Super Star Krishna Death : ఓ తరం వెళ్ళిపోయింది - ఎన్టీఆర్, ఏయన్నార్, శోభన్ బాబు, కృష్ణంరాజు, ఇప్పుడు కృష్ణ
తెలుగు చిత్రసీమలో ఓ తరం వెళ్ళిపోయింది. ఓ శకం ముగిసింది. తమ సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించి, వ్యక్తిత్వంతో ప్రజల మనసులు గెలిచిన కథానాయకులు మన మధ్య లేరిప్పుడు. ఆకాశంలో నుంచి మనల్ని చూస్తున్నారు.
![Super Star Krishna Death : ఓ తరం వెళ్ళిపోయింది - ఎన్టీఆర్, ఏయన్నార్, శోభన్ బాబు, కృష్ణంరాజు, ఇప్పుడు కృష్ణ Super Star Krishna Death Popular Telugu Actors Sr NTR, ANR, Shoban Babu, Krishnam Raju Left Us Super Star Krishna Death : ఓ తరం వెళ్ళిపోయింది - ఎన్టీఆర్, ఏయన్నార్, శోభన్ బాబు, కృష్ణంరాజు, ఇప్పుడు కృష్ణ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/15/9f7757c9d80cdee05a658e630a76217f1668485828150313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఓ తరం వెళ్ళిపోయింది...
ఓ యుగం ముగిసిపోయింది...
ఓ నక్షత్రం నేలను విడిచింది...
ఓ సువర్ణ అధ్యాయం సమాప్తమైనది!
సూపర్ స్టార్ కృష్ణ మరణం (Super Star Krishna Death) తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన మరణం ఒక్కరి మరణం కాదు... చిత్రసీమలో ఓ తరానికి చివరి చిహ్నం. ఓ సువర్ణ అధ్యాయానికి చివరి సంతకం. కృష్ణ మృతితో తెలుగు చిత్రసీమ స్థాయిని, స్థానాన్ని పెంచడంతో పాటు ప్రపంచానికి చాటి చెప్పిన తారలు అందరూ మనల్ని, ఈ నేలను విడిచి వెళ్ళినట్టు అయ్యింది.
ఎన్టీఆర్, ఏయన్నార్...
టాలీవుడ్‌కు రెండు కళ్ళు
తెలుగు చలన చిత్ర పరిశ్రమకు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్), అక్కినేని నాగేశ్వరరావు (ఏయన్నార్) రెండు కళ్ళు వంటివారు. టాలీవుడ్‌లో స్టార్‌డమ్‌కు ఆద్యులు. ఓ తరహా సినిమాలకు మాత్రమే పరిమితం కాకుండా ఎన్నో విభిన్నమైన సినిమాలు చేశారు. తమ ఉన్నతి మాత్రమే చూసుకోకుండా పరిశ్రమ బాగు కోసం పాటు పడ్డారు. మద్రాసు నుంచి హైదరాబాద్‌కు చిత్రసీమ తరలి రావడంలో ఎంతో కృషి చేశారు. తెలుగు గడ్డ మీద స్టూడియోకు నెలకొల్పారు. ఆ రెండు కళ్ళలో ఓ కన్ను (ఎన్టీఆర్) జనవరి 18, 1996న, మరో కన్ను (ఏయన్నార్) జనవరి 22, 2014లో వినీలాకాశానికి వెళ్ళాయి.
ఎన్టీఆర్, ఏయన్నార్ తర్వాత...
త్రిమూర్తులుగా శోభన్ బాబు, కృష్ణంరాజు, కృష్ణ
ఎన్టీఆర్, ఏయన్నార్ తర్వాత తెలుగు పరిశ్రమ చూసిన స్టార్లు శోభన్ బాబు, కృష్ణం రాజు, కృష్ణ. ఈ ముగ్గురూ త్రిమూర్తులుగా వెలుగొందారు. రెండు కళ్ళు చూపిన బాటలో నడిచారు. ఇప్పుడు ఆ కళ్ళు లేవు, ఆ అడుగులు లేవు. శోభన్ బాబు మార్చి 20, 2008లో మరణించారు. ఆ తర్వాత నుంచి కృష్ణం రాజు, కృష్ణను ఇండస్ట్రీ పెద్దదిక్కుగా చూస్తూ వచ్చింది. సముచిత మర్యాద ఇస్తూ గౌరవించింది. ఈ ఏడాది వాళ్ళిద్దరూ కూడా లోకాన్ని విడిచి వెళ్ళడంతో ఓ తరం వెళ్లినట్టు అయ్యింది.
Also Read : సూపర్ స్టార్ కృష్ణకు తీరని కోరికలు - ఆ నాలుగూ...
స్వర్ణయుగపు తారలు...
ఎన్టీఆర్, ఏయన్నార్, శోభన్ బాబు, కృష్ణం రాజు, కృష్ణ హీరోలుగా సినిమాలు చేసిన 60, 70, 80, 90వ దశకాలను తెలుగు సినిమా చరిత్రలో స్వర్ణయుగంగా పేర్కొంటారు. అప్పట్లో హీరోల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేది. ఒకరి సినిమా మరొకరు చూసి సలహాలు ఇచ్చుకోవడం ఉండేది. చిన్న చిన్న మనస్పర్థలు ఏవైనా ఉన్నప్పటికీ టీ కప్పులో తుఫానులా కొట్టుకుపోయేవి.
కృష్ణ 'గూఢచారి 116' సినిమా చేసినప్పుడు డిస్ట్రిబ్యూటర్లు చూసి పెదవి విరిచారు. కానీ, ఎన్టీఆర్ 'సినిమా సూపర్ హిట్ అవుతుంది. మహిళల ఆదరణ మాత్రం తక్కువ ఉంటుంది' అని స్పష్టమైన అభిప్రాయం వెలిబుచ్చారు. ఆ తర్వాత ఆయన మాటలు నిజమయ్యాయి. 'కృష్ణవేణి' శత దినోత్సవ వేడుకకు ఎన్టీఆర్‌ను ఆహ్వానిస్తే సొంత ఖర్చులతో హాజరయ్యారు. అప్పట్లో హీరోల మధ్య అంత అనుబంధం ఉండేది. ఇప్పటి హీరోల్లోనూ అది కనిపిస్తోంది.
Also Read : గోదావరిలో కృష్ణ, విజయ నిర్మలకు తప్పిన ప్రాణగండం - పెళ్ళైన కొత్తలో, తుఫానులో
ఎన్టీఆర్, ఏయన్నార్, శోభన్ బాబు, కృష్ణం రాజు, కృష్ణ పలు మల్టీస్టారర్ సినిమాలు చేశారు. తమ తర్వాత తరం హీరోలతో కలిసి నటించారు. తద్వారా అనుభవాన్ని భావి తరాలకు అందించారు. కష్టపడి పని చేయడం