Ayodhya Rama Mandir: రామ మందిరం ప్రారంభోత్సవం ... ఆహ్వానం అందింది కానీ వెళ్లలేకపోతున్నా - మోహన్ బాబు
Mohan Babu on Ayodhya Ram Mandir: శ్రీరామ జన్మభూమి అయోధ్యలో మందిరం ప్రారంభోత్సవానికి ఆహ్వానాలు అందుకున్న తెలుగు ప్రముఖుల్లో మోహన్ బాబు ఉన్నారు. తాను వెళ్లడం లేదని, అందుకు గల కారణాలను ఆయన వివరించారు.
Tollywood Celebrities Ayodhya Ram Mandir Inauguration: భారతదేశమంతా శ్రీరామ నామస్మరణతో మార్మోగుతోంది. ఈ సోమవారం (జనవరి 22న) అయోధ్యలో శ్రీరాముని మందిరం ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఆ ప్రారంభోత్సవానికి దేశవ్యాప్తంగా పలువురు సినిమా, రాజకీయ, క్రీడా, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులకు ప్రత్యేక ఆహ్వానాలు అందాయి. తెలుగు నాట ఆ ఆహ్వానాలు అందుకున్న ప్రముఖుల్లో పద్మశ్రీ పురస్కార గ్రహీత, కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ఉన్నారు. అయితే... ఆయన రామ మందిరం ప్రారంభోత్సవ వేడుకకు వెళ్లడం లేదు. అందుకు గల కారణాలను ఆయన వివరించారు.
భద్రతా కారణాల దృష్ట్యా రాలేనని ఉత్తరం రాశా
మోహన్ బాబు మాట్లాడుతూ ''ఇది రాముడు పుట్టిన దేశం, ఇది రామ జన్మ భూమి అని ప్రపంచం అంతటికీ చాటి చెప్పేలా మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు గొప్ప పని చేశారు. అయోధ్యలో రామ మందిరాన్ని ప్రారంభిస్తూ మహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ నెల 22న జరిగే అయోధ్య రామయ్య మందిరం ప్రారంభోత్సవానికి ఊరూరా తరలి వెళుతున్నారు. నాకు కూడా అహ్వానం అందింది. కానీ, భద్రతా కారణాల దృష్ట్యా రాలేకపోతోన్నానని, క్షమించమని ఉత్తరం రాశాను'' అని తెలిపారు.
Also Read: రామ మందిరం ప్రారంభోత్సవం.. వెండితెరపై అలరించిన శ్రీరాముని పాటలు ఇవే!
ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో ప్రత్యేక పూజలుఅయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా మంచు మోహన్ బాబు చైర్మన్‌గా ఉన్న ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వాటి గురించి ఆయన మాట్లాడుతూ ''ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానం దేవాలయాన్ని ప్రజలు అందరి కోసం నిర్మించాం. ఇటీవల దైవ సన్నిధానం పాలక మండలి చైర్మన్ పదవిని నేను స్వీకరించా. రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా దైవ సన్నిధానంలోనూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. భక్తులు అందరూ వచ్చి ఆ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరుతున్నాను. ఇక్కడ కోరిన కోరికలన్నీ తీరుతున్నాయని చాలా మంది భక్తులు చెబుతున్నారు. శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి, శ్రీ సాయి బాబా, శ్రీరాముడు, లక్ష్మీ నరసింహ స్వామి, సంతోషి మాత... ఇలా 18 మంది దేవుళ్లు, దేవతలు ఇక్కడ కొలువై ఉన్నారు. ఈ దేవాలయంలో 18 మూర్తులు, 15 మంది బ్రాహ్మణోత్తములు ఉన్నారు'' అని చెప్పారు.
Also Read: ఆదర్శపురుషుడు అంటే ఎవరు - ఈ సుగుణాలుంటే మీరూ రాముడే!
ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానం ప్రధాన అర్చకులు రాంబాబు మాట్లాడుతూ ''అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా దైవ సన్నిధానంలో ఈ నెల 14 నుంచి ప్రత్యేక పూజలు, వైదిక కార్యక్రమాలు ప్రారంభించాం. మందిరం ప్రారంభమయ్యే రోజు, ఈ నెల 22 వరకు ఆ కార్యక్రమాలు కొనసాగుతాయి. సాయంత్రం పూట భక్తి కీర్తనలు, భరత నాట్య ప్రదర్శనలు ఏర్పాటు చేశాం. ఆదివారం (జనవరి 21) సాయంత్రం శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమాలకు భక్తులు అందరూ విచ్చేసి సీతారాముల అనుగ్రహాన్ని పొందగలరు'' అని అన్నారు.