Balakrishna: కమర్షియల్ యాడ్‌లో బాలయ్య - కెరీర్‌లో తొలిసారిగా!
తొలిసారి బాలయ్య ఓ కమర్షియల్ యాడ్ లో నటించడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
నందమూరి బాలకృష్ణ(Balakrishna) తన ఇన్నేళ్ల కెరీర్ లో ఎప్పుడూ కూడా కమర్షియల్ యాడ్స్ చేయలేదు. తన తోటి హీరోలు యాడ్స్ తో కోట్లు సంపాదిస్తుంటే బాలయ్య మాత్రం వాటి జోలికి వెళ్లలేదు. యాడ్స్ లో నటించకపోవడానికి ఒక కారణం ఉందని ఇదివరకు ఓ సందర్భంలో బాలయ్య చెప్పారు. తన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ ఎప్పుడూ కూడా ఇమేజ్ ను అడ్డం పెట్టుకొని సినిమా ప్రకటనల్లో నటించలేదని.. కొంతమంది మాత్రం ఎన్టీఆర్ గారిని తమ ఆస్తిగా భావించి ఆయన ఫొటోలను తమ ప్రొడక్ట్స్ మీద వేసుకొని పబ్లిసిటీ చేసుకునేవారని అన్నారు.
ప్రేక్షకుల వలనే ఈ ఇమేజ్ వచ్చిందని.. అందుకే వాళ్లను మెప్పించే సినిమాలు చేసి వారి అభిమానాన్ని పొందాలని.. అంతేకానీ వాళ్లిచ్చిన ఇమేజ్ ను మన స్వార్ధం కోసం ఉపయోగించకూడదనేది నాన్న గారి అభిప్రాయమని.. ఆయన బాటలోనే తను కూడా ఇప్పటివరకు యాడ్స్ చేయలేదని చెప్పారు బాలయ్య. ప్రజలకు ఏమైనా మేలు జరిగితే మాత్రం తప్పకుండా చేస్తానని చెప్పారు.
అయితే ఇప్పుడు తొలిసారి బాలయ్య ఓ కమర్షియల్ యాడ్ లో నటించడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో ఓ కన్‌స్ట్రక్షన్ గ్రూప్ కోసం తెరకెక్కించే యాడ్‌లో బాలయ్య తొలిసారి కనిపించబోతున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. దీని ద్వారా వచ్చే డబ్బుని బాలయ్య తన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కి డొనేట్ చేయాలని నిర్ణయించుకున్నారట. ఈ హాస్పిటల్ లో చాలా మంది క్యాన్సర్ పేషంట్స్ కి అతి తక్కువ ధరలతో ట్రీట్మెంట్ అందిస్తున్నారు బాలయ్య.
ఇక తమ అభిమాన హీరో యాడ్ లో నటిస్తున్నాడని తెలుసుకున్న అభిమానులు.. యాడ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా..? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'అన్ స్టాపబుల్'తో హోస్ట్ గా మారిన బాలయ్య ఇప్పుడు యాడ్స్ కూడా ఒప్పుకుంటున్నారు. మొత్తానికి ట్రెండ్ కి తగ్గట్లుగా తనను తాను మార్చుకుంటూ ఈ తరం యూత్ ని కూడా ఆకట్టుకుంటున్నారాయన.
This Diwali marks the beginning of our crackling new chapter💥
— Shreyas Media (@shreyasgroup) October 22, 2022
THE #GODOFMASSES IS STEPPING INTO THE WORLD OF ADVERTISING WITH HIS FIRST-EVER BRAND COMMERCIAL🤩
We're Proudly Announcing #NBK is the New Brand Ambassador for @GroupSaipriya 🤗
Ad By @shreyasgroup @BrandeDigital pic.twitter.com/xOreuOsuqQ
ఇక బాలయ్య సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం గోపీచంద్ మలినేని(Gopichand Malineni) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈరోజే ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేయనున్నారు. దీంతో పాటు అనిల్ రావిపూడితో మరో సినిమా ఒప్పుకున్నారు బాలయ్య. షైన్ స్క్రీన్స్ పతాకంపై సినిమా రూపొందుతోంది. దీనికి హరీష్ పెద్ది, సాహూ గారపాటి నిర్మాతలు.
హీరోగా బాలకృష్ణకు 108వ సినిమా ఇది (NBK 108 Movie). ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. దాదాపు రూ.80 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించబోతున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి కెరీర్ లో ఇంత బడ్జెట్ తో సినిమా తీయడం ఇదే మొదటిసారి. సినిమా బడ్జెట్ కి తగ్గట్లే బాలయ్య భారీ రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారని సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాకి బాలయ్యకు రూ.25 కోట్లు పారితోషికంగా ఇస్తున్నారట. ఈ సినిమాలో త్రిషను హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారు.