Best Horror Movies On OTT: లేక్‌లో లేడీ దెయ్యం, అందంగా ఉందని కక్కుర్తిపడితే చచ్చారే - ఆమెను ప్రేమిస్తే ఏమవుతుంది? ఇదో వెరైటీ హర్రర్ మూవీ
Movie Suggestions: ఆ చెరువులో దెయ్యం ఉంది. దాని దగ్గరకు వెళ్లొద్దు. అబ్బాయిలు అయితే అస్సలే వెళ్లొద్దు. ఇంతకీ ఆ చెరువులోకి దెయ్యం కథ తెలుసుకోవాలంటే ‘ది మెర్మెయిడ్ లేక్ ఆఫ్ ది డెడ్’ సినిమా చూడాల్సిందే.
Best Horror Movies On OTT: ఆ చెరువు దగ్గరకు వెళ్లొద్దు. అందులో దెయ్యం ఉంటుంది. ఇదే డైలాగ్‌తో మొదలవుతుంది ఈ హారర్ మూవీ. దాని పేరే ‘ది మెర్మెయిడ్ లేక్ ఆఫ్ ది డెడ్’ (Mermaid Lake Of The Dead). ఈ సినిమా కథ మొత్తం ఆ చెరువు చుట్టూ, అందులోని దెయ్యం చుట్టూనే తిరుగుతుంది. నీళ్లలో దెయ్యం ఉండే కథలు చాలానే ఉన్నాయి కానీ ‘ది మెర్మెయిడ్ లేక్ ఆఫ్ ది డెడ్’ కాస్త డిఫరెంట్. ప్రతీ సినిమాలో దెయ్యానికి ఒక ఫ్లాష్‌బ్యాక్ ఉంటుంది, దాన్ని కంట్రోల్ చేయడానికి ఒక ప్లాన్ ఉంటుంది. అలాంటివన్నీ ఈ మూవీలో ఉన్నా కానీ వాటిని కాస్త డిఫరెంట్‌గా, క్రియేటివ్‌గా ప్రజెంట్ చేశాడు దర్శకుడు.
కథ..
‘ది మెర్మెయిడ్ లేక్ ఆఫ్ ది డెడ్’ కథ విషయానికొస్తే.. ఈ సినిమా టైటిల్ కార్డ్స్‌లోనే కథను చెప్పేస్తారు. ఒక లేక్‌లో దెయ్యం ఉంటుంది. అక్కడికి ఎవరైనా అబ్బాయి వస్తే ఆ దెయ్యం లేక్‌లో నుంచి బయటికి వచ్చి వారిని పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది. ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటున్నాను అని వారు చెప్తే.. తనతో పాటు ఆ లేక్‌లోకి తీసుకెళ్లిపోతుంది. ఒకవేళ అలా కాదంటే వారికి కావాల్సిన వారిని చంపేస్తుంది. టైటిల్ కార్డ్స్‌లోనే ఈ కథను మొత్తం చెప్పేస్తారు. ఆ తర్వాత ఆ లేక్ దగ్గరే సినిమా మొదలవుతుంది.
భార్యాభర్తలు అక్కడ నిలబడి లేక్ వైపు చూస్తూ ఉంటారు. ఉన్నట్టుండి భర్త కళ్లు ఎర్రగా మారిపోతాయి. ఆ తర్వాత తనను ఆ లేక్‌లోకి లాగేసుకుంటుంది దెయ్యం. తన భర్తను కాపాడే క్రమంలో భార్య తన ప్రాణాలు కోల్పోతుంది. కట్ చేస్తే.. సినిమాలో మరో కథ మొదలవుతుంది. మరీనా (విక్టోరియా అగలకోవా), రోమా (ఎఫీమ్ పెట్రూనిన్).. ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతారు. దీంతో వాళ్ల ఫ్రెండ్ ఇల్యా (నికాతా ఎలెనేవ్).. రోమాను బ్యాచిలర్ పార్టీ అడుగుతాడు. దీంతో వారిద్దరూ కలిసి రోమా తండ్రికి చెందిన ఒక లేక్ హౌజ్ దగ్గరకు వెళ్తారు.
