవన్ కళ్యాణ్. దయచేసి నేర్చుకోండి. ఆచరించండి. అది మన ధర్మం’ అంటూ పోస్ట్ చేశాడు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక నెటిజన్లు బండ్లన్నను ఓ రేంజిలో ఆడుకుంటున్నారు. వాళ్ల మానాన వాళ్లేదో సరదాగా కూర్చున్నారు అక్కడ ఎక్కరికీ లేని బాధ నీకెందుకంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ హీరోని పొగడాలని ఇతర హీరోలను తిట్టాల్సిన అవసరం లేదంటూ కామెంట్ చేస్తున్నారు.
నమస్కారానికి నిలువెత్తు నిదర్శనం మా దేవర దయచేసి నేర్చుకోండి ఆచరించండి అది మన ధర్మం @PawanKalyan 🙏 pic.twitter.com/3nkOVsMIor
— BANDLA GANESH. (@ganeshbandla) September 13, 2022
వాస్తవానికి పవన్ కల్యాణ్ అంటే బండ్ల గణేష్ కు ఎక్కడ లేని అభిమానం. ఆయన కోసం ఏం చేయడానికైనా రెడీ అంటారు. పవన్ ను గౌరవంగా దేవర అంటారు. అయితే, ఆయన అడ్డగోలుగా పెట్టే ట్వీట్లను చూసి పవన్ అభిమానులు సైతం ఒక్కోసారి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. తాజాగా పవన్ కల్యాణ్ తో యంగ్ హీరోలను పోల్చడంపైనా పవర్ స్టార్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఎవరితోనైనా గొడవలు ఉంటే పర్సనల్ గా చూసుకోవాలి తప్ప.. సోషల్ మీడియా గోడలు ఎక్కి అడ్డగోలుగా మాట్లాడకూడదని బండ్ల గణేష్ కు పవన్ అభిమానులు సూచిస్తున్నారు. నెటిజన్లు సైతం బండ్ల తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు. అది నమస్కారం కాదు సంస్కారం ముందు నువ్వు భాష నేర్చుకో అంటే మరికొంత మంది కౌంటర్ ఇస్తున్నారు. ఎక్కడివో ఫొటోలు తెచ్చి మరేదో విషయాన్ని చెప్పడం అంటే.. మోకాలికి బోడిగుండుకు లంకెపెట్టడం లాంటిదే అవుతుందని మండిపడుతున్నారు. ఇలాంటి పోస్టులు చేయడం తగదని హితవు పలుకుతున్నారు. సోషల్ మీడియాలో వపన్ పరువు తీయకండని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : బాయ్‌కాట్ ట్రెండ్‌ను తీసి పారేసిన నాగార్జున - వందో సినిమా గురించి ఏం చెప్పారంటే?