Mayasabha Climax: 'మయసభ' క్లైమాక్స్... ఎన్టీఆర్, చంద్రబాబులను ఒక్కటి చేసిన నారా లోకేష్ - ఎలాగంటే?
Mayasabha SonyLiv: ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పుడు చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత మామ అల్లుళ్లను ఒక్కటి చేసింది లోకేష్, వైయస్సార్ అన్నట్టు 'మయసభ'లో చూపించారు.

'మయసభ' ఎవరి బయోపిక్ కాదని, తాను తీసిన సిరీస్‌లో మెయిన్ క్యారెక్టర్లు నారా చంద్రబాబు నాయుడు, వైయస్ రాజశేఖర్ రెడ్డి కాదని షో రన్నర్ - దర్శకుడు దేవా కట్టా (Deva Katta) ఎంత బలంగా చెప్పినా వినే స్థితిలో ఆడియన్స్ లేరు. కథతో పాటు క్యారెక్టర్లు, సన్నివేశాల్లో అంత బలమైన సారూప్యతలు ఉన్నాయి కనుక! సిరీస్ మొత్తం మీద ఎండింగ్ హైలైట్‌గా నిలిచింది. ఎందుకంటే...
మామకు వ్యతిరేకంగా విమర్శలు చేసిన అల్లుడు
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు (NT Rama Rao) పార్టీ స్థాపించి, ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆయన అల్లుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మామకు వ్యతిరేకంగా విమర్శలు చేశారు. అయితే... మళ్ళీ ఎన్టీఆర్, చంద్రబాబును ఒక్కటి చేసింది నారా లోకేష్ (Nara Lokesh) జననం అన్నట్టు 'మయసభ' క్లైమాక్స్ ఉంది.
ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్, వైయస్సార్ అంటే దేవా కట్టా ఒప్పుకోరు. ఆయన తీసిన సిరీస్ క్లైమాక్స్ చూస్తే... ఆంధ్రప్రదేశ్ - తెలుగు ప్రజలు దేవుడిగా కొలిచే అగ్ర కథానాయకుడు ఆర్‌సిఆర్ అలియాస్ రాయపాటి చక్రధర రావు. ఏపీలో ముఖ్యమంత్రులను తన ఇష్టం వచ్చినట్టు మారుస్తూ, వాళ్ళను కీలుబొమ్మలు చేసి ఆడిస్తూ తెలుగు ప్రజలకు అసలు ఏమాత్రం గౌరవం ఇవ్వని ప్రధాని ఐరావతి బసు తీరు పట్ల ఆర్‌సిఆర్ చలించిపోతారు. వీర తెలుగు పార్టీ స్థాపిస్తారు. ఆర్‌సిఆర్ అల్లుడు కృష్ణమనాయుడు అప్పటికి ఎమ్మెల్యే. ఆయన ఐరావతి బసు పార్టీలో ఉంటారు. ఆవిడ ఆదేశాల మేరకు మావయ్య మీద, ఆయన స్థాపించిన పార్టీ మీద విమర్శలు చేస్తారు. అయితే... అల్లుడిని ఆర్‌సిఆర్ ఒక్క మాట కూడా అనరు. ఇంటి పక్షి ఏనాటికైనా ఇంటికి చేరుతుందని కుటుంబ సభ్యులకు చెబుతారు.
మామ అల్లుళ్లను ఒక్కటి చేసిన లోకేష్ జననం
Nara Lokesh Role In Mayasabha: ఆర్‌సిఆర్ ఊహించినట్టు ఇంటి పక్షి ఇంటికి చేరుతుంది. అయితే దాని వెనుక ఓ జననం ఉంది. మావయ్య స్థాపించిన పార్టీ అఖండ విజయం సాధించడంతో పాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అల్లుడు ఏమో ఓటమితో ఒంటరి అవుతారు. పార్టీ స్థాపించడానికి ముందు ఆర్‌సిఆర్ కుమార్తె, కృష్ణమనాయుడు భార్య గర్భవతి అవుతుంది. పుట్టింటికి వెళుతుంది. ఎన్నికల్లో ఆర్‌సిఆర్ గెలిచిన తర్వాత బిడ్డకు జన్మ ఇస్తుంది. కుమారుడిని చూడటం కోసం ఆస్పత్రికి వెళ్లిన అల్లుడికి పార్టీ సభ్యత్వం ఇస్తారు మావయ్య. మరోవైపు భార్య సైతం కుటుంబాన్ని కాదనుకోవద్దని చెబుతుంది. రాజకీయ పరంగా తాతయ్య, తండ్రి మధ్య పెరిగిన దూరాన్ని తుంచేసి ఇద్దరినీ ఒక్కటి చేస్తాడు అబ్బాయి. ఆస్పత్రికి కృష్ణమనాయుడిని ఎంఎస్ రామిరెడ్డి తీసుకు వెళతారు.
ఆర్‌సిఆర్ అంటే ఎన్టీఆర్ అని, కృష్ణమనాయుడు అంటే చంద్రబాబు అని, ఆ బిడ్డ లోకేష్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంట! దేవా కట్టా కాదని అంటున్నా ప్రజలను ఆ పాత్రలను అలాగే చూస్తున్నారు. లోకేష్ పుట్టిన తర్వాత చంద్రబాబును ఆస్పత్రికి తీసుకు వెళ్ళినది రాజశేఖర్ రెడ్డి అనేది ఎవరికీ తెలియని విషయం. అక్కడ స్వేచ్ఛ తీసుకుని, దర్శక రచయితలు ఫిక్షన్ యాడ్ చేసి ఉండొచ్చు.
కాకర్ల కృష్ణమనాయుడు (చంద్రబాబు), ఎంఎస్ రామిరెడ్డి (రాజశేఖర్ రెడ్డి) ఎలా స్నేహితులు అయ్యారు? రాజకీయ పరంగా వాళ్ళ దారులు ఎలా వేరు అయ్యాయి? అనేది 'మయసభ'లో చూపించారు. పార్టీని రక్షించుకోవడం కోసం మామకు అల్లుడు ఎదురు తిరగడం వంటి చారిత్రక ఘట్టాలను ఎలా తీశారనేది తెలుసుకోవడం కోసం 'మయసభ' సీజన్ 2 వచ్చే వరకు వెయిట్ చేయాలి.





















