Heeramandi Season 2: ‘హీరామండి’ సీజన్ 2 ప్రకటించిన సంజయ్‌లీలా బన్సాలీ - స్టోరీ ముందే చెప్పేశారు!
Heeramandi Season 2: సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘హీరామండి’ వెబ్ సిరీస్‌కు మిక్స్‌డ్ టాక్ లభించినా ఇప్పటికీ ఇది ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. దీంతో సీజన్ 2 అనౌన్స్‌మెంట్ ఇచ్చారు మేకర్స్.
Heeramandi Season 2 Announcement: సంజల్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేసిన వెబ్ సిరీస్ ‘హీరామండి’కి కూడా సీక్వెల్ ఉంటే బాగుంటుందని చాలామంది ప్రేక్షకులు అనుకున్నాను. నెల క్రితం విడుదలయిన ఈ సిరీస్.. ఇప్పటికీ నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 10వ స్థానాల్లో ఒకటిగా దూసుకుపోతోంది. అందుకే మేకర్స్ సైతం దీని సీక్వెల్‌పై దృష్టిపెట్టారు. అంతే కాకుండా ‘హీరామండి’ సీజన్ 2 గురించి అనౌన్స్‌మెంట్ ఇవ్వడం కోసం ముంబాయ్‌లో భారీ డ్యాన్స్ ఫీస్ట్‌ను ఏర్పాటు చేశారు.
యుద్ధం ముగిసిపోలేదు..
దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఏం చేసినా రిచ్‌గానే ఉంటుందని ఫ్యాన్స్ అంటుంటారు. అదే విధంగా ‘హీరామండి’ సీజన్ 2 అనౌన్స్‌మెంట్ కూడా ఆయన రిచ్‌గానే ప్లాన్ చేశారు. ముంబాయ్‌లోని మెరీన్ డ్రైవ్ వద్ద దాదాపు 100 మంది డ్యాన్సర్లు వచ్చి ఒక్కసారిగా ‘హీరామండి’ సిరీస్‌లోని పాటలకు డ్యాన్స్ చేశారు. ఈ పర్ఫార్మెన్స్ అంతా తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది నెట్‌ఫ్లిక్స్. ఇక ఈ పర్ఫార్మెన్స్ పూర్తయిన తర్వాత సంజయ్ లీలా భన్సాలీ వాయిస్ ఓవర్‌తో అనౌన్స్‌మెంట్ వచ్చింది. ‘‘1947లో స్వాతంత్ర్యం కోసం యుద్ధం ముగిసింది. కానీ ఆడవాళ్ల యుద్ధం మాత్రం ఎప్పుడూ ముగిసిపోదు’’ అని చెప్పుకొచ్చారు భన్సాలీ.
View this post on Instagram
మనసు మార్చుకున్నాడు..
‘‘ఈసారి ఈ ఆడవాళ్లంతా ఒక కొత్త యుద్ధాన్ని మొదలుపెట్టారు. ఒక కొత్త ప్రపంచంలో తలెత్తుకొని బ్రతకడానికి యుద్ధం’’ అనే అనౌన్స్‌మెంట్‌తో ‘హీరామండి’ సీజన్ 2తో తిరిగొస్తుందని స్పష్టం చేశారు సంజయ్ లీలా భన్సాలీ. ‘హీరామండి’ కోసం ప్రమోషన్స్ చేస్తున్న సమయంలో మాత్రం దీనికి సీజన్ 2 ఉండదని తేల్చిచెప్పాడు. ‘‘ఇలాంటి వెబ్ సిరీస్‌లు అరుదుగా వస్తాయి. నేను తలచుకున్నా కూడా దీనిని మళ్లీ తెరకెక్కించలేను’’ అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. కానీ ఇంతలోనే ‘హీరామండి’ సీజన్ 1కు వచ్చిన రెస్పాన్స్ చూసి తన మనసు మార్చుకున్నట్టు ఉన్నాడు సంజయ్ లీలా భన్సాలీ.
అదే కథ..
‘హీరామండి’ ప్రమోషన్స్ సమయంలోనే తన దగ్గర సీజన్ 2కు సంబంధించిన ఐడియా కూడా ఉందని తెలిపారు భన్సాలీ. ‘‘స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత హీరామండిలో నివసించే ఆడవారు అంతా సినిమా ప్రపంచంలోకి వచ్చేస్తారు. అందులో కొందరు ముంబాయ్ సినీ పరిశ్రమలో సెటిల్ అయితే మరికొందరు కోల్‌కత్తాలోని సినీ పరిశ్రమలో సెటిల్ అవుతారు. కానీ వారి జీవితాల్లో మాత్రం ఎలాంటి మార్పు రాదు. ఒకప్పుడు నవాబుల ముందు డ్యాన్స్ చేసే ఈ ఆడవాళ్లు.. ఆ తర్వాత నిర్మాతల ముందు డ్యాన్స్ చేయడం మొదలుపెడతారు’’ అంటూ ‘హీరామండి 2’ స్టోరీని ఎప్పుడో బయటపెట్టేశారు సంజయ్ లీలా భన్సాలీ.