Manchu Manoj: తారకరత్న పూర్తిగా కోలుకొని తిరిగి వస్తాడు: మంచు మనోజ్
తారకరత్నను పరామర్శించేందుకు పలువురు ప్రముఖులు బెంగుళూరు కు వెళ్తున్నారు. ఆదివారం సాయంత్రం సినీ నటుడు మంచు మనోజ్ బెంగుళూరుకు చేరుకున్నారు.
నారా లోకేష్ యువగళం పాదయాత్ర లో నందమూరి తారకరత్న గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. ఆయన్ను హూటాహుటిన కుప్పంలో ఆసుపత్రి తరలించారు తర్వాత పరిస్థితి విషమించడంతో బెంగుళూరులో నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. ఆయనకు ఎక్మో ట్రీట్మెంట్ ద్వారా శ్వాస కృత్రిమంగా అందిస్తున్నారని తెలుస్తోంది. తారకరత్న ఆరోగ్యం పట్ల నందమూరి కుటుంబ సభ్యులు అక్కడే ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఆయన ఆరోగ్య పరిస్థితిపై నందమూరి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తారకరత్నను పరామర్శించేందుకు పలువురు ప్రముఖులు బెంగుళూరు కు వెళ్తున్నారు. ఆదివారం సాయంత్రం సినీ నటుడు మంచు మనోజ్ బెంగుళూరుకు చేరుకున్నారు.
ఈ సందర్బంగా మంచు మనోజ్ తారకరత్న ఆరోగ్య పరిస్థితి పై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తారకరత్నను ఆసుపత్రిలో చూశానని అన్నారు. ఆయన నెమ్మదిగా కోలుకుంటున్నారని అన్నారు. తారకరత్న ఫైటర్ అని ఆయన పూర్తిగా కోలుకొని త్వరగా తిరిగి వచ్చేస్తారని అన్నారు. వైద్యానికి ఆయన స్పందిస్తున్న తీరుపై వైద్యులు కూడా సంతృప్తిగానే ఉన్నారని పేర్కొన్నారు. తారకరత్న తనకు చిన్నప్పటి నుంచి తెలుసని, చాలా మంచి వ్యక్తి అని అన్నారు. ఆయన త్వరగా కోలుకొని తిరిగి రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
అంతకు ముందు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తారకరత్నను పరామర్శించారు. ఆయన ఆరోగ్యపరిస్థితి గురించి వైద్యులను వివారాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అలాగే నందమూరి బాలకృష్ణ కూడా ఆసుపత్రి వద్దే ఉండి ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల నందమూరి కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ కూడా బెంగళూరు చేరుకుని తన సోదరుడిని పరామర్శించారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జూనియర్ ఎన్టీఆర్.. తారకరత్న శరీరం చికిత్సకు సహకరిస్తోందని చెప్పారు. అయితే ఆయన పరిస్థితి ఇంకా క్రిటికల్ గానే ఉందని చెప్పారు. అందరం ఆయన పూర్తిగా కోలుకోవాలని ప్రార్థిద్దామని పేర్కొన్నారు.
ప్రస్తుతం తారకరత్న కు ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తున్నారు. ఆయన గుండెపోటుకు గురైన హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ మథ్య లో దాదాపు అరగంట వరకూ ఆయన శరీరంలో రక్త ప్రసరణ నిలిచిపోయింది. దీంతో ఆ ప్రభావం మెదడుపై కూడా పడటంతో పరిస్థితి ఇంకా విషమించిందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఆయనకు కృత్రిమంగా శ్వాసను అందిస్తున్నారు. మరోవైపు మెదడుకు సంబంధించి కూడా ప్రత్యేక వైద్య బృందం నిశితంగా పర్యేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే 95 శాతం గుండె బలహీనం కావడంతో ఆయన పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు సమాచారం. తారకరత్న ఆరోగ్య పరిస్థితి పై త్వరలోనే వైద్యులు హెల్త్ బులిటెన్ ను విడుదల చేయనున్నారు. తారకరత్న పూర్తిగా కోలుకుని తిరిగి ఎప్పటిలానే రావాలని అటు నందమూరి అభిమానులు ప్రార్థిస్తున్నారు. అలాగే సినీ, రాజకీయ రంగానికి చెందిన ప్రతీ ఒక్కరూ తారకరత్న పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.