Godfather Pre Release: వర్షంలోనూ సాగిన చిరు స్పీచ్, అభిమానులే గాడ్ ఫాదర్స్ అంటూ ఉద్వేగం, గ్రాండ్ గా ప్రీరిలీజ్
చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతరపురంలో అట్టహాసంగా జరిగింది. వేలాదిగా తరలి వచ్చిన అభిమానుల నడుమ చిరంజీవి ఉద్వేగభరిత ప్రసంగా చేశారు. అభిమానులే తన గాడ్ ఫాదర్స్ అన్నారు.
మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా సినిమా ‘గాడ్ ఫాదర్’. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార సహా పలువురు అగ్ర నటీనటులు యాక్ట్ చేసిన ఈ సినిమా ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్స్ పై రామ్ చరణ్, ఆర్‌బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్, ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభించింది. సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఆర్ట్స్ కళాశాలలో జరిగిన ఈ వేడుకలో చిరంజీవి సహా చిత్రం బృందం పాల్గొన్నది.
చిరంజీవి అభిమానులు, సినీ ప్రేక్షకులు భారీ సంఖ్యలో తరలి రావడంతో ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ జనసంద్రాన్ని తలపించింది. సినీ గాయకుల పాటలు, అదిరిపోయే డ్యాన్సులతో కోలాహంగా మారింది. ఇక చిరంజీవి ప్రసంగం మొదలు పెట్టగానే వర్షం మొదలైంది. వరుణుడి జల్లుల్లోనూ మెగాస్టార్ ప్రసంగం కొనసాగింది. “నేను ఎప్పుడు సీమలో అడుగు పెట్టినా వర్షం పడుతుంది. ఇవాళ కూడా వర్షం వచ్చింది. ఇది ఎంతో శుభ పరిణామంగా భావిస్తున్నాను” అన్నారు.
అభిమానులు తనను ‘గాడ్ ఫాదర్’ అంటున్నారని.. వాస్తవానికి అభిమానులే తన ‘గాడ్ ఫాదర్’ అన్నారు. ‘‘మీరు నన్ను ‘గాడ్‌ఫాదర్’ అంటున్నారు. కానీ, ఏ ‘గాడ్ ఫాదర్’ లేకుండా వచ్చిన నాకు.. సినీ పరిశ్రమలో నిలదొక్కుకునే అవకాశం కల్పించి, ఈ స్థాయికి చేరుకోవడానికి కారణం అయిన ప్రతి అభిమాని నాకు ‘గాడ్ ఫాదర్’తో సమానం అన్నారు. చిరంజీవి వెనుకాల ఇప్పుడు లక్షలాది మంది ‘గాడ్ ఫాదర్’లు ఉన్నారు” అంటే అభిమానులను ఉత్సాహ పరిచారు.
వాస్తవానికి తాను ‘గాడ్ ఫాదర్’ సినిమా చేయడానికి ప్రధాన కారణం రామ్ చరణ్ అన్నారు చిరంజీవి. మోహన్ రాజా దర్శకత్వంలో సినిమా చేస్తే బాగుంటుందని కూడా తనే సూచించారన్నారు. అటు తమ మీద ఉన్న నమ్మకంతో సినిమా కథ వినకుండానే ఈ సినిమాలో నటించిన బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ కు ధన్యవాదాలు చెప్పారు. నయనతార ఈ సినిమాకు ఓకే చెప్పడం సంతోషకర విషయం అన్నారు. ఈ సినిమా నిర్మాణంలో తమతో పాటు ఆర్‌బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ కలిసి రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ సినిమాకు సంగీతం అందించిన తమన్ పైనా చిరంజీవి ప్రశంసలు కురిపించారు. తెలుగు వారికి జాతీయ అవార్డులు చాలా అరుదుగా వస్తాయన్నారు. అలాంటిది చిన్న వయసులోనే తమన్ నేషన్ అవార్డు అందుకోవడం గొప్ప విషయం అన్నారు. ఇక ఈ సినిమా తన కెరీర్ లో మంచి విజయాన్ని అందుకోబోతుందని చెప్పారు. ‘గాడ్‌ఫాదర్’ సినిమా కచ్చితంగా నిశ్శబ్ధ విస్ఫోటనం అవుతుందన్నారు. ప్రేక్షకుల ఆశీస్సులు గత సినిమాల మాదిరిగానే ఈ సినిమా మీద కూడా ఉండాలన్నారు.