Custody Teaser: ‘నిజం నా కస్టడీలో ఉంది’ - నాగ చైతన్య ‘కస్టడీ’ టీజర్ చూశారా?
నాగ చైతన్య లేటెస్ట్ సినిమా ‘కస్టడీ’ టీజర్ రిలీజ్ అయింది.
Custody Teaser: నాగ చైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ సినిమా ‘కస్టడీ’. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా మే 12వ తేదీన విడుదల కానుంది. ‘కస్టడీ’ అఫీషియల్ టీజర్‌ను నిర్మాతలు విడుదల చేశారు. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. అరవింద్ స్వామి ప్రతి నాయక పాత్రలో కనిపించనున్నారు.
ఇక టీజర్ విషయానికి వస్తే... ‘గాయపడిన మనసు ఒక మనిషిని ఎంత దూరం అయినా తీసుకు వెళ్తుంది. అదిప్పుడు నన్ను తీసుకొచ్చింది ఒక యుద్ధానికి. ఇక్కడ చావు నన్ను వెంటాడుతుంది. అది ఎటు నుంచి వస్తుందో, ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో నాకు తెలియదు. తెలుసుకోవాలని కూడా లేదు. ఎందుకంటే నా చేతిలో ఉన్న ఆయుధం ఒక నిజం. నిజం ఒక ధైర్యం. నిజం ఒక సైన్యం. యస్. ద ట్రూత్ ఈజ్ ఇన్ మై కస్టడీ. (నిజం నా కస్టడీలో ఉంది.)’ నాగ చైతన్య వాయిస్ ఓవర్‌లో వినిపించే డైలాగ్స్ ఇవి.
నాగ చైతన్యకు తప్ప మరో పాత్ర గొంతు టీజర్‌లో వినిపించదు. కానీ కీలక పాత్రలన్నిటినీ చూపించారు. యాక్షన్ సన్నివేశాలు వెంకట్ ప్రభు స్టైల్లో ఉన్నాయి. నాగ చైతన్య ఈ సినిమాలో కానిస్టేబుల్ పాత్రలో కనిపించనున్నారు. అండర్ వాటర్ యాక్షన్ సీన్లు కూడా ఈ సినిమాలో ఉండనున్నట్లు టీజర్‌లో చూడవచ్చు. యువన్ శంకర్ రాజా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది.
అరవింద్ స్వామి, కృతి శెట్టి, శరత్ కుమార్‌లను కూడా టీజర్‌లో చూపించారు. కృతి శెట్టి ఒక యాక్షన్ సీన్‌లో కూడా కనిపించింది. వెంకట్ ప్రభు ఇటీవలే ‘మానాడు’తో మంచి ఫాంలోకి వచ్చారు. మరోవైపు నాగ చైతన్యకు మాత్రం ‘థాంక్యూ’ రూపంలో గతేడాది గట్టి షాక్ తగిలింది. దీంతో తన కెరీర్‌లో ‘కస్టడీ’ ఎంతో కీలకంగా మారింది.
‘కస్టడీ’లో నాగ చైతన్య పోలీస్ ఆఫీసర్ పాత్ర చేస్తున్నారు. సినిమాలో ఆయన పేరు A.చైతన్య. A అంటే అక్కినేని అయ్యి ఉంటుందని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే... తోటి అధికారులు ఆయన్ను కదలకుండా తమ చేతుల్లో ఎందుకు బంధించారనేది సస్పెన్స్. సాధారణంగా పోలీసులు ఖైదీలను కస్టడీలోకి తీసుకుంటారు. అయితే, ఇక్కడ పోలీస్ ఆఫీసర్‌నే తోటి సిబ్బంది ఎందుకు కస్టడీలోకి తీసుకుంటారనేది వెండి తెరపైనే చూడాలి.
అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్, ప్రేమ్ జీ అమరన్, ప్రేమి విశ్వనాథ్, సంపత్ రాజ్, 'వెన్నెల' కిశోర్ తదితరుల నటిస్తున్న ఈ చిత్రానికి తండ్రీ కుమారులు, సంగీత ద్వయం ఇసైజ్ఞాని ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పించనున్నారు. అబ్బూరి రవి మాటలు రాస్తున్నారు. ఎస్ఆర్ కతిర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి కూర్పు : వెంకట్ రాజన్, ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవ్, యాక్షన్ : మహేష్ మాథ్యూ, కళా దర్శకత్వం : డివై సత్యనారాయణ, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : వెంకట్ ప్రభు.