వాళ్ల ఫ్రెండ్స్ అంతా ఎంజాయ్ చేస్తున్న సమయంలో రోమా.. ఆ లేక్ దగ్గరకు వెళ్లి స్విమ్మింగ్ చేస్తుంటాడు. అదే సమయంలో అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది. తన అందాన్ని చూసి అట్రాక్ట్ అయిన రోమా.. తెలియకుండానే తనకు ముద్దుపెట్టేసి స్పృహతప్పి పడిపోతాడు. ఆ మరుసటి రోజు రోమా బట్టల్లో ఆ అమ్మాయి దువ్వెన దొరుకుతుంది. దానిని మరీనా కూడా చూస్తుంది కానీ పెద్దగా పట్టించుకోదు. ఆ తర్వాత రోమాకు జ్వరం వచ్చిందని తన దగ్గరకు వచ్చి చూసుకుంటుంది మరీనా. అదే సమయంలో రోమా.. లేక్ దగ్గర చూసిన అమ్మాయిని ఊహించుకుంటూ నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్తుంటాడు. మరీనా.. తననే ఇలా అంటున్నాడని ఫీల్ అయ్యి అక్కడ నుంచి వెళ్లిపోతుంది.
మీ తమ్ముడికి తనపై ప్రేమలేదని అంటున్నాడని రోమా అక్క ఓల్గా (సిసిలీ ప్లేగ్)తో చెప్పి బాధపడుతుంది మరీనా. అంతే కాకుండా రోమా బట్టల్లో దొరికిన దువ్వెనను చూపిస్తుంది. అది వాళ్ల అమ్మ దువ్వెన అని తెలుసుకున్న ఓల్గా ఆశర్యపోతుంది. కానీ ఆ విషయాన్ని ఎవరికీ చెప్పదు. అప్పటినుంచి ఆ దెయ్యం.. రోమాను అటాక్ చేస్తూనే ఉంటుంది. దీంతో తన తమ్ముడికి ప్రమాదం ఉందని తెలుసుకున్న ఓల్గా.. అందరితో కలిసి తమ తండ్రిని కలుస్తుంది. వాళ్ల తండ్రి మరెవరో కాదు.. సినిమా మొదట్లో తన భార్యను పోగొట్టుకున్న వ్యక్తే. రోమా తండ్రి ఆ దెయ్యం గురించి మొత్తం వారితో చెప్తాడు. దానిని చంపడానికి మార్గం వెతకాలని అంటాడు. దీంతో అందరూ కలిసి అసలు ఆ దెయ్యం ఎవరు? ఎందుకిలా చేస్తుంది? అని తెలుసుకునే ప్రయత్నాలు మొదలుపెడతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెరపై చూడాల్సిందే.
క్లైమాక్స్ హైలెట్..
మమూలుగా హారర్ సినిమాలన్నీ దాదాపుగా ఒకే కథతో ఉంటాయని చాలామంది ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయి ఉంటారు. ‘ది మెర్మెయిడ్ లేక్ ఆఫ్ ది డెడ్’ కూడా అలాంటి రొటీన్ కథతో ప్రారంభమయినా కూడా క్లైమాక్స్‌కు చేరుకుంటున్నాకొద్దీ అసలు సినిమాలో తరువాత ఏం జరుగుతుంది అనేది ప్రేక్షకులు గెస్ చేయలేరు. ఇక ఈ మూవీలో హారర్ ఎలిమెంట్స్, భయపెట్టే సీన్స్ అయితే చాలావరకు వర్కవుట్ అవుతాయి. ఆడియన్స్‌ను ఉలిక్కిపడేలా చేస్తాయి. ఒరిజినల్‌గా రష్యాలో తెరకెక్కిన ‘ది మెర్మెయిడ్ లేక్ ఆఫ్ ది డెడ్’.. ఇంగ్లీష్‌లో కూడా అందుబాటులో ఉంది. దీనిని ‘అమెజాన్ ప్రైమ్’లో లేదా ‘యాపిల్ టీవీ’లో చూడవచ్చు.
Also Read: కూతురిని చంపాలనుకునే తల్లిదండ్రులు - మైండ్‌తోనే అన్నీ కంట్రోల్ చేసే ఆమె.. తన చావును తప్పించుకోగలదా?