Oscar Movies on OTT: ఈ ‘ఆస్కార్’ చిత్రాలను ఓటీటీల్లోనూ చూసేయొచ్చు!
‘ఆస్కార్’లో అవార్డులు పొందిన సినిమాలను మీకు కూడా చూడాలని ఉందా? అయితే, ఈ ఓటీటీల్లో ఆ మూవీస్‌ను చూసేయొచ్చు.
‘ఆస్కార్’ అవార్డులను గెలవాలంటే మాటలు కాదు. కనీసం నామినేషన్స్ స్థాయికి వెళ్లినా చాలు.. అది గొప్పే. ఇక ఆ మూవీకి ‘ఆస్కార్’ వచ్చిందంటే.. చరిత్రలో నిలిచిపోతుంది. అంతేకాదు, ఆ మూవీస్ చూసేందుకు సినీ ప్రేమికులు కూడా పోటీ పడతారు. ఓటీటీలు లేనప్పుడు.. ఆ మూవీస్ చూడటం సాధ్యమయ్యేది కాదు. సీడీలు కొనుగోలు చూసి చూడాల్సి వచ్చేది. లేదా టీవీల్లో టెలికాస్ట్ అయ్యే వరకు వేచి చూడాల్సి వచ్చేది. ఎందుకంటే.. ఆస్కార్‌లు ప్రకటించేప్పటికే ఆ మూవీలో థియేటర్లలో బ్లాక్‌బస్టర్లు హిట్లు కొట్టి వెళ్లిపోతాయి. లక్ ఉంటే.. కొన్ని ఆస్కార్స్ తర్వాత కూడా ప్రదర్శనకు ఉంటాయి. ఇప్పుడు ఓటీటీల వల్ల ఆ సమస్య లేదు. సోమవారం ఆస్కార్ అవార్డు గెలుచుకున్న సినిమాలన్నీ ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. అయితే, ‘ఉమెన్ టాకింగ్’, ‘ది వేల్’, ‘నవానీ’ తదితర సినిమాలు మన ఓటీటీల్లో అందుబాటులో లేవు.
మీరు ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ‘RRR’ మూవీని ఓటీటీలో చూసే ఉంటారు. అవి కాకుండా మరికొన్ని సినిమాలు కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో కొన్ని సినిమాలను తెలుగులో కూడా చూడవచ్చు. మరి ఆ చిత్రాలేమిటీ? ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేయండి మరి.
Everything Everywhere All at Once
ఆస్కార్స్ 2023లో అత్యధిక అవార్డులు గెలుచుకున్న చిత్రం ‘Everything Everywhere All at Once’. మొత్తం ఏడు విభాగాల్లో ఈ మూవీకి అవార్డులు లభించాయి. అంతేగాక ఆస్కార్ చరిత్రాలో ఉత్తమ నటిగా అవార్డు పొందిన తొలి ఆసియా మహిళగా మిచెల్ యోహ్ కొత్త రికార్డు క్రియేట్ చేశారు. ఇంకా ఉత్తమ సహాయ నటుడుగా కె.హుయ్ క్వాన్, ఉత్తమ చిత్రం కేటగిరిలో నిర్మాత జోనాథన్ వాంగ్, ఉత్తమ నటి, ఉత్తమ స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, ఎడిటింగ్.. ఇలా పలు విభాగాల్లో ఈ మూవీ అవార్డులను కైవశం చేసుకుంది. ఈ మూవీ ప్రస్తుతం Sony Liveలో స్ట్రీమింగ్ అవుతోంది.
All Quiet on the Western Front
ఈ మూవీ ఏకంగా నాలుగు విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది. బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ – క్రిస్ట్రియన్ ఎం గోల్డ్ బెక్, బెస్ట్ ఇంటర్నేషన్ ఫిల్మ్, బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో ఈ మూవీకి అవార్డుల పంట పండింది. ఈ మూవీ చూస్తున్నంత సేపు మీరే అక్కడ యుద్ధ వాతావరణంలో ఉన్నారనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ మూవీ ప్రస్తుతం Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది.
Black Panther Wakanda Forever
ఈ మూవీకి బెస్ట్ కాస్ట్యూమ్స్ విభాగంలో ‘బ్లాక్ పాంథర్ – వకాండా ఫారెవర్’ ఆస్కార్‌ను సొంతం చేసుకుంది. మార్వెల్ మూవీస్‌ను ఇష్టపడేవారికి ఈ మూవీ తప్పకుండా నచ్చుతుంది. ప్రస్తుతం ఈ మూవీ Disney + Hotstarలో స్ట్రీమింగ్ అవుతోంది.
Avatar: The Way of Water (Avatar 2)
జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన Avatar: The Way of Water.. ఆస్కార్ అవార్డుల్లో ‘బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్’ అవార్డుతో సరిపెట్టుకోవలసి వచ్చింది. అయితేనేం.. మీకు ఈ మూవీ తప్పకుండా నచ్చేస్తుంది. మీరు ఈ మూవీని థియేటర్‌లో మిస్సయినట్లయితే.. మార్చి 28 నుంచి ఓటీటీల్లో చూడవచ్చు. ఈ మూవీని Disney + Hotstar, Amazon Prime Video ఓటీటీల్లో విడుదల చేస్తున్నారు. యాపిల్ టీవీ, వుడ్‌లో కూడా స్ట్రీమింగ్ కానుంది.
Top Gun: Maverick
హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ నటించిన ఈ మూవీకి భలే క్రేజ్ ఉంది. థియేటర్లలో కూడా మంచి వసూళ్లు సాధించిన చిత్రం ఇది. అయితే, ఆస్కార్ అవార్డుల్లో కేవలం ఒక్క విభాగంలోనే అవార్డు దక్కింది. బెస్ట్ సౌండ్ డిజైన్ అవార్డును సొంతం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగే యాక్షన్ సన్నివేశాలు తప్పకుండా నచ్చేస్తాయి. ఈ మూవీ ప్రస్తుతం Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది.
Pinocchio
బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్‌గా ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్న చిత్రం Pinocchio. ఇది కూడా Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది.
The Elephant Whisperers
ఆస్కార్ 2023 వేడుకల్లో అవార్డును కైవశం చేసుకున్న మరో భారతీయ చిత్రం ఇది. బెస్ట్ డాక్యుమెంటర్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో The Elephant Whisperers విజేతగా నిలిచింది. కార్తీక్ గోన్‌స్లేవ్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గురునీత్ మోంగ నిర్మించారు. హాల్ ఔట్, మార్తా మిచెల్ ఎఫెక్ట్, స్ట్రేంజర్ ఎట్ ది గేట్‌లతో ది ఎలిఫెంట్ విష్పెర్స్ పోటీ పడి విజేతగా నిలవడం గమనార్హం. ఈ డాక్యుమెంటరీ Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది.
RRR
ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఈ మూవీకి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు. ఈ మూవీకి ‘బెస్ట్ ఒరిజినల్’ సాంగ్ కేటగిరిలో ‘‘నాటు నాటు’’ పాటకు అవార్డు లభించింది. ఈ సందర్భంగా ఈ మూవీ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి, పాటల రచయిత చంద్రబోస్ ఆస్కార్ అవార్డులు అందుకున్నారు. ఈ సినిమా హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, ఇతర భాషలు ‘జీ5’లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.
Also Read : ఆస్కార్ గొడవ - ఎన్టీఆర్ ఫోటో మాత్రమే ఎందుకు, రామ్ చరణ్ ఎక్కడ? మెగా ఫ్యాన్స్ ఫైర్