Masooda Trailer : థ్రిల్, రొమాన్స్, హారర్ - 'మసూద' ట్రైలర్ చూశావా కృష్ణా?
Review of Masooda Trailer : 'మసూద' సినిమా ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ ఈ రోజు ట్రైలర్ విడుదల చేశారు.
తిరువీర్ (Thiruveer), కావ్యా కళ్యాణ్ రామ్ (Kavya Kalyanram) జంటగా నటించిన సినిమా 'మసూద' (Masooda Movie). ఇందులో సంగీత (Sangeetha) ప్రధాన పాత్ర చేశారు. ఈ నెల 18న సినిమా థియేటర్లలో సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ రోజు పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ట్రైలర్ విడుదల చేశారు. అది ఎలా ఉంది? అనేది చూస్తే...
Masooda Movie Trailer : 'భవిష్యత్ అనేది మనం ఈ రోజు ఏం చేస్తున్నామో... దాని మీద ఆధారపడి ఉంటుంది' అని సంగీత చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ఆవిడ కింద అంతస్తులో నివసించే యువకుడిగా తిరువీర్ కనిపించారు. సంగీత ఇంటి అద్దె కట్టి మూడు నెలలు అవుతుంది. ఆర్థిక సమస్యలతో తోడు కుమార్తె వింత వింతగా ప్రవర్తించడం మొదలు పెడుతుంది. సాయం కోసం హీరోని ఇంటికి పిలుస్తారు సంగీత.
ఆఫీసులో ప్రేమించిన అమ్మాయిని డేట్‌కు పిలవడానికి హీరో ఇబ్బంది పడుతుంటాడు. అతడిని స్నేహితులు పిరికివాడు అంటుంటారు. మరి, అమ్మాయికి దెయ్యం పడితే ఆమె తల్లికి తోడుగా ఎలా ఉన్నాడు? ఏం చేశాడు? అనేది ఆసక్తికరం. అది థియేటర్లలో చూడాలి. క్షుద్ర పూజలు, హీరో హీరోయిన్స్ మధ్య రొమాన్స్, భక్తి వంటి అంశాలతో సినిమా తెరకెక్కించారని తెలుస్తోంది.
'నాజియాకు దెయ్యం పట్టిందని అనుకుంటున్నావా?' అని సంగీత అడగటం... 'లేదు... లేదు! ఏమో తెలియదు! అయ్యుండొచ్చు'' అని హీరో చెప్పడం చూస్తే, అమ్మాయికి దెయ్యం పట్టిందని క్లారిటీ వస్తుంది. అయితే, ఆ తర్వాత ఏమైందనేది ఎంత ఇంట్రెస్టింగ్‌గా ముందుకు తీసుకు వెళ్లారనేది చూడాలి. 'జాగ్రత్త కృష్ణా, దెబ్బ పడితే తేరుకోవడం చాలా కష్టం' అని హీరోని ఓ ఫకీరు ఇచ్చే వార్నింగ్ ఆసక్తి కలిగించేలా ఉంది. తెలుగులో హార్డ్ కోర్ హారర్ సినిమాలు వచ్చి చాలా రోజులైంది. ఈ లోటును 'మసూద' భర్తీ చేసేలా ఉంది. హారర్ మాత్రమే కాకుండా సినిమాలో హీరో హీరోయిన్స్ మధ్య రొమాన్స్ కూడా ఉందని తెలుస్తోంది.
Also Read : ఎన్టీఆర్ - కొరటాల శివ సినిమా టైటిల్ అది కాదమ్మా
'మళ్లీ రావా', 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించిన స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలో రూపొందిన మూడో చిత్రమిది. రాహుల్ యాదవ్ నక్కా (Rahul Yadav Nakka) నిర్మాత. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ద్వారా 'దిల్' రాజు విడుదల చేస్తున్నారు.
'మళ్ళీ రావా'తో గౌతమ్ తిన్ననూరిని, 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ'తో స్వరూప్ ఆర్ఎస్‌జేను దర్శకులుగా పరిచయం చేశారు రాహుల్ యాదవ్ నక్కా. ఈ విషయం చెప్పిన 'దిల్' రాజు... ''రాహుల్ నిర్మించిన లాస్ట్ రెండు సినిమాలకు నేను ఫ్యాన్. ఆయన అభిరుచి గల నిర్మాత. ఆ రెండు సినిమాలు నచ్చి 'తర్వాత ఏదైనా సినిమా ఉంటే.. నువ్వు నిర్మించిన తర్వాత మా ద్వారా విడుదల చేద్దాం' అని రాహుల్‌కి మాటిచ్చాను. ఇప్పుడీ 'మసూద'ను మా ఎస్‌విసి ద్వారా విడుదల చేయబోతున్నాం'' అని 'దిల్' రాజు అన్నారు.
అఖిల రామ్, బాంధవి శ్రీధర్, 'సత్యం' రాజేష్, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, సూర్యారావు, సురభి ప్రభావతి, కృష్ణతేజ తదితరులు నటించిన ఈ చిత్రానికి కూర్పు : జెస్విన్ ప్రభు, ఛాయాగ్రహణం : నగేష్ బానెల్, స్టంట్స్: రామ్ కిషన్, 'స్టంట్' జాషువా, సంగీతం: ప్రశాంత్ ఆర్.విహారి, నిర్మాత: రాహుల్ యాదవ్ నక్కా, రచన, దర్శకత్వం: సాయికిరణ్.