Mahesh Babu Father Death : కొన్నేళ్ళుగా కృష్ణ దినచర్య ఇదే - ఆయన ఆరోగ్య రహస్యం ఏంటంటే?
సూపర్ స్టార్ కృష్ణను టాలీవుడ్ అందగాడిగా చాలా మంది చెబుతారు. ఆయన ఆరోగ్య రహస్యం ఏంటి? ఆయనకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? కొన్నేళ్లుగా ఆయన దినచర్య ఎలా ఉంటుంది? వివరాలు ఇవిగో...
ఈ తరం హీరోల్లో అందగాడు అంటే మహేష్ బాబు (Mahesh Babu) అని చాలా మంది చెబుతారు. మహేష్ అందంలో తమకు కొంత ఇస్తే బావుంటుందని చెప్పిన హీరోలు ఉన్నారు. ఆయన అందం చూస్తే ఈర్ష్యగా ఉంటుందని సరదాగా కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రుల జీన్స్ వల్ల తాను ఇలా ఉన్నానని మహేష్ చెబుతుంటారు. డైట్ ప్లాన్ కూడా మరో కారణం అంటారు. మహేష్ కంటే ముందు సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) ను అందగాడిగా చెప్పేవారు. ఆయన 80 ఏళ్ళ వయసులో, ఈ రోజు కన్ను మూశారు. కొన్నేళ్ళుగా కృష్ణ డైట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆయన ఆరోగ్యంగా, అందంగా ఉన్నారని సమాచారం.
Superstar Krishna Diet Plan : కొన్నేళ్ళుగా కృష్ణ దినచర్య, డైట్ ప్లాన్ ఏ విధంగా ఉండేవో తెలుసా? 'తేనెమనసులు' విడుదలై 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా విజయ నిర్మలను ఇంటర్వ్యూ చేసే అవకాశం లభించింది. అప్పుడు కృష్ణ దినచర్య గురించి ఆవిడ ఈ విధంగా వివరించారు.
నిద్రలేచే సమయం - ఉదయం 06.30 గంటలు
నిద్ర లేచిన తర్వాత న్యూస్ పేపర్స్ చదవడం కృష్ణకు అలవాటు. కనీసం హెడ్ లైన్స్ అయినా చూసేవారు. ఆ తర్వాత అరగంట పాటు వాకింగ్ చేసేవారు. ఏడు, ఎనిమిది సంవత్సరాల క్రితం వరకు యోగా చేసేవారు. ఆ తర్వాత విరామం ఇచ్చారు. స్నానం చేసిన తర్వాత భగవంతుడికి దణ్ణం పెట్టుకొనేవారు. ఆయన దేవుడిని ఏమీ కోరేవారు కాదు. కానీ, దణ్ణం పెట్టుకోవడం అలవాటైంది.
బ్రేక్‌ఫాస్ట్ చేసే సమయం - 10:00 గంటలు
ఉదయం పది గంటల సమయంలో కృష్ణ అల్పాహారం తీసుకునేవారు. ఎక్కువగా ఇడ్లీ తినేవారు. అదీ ఒకటి లేదా రెండు మాత్రమే. ఆ తర్వాత రాగి జావ తాగేవారు. కుటుంబ సభ్యులతో కాసేపు సరదాగా మాట్లాడటం లేదా టీవీ చూడటం చేసేవారు. మరోసారి న్యూస్ పేపర్స్ అన్నీ చదివేవారు.
Also Read : ఓ తరం వెళ్ళిపోయింది - ఎన్టీఆర్, ఏయన్నార్, శోభన్ బాబు, కృష్ణంరాజు, ఇప్పుడు కృష్ణ
మధ్యాహ్న భోజన సమయం - 01:00 గంటలు
క్రమశిక్షణ, సమయ పాలన విషయంలో కృష్ణ పర్ఫెక్ట్. ఆయన ఠంచనుగా ఒంటి గంటకు భోజనం చేసేవారు. ఒక్క రోజు కూడా ఆలస్యంగా భోజనం చేసింది లేదట. తిన్న తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకునేవారు. ఆ తర్వాత మూడు, నాలుగు గంటల సమయంలో అభిమానులు ఎవరైనా వస్తే కలిసేవారు.
నిద్రపోయే సమయం - 09:00 గంటలు
రాత్రివేళ కృష్ణ మితాహారం తీసుకునేవారు. సగం చపాతీ, పళ్ళ రసాలు మాత్రమే ఆయన డిన్నర్ ప్లేటులో ఉండేవి. తొమ్మిది గంటలకు నిద్రకు ఉపక్రమించేవారు.
సుమారు పదిహేను ఇరవై ఏళ్ళుగా కృష్ణ దినచర్య ఈ విధంగా ఉండేది. గతంలో అప్పుడప్పుడూ ఆడియో వేడుకలు, ఇతర కార్యక్రమాలకు హాజరయ్యేవారు. కొన్ని ఏళ్ళుగా అతి ముఖ్యమైనవి అయితే తప్ప ఏ కార్యక్రమాలకూ అటెండ్ కాలేదు. మహేష్ బాబు హీరోగా నటించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ కూడా అవాయిడ్ చేశారు.
Also Read : సూపర్ స్టార్ కృష్ణ రికార్డులు - ఇంకెవరూ బీట్ చేయలేరేమో!?