Constable Kanakam vs Viraatapalem: కానిస్టేబుల్ కనకం vs విరాటపాలెం... రెండు కథలూ ఒక్కటేనా? కాపీ కాంట్రవర్సీ వెనుక కారణం ఏమిటంటే?
Constable Kanakam OTT Streaming: ఈటీవీ విన్ ఒరిజినల్ సిరీస్ 'కానిస్టేబుల్ కనకం' ప్రీమియర్ షో వేశారు. మరి ఈ కథ, 'విరాటపాలెం' కథ ఒక్కటేనా? కొన్ని రోజుల క్రితం తలెత్తిన వివాదంలో నిజమెంత?

జీ5 ఓటీటీలో 'విరాటపాలెం' వెబ్ సిరీస్ (Viraatapalem Web Series) విడుదలకు ముందు సంగతి... స్ట్రీమింగ్ అవ్వడానికి పట్టుమని వారం రోజులు కూడా లేని టైంలో ఈటీవీ విన్ (ETV Win) నుంచి ప్రెస్ మీట్ పెట్టారు. 'కానిస్టేబుల్ కనకం' వెబ్ సిరీస్ కథతో 'విరాటపాలెం' తీశారని ఆరోపించారు. చట్టపరమైన పోరాటం చేస్తామని తెలిపారు. కోర్టు మెట్లు ఎక్కారు. 'విరాటపాలెం' విడుదలైంది. తర్వాత వివాదం వెలుగులో లేకుండా పోయింది. ఇప్పుడు 'కానిస్టేబుల్ కనకం' స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ప్రీమియర్ షో వేశారు. మరి రెండిటిలో కథ ఒక్కటేనా? ఎందులో ఏముంది? అనేది చూస్తే...
రెండిటిలో మెయిన్ లీడ్ కానిస్టేబుల్...
అక్కడ అభిజ్ఞ... ఇక్కడ వర్షా బొల్లమ్మ!
'విరాటపాలెం', 'కానిస్టేబుల్ కనకం'... రెండు సిరీస్‌లలో మెయిన్ లీడ్ క్యారెక్టర్ ఒక్కటే. కానిస్టేబుల్! ఒక మారుమూల పల్లెలో కొత్తగా పోస్టింగ్ తీసుకుని వెళ్లిన అమ్మాయిలు.
'విరాటపాలెం'లో అభిజ్ఞ అభిజ్ఞ వూతలూరు... 'కానిస్టేబుల్ కనకం'లో వర్షా బొల్లమ్మ... ఆల్మోస్ట్ ఆల్ కెరీర్ పరంగా ఇద్దరివీ సిమిలర్ క్యారెక్టర్లు. ఇద్దరికీ తమ తమ పోలీస్ స్టేషన్లలో బాస్ (సీఐ) నుంచి ఆశించిన మద్దతు లభించదు. అంతకు మించి క్యారెక్టర్స్ పరంగా పోలిక లేదు.
'కానిస్టేబుల్ కనకం' కథ కాపీ చేశారా?
'విరాటపాలెం'లో ఏముంది? రెండూ ఒక్కటేనా?
Comparison of Constable Kanakam and Viratapalem stories: 'విరాటపాలెం' సిరీస్ విడుదలైంది కనుక అందులో కథ ఏమిటి? అనేది చూస్తే... ఓ మారుమూల పల్లెలోని పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా జాయిన్ అవుతుందో అమ్మాయి. ఆ ఊరికి ఓ శాపం ఉంటుంది. ఊరిలో పెళ్లి జరిగితే నవ వధువు (పెళ్లి చేసుకున్న అమ్మాయి) పీటల మీద లేదంటే మరుసటి రోజుకు రక్తం కక్కుకుని చచ్చిపోతుంది. అది నిజంగా శాపమా? లేదంటే ఆ మరణాల వెనుక ఎవరైనా ఉన్నారా? అని కానిస్టేబుల్ ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడుతుంది. ఆఖరికి ఆ ఊరిలో అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతుంది. చివరికి ఏం తెలిసింది? అనేది కథ.
'కానిస్టేబుల్ కనకం' సిరీస్ కథ విషయానికి వస్తే... ఇందులోనూ మెయిన్ లీడ్ రోల్ కానిస్టేబుల్. మారుమూల పల్లెలో ఆమె ఫస్ట్ పోస్టింగ్. ఆ ఊరికి వెళ్లే దారిలో అడవి గుట్ట ఉంటుంది. దాని మీదుగా వెళితే ఏడు మైళ్ళ ప్రయాణం తగ్గుతుంది. అయితే రాత్రి 8 గంటల తర్వాత ఆ అడవి గుట్ట మీదుగా వెళ్లిన అమ్మాయిలు మాయం అవుతారు. కనకం స్నేహితురాలు సైతం అలా మిస్ అవుతుంది. ఆమెను వెతకడం కోసం కనకం ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేసింది? బల్లిని చూసి భయపడే ఆ అమ్మాయి అడవి గుట్ట గుట్టును ఎలా ఛేదించింది? అనేది కథ.
సింగిల్ లైన్ స్టోరీగా చూసినా రెండు కథలూ ఒక్కటి కాదు. కొత్త పెళ్లి కుమార్తెలు రక్తం కక్కుకుంటూ మరణించం వెనుక రహస్యాన్ని ఛేదించడం 'విరాటపాలెం' కథ అయితే... ఊరిలో అమ్మాయిలు మాయం కావడం వెనుక ఎవరున్నారు? అనే కథతో తెరకెక్కిన సిరీస్ 'కానిస్టేబుల్ కనకం'. మరి, తమ కథను కాపీ చేశారని 'కానిస్టేబుల్ కనకం' మేకర్స్ అనుకోవడానికి కారణం ఏమిటంటే? ఈ కథను దర్శకుడు ముందుగా 'జీ 5' ఓటీటీకి చెప్పారు. అక్కడ వర్కవుట్ కాకపోవడంతో ఈటీవీ విన్ ఓటీటీ దగ్గరకు వచ్చారు. మెయిన్ లీడ్ క్యారెక్టర్ కానిస్టేబుల్ కావడంతో తన కథను కాపీ చేశారని భావించి తొందర పడ్డారు.
'తండేల్' చూసిన తర్వాత 'అరేబియా కడలి' చూస్తే కథగా కొత్తదనం కనిపించదు. ఆ రెండిటి కథలూ ఒక్కటే కనుక! 'విరాటపాలెం', 'కానిస్టేబుల్ కనకం' చూసిన తర్వాత రెండిటి కథలూ ఒక్కటే అనిపించవు. ఊరిలో అమ్మాయిలు మిస్సింగ్ లేదా మరణాల వెనుక కానిస్టేబుల్ ఇన్వెస్టిగేట్ చేయడం అనేది రెండిటిలో కోర్ పాయింట్. అయితే కథ, సన్నివేశాలు, కథనం పూర్తిగా భిన్నమైనవి. ఒక్కటిగా అనిపించవు. కథ పరంగా 'విరాటపాలెం' చూసిన కళ్ళకు 'కానిస్టేబుల్ కనకం' కొత్తగా ఉంటుంది. సిరీస్ ఎగ్జైట్ చేస్తుందా? లేదా? అనేది రివ్యూ చూసి తెలుసుకోండి.





















