Chiranjeevi: అక్కడ తిట్టడం, లేదంటే తిట్టించుకోవడం చేతకావాలి - అందుకే సినిమాల్లోకి తిరిగి వచ్చేశా: చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలను వదిలేసిన చాలా కాలం తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ రంగంలో రాణించడం చాలా కష్టం అన్నారు. అవసరం లేకున్నా తిట్టడం, తిట్లు పడటం చేతనైతేనే అక్కడ సక్సెస్ అవుతారని చెప్పారు.
తాజా రాజకీయాలపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఇమడలేకే.. తిరిగి సినిమాల్లోకి వచ్చేశానని అన్నారు. రాజకీయాలకు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ సరైనవాడని అన్నారు.
సినిమా రంగంలో మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి, ప్రజా సేవ చేయాలని రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. తిరుపతి వేదికగా ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన 2009 సార్వత్రిక ఎన్నికల్లో బరిలోకి దిగారు. 296 నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను రంగంలోకి దించారు. తను కూడా రెండు చోట్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. తిరుపతిలో విజయం సాధించి మరోచోట ఓటమి పాలయ్యారు. 250కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేసిన ప్రజారాజ్యం పార్టీ కేవలం 18 స్థానాలను గెల్చుకుంది. వైఎస్సార్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగించి రెండోసారి ప్రభుతం ఏర్పాటు చేసింది.
కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్న చిరంజీవి
కొద్దికాలం పాటు పార్టీని నడిపిన చిరంజీవి, రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రజా ఆందోళనల్లో పాల్గొన్నది. ఆ తర్వాత ఎందుకో తెలియదు కానీ, పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. చిరంజీవికి కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రి పదవిని ఆఫర్ చేసింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలకు రాష్ట్రంలోని మంత్రివర్గంలోనూ చోటు కల్పించింది. తన పదవి పూర్తయ్యాక.. తను రాజకీయాలకు దూరం అయ్యారు. మళ్లీ సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. ఖైదీ నెం.150 మూవీతో సినిమా పరిశ్రమలోకి రీఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా కొనసాగుతున్నారు.
రాజకీయాల్లో రాణించడం చాలా కష్టమన్న చిరంజీవి
రాజకీయాలను వదిలేసి సుమారు దశాబ్దకాలం గడుస్తున్న వేళ.. ఆయన రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలిటిక్స్ లో రాణించడం అంత ఈజీ కాదని వెల్లడించారు. అందుకే తాను సినిమాల్లోకి తిరిగి వచ్చేశానని అన్నారు. హైదరాబాద్ లో జరిగిన వైఎన్ఎం కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో చిరంజీవి పాల్గొని ప్రసంగించారు. “రాజకీయాల్లో ఉన్నప్పుడు చాలా కఠినంగా ఉండాల్సి ఉంటుంది. మొరటుగా, కటువుగా ఉండాలి. సున్నితంగా ఉండకూడదు. అవసరం ఉన్నా, లేకున్నా తిట్టడం లేదంటే తిట్టించుకోవడం చేతకావాలి. లేదంటే అక్కడ రాణించడం చాలా కష్టం. నా తమ్ముడు పవన్ కల్యాణ్ కు ఆ రెండూ ఉన్నాయి. తిట్లు పడగలడు, తిట్టగలడు. అందుకే తను రాజకీయాల్లో రాణిస్తాడని భావిస్తున్నాను” అని చిరంజీవి వెల్లడించాడు.
Annayya #Chiranjeevi about Politics
— Chiranjeevi Army (@chiranjeeviarmy) November 20, 2022
And Support for @PawanKalyan garu
Boss @KChiruTweets #PawanKalyan#MegastarChiranjeevi #WaltairVeerayya pic.twitter.com/iBlazDFyXV
వైఎన్ఎం కాలేజీ పాఠాలతో పాటు జీవిత పాఠాలను నేర్పిందన్న మెగాస్టార్
ఇక తనకు వైఎన్ఎం కాలేజీతో ఎంతో విడదీయరాని సంబంధం ఉందన్నారు. ఆ కాలేజీలో ఎన్నో మధుర జ్ఞాపకాలు పెనవేసుకుపోయాయన్నారు. కాలేజీకి సంబంధించిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆ కాలేజీలో చదువుకుని క్రమశిక్షణ నేర్చుకున్నానని చెప్పారు. పాఠాలతో పాటు జీవిత పాఠాలను కూడా ఆ కాలేజీ నేర్చించిందన్నారు.
Read Also: కృష్ణ-మహేష్ సేమ్ టు సేమ్! తండ్రీ కొడుకుల వీడియో చూడ్డానికి రెండు కళ్లు సరిపోవంటే నమ్మండి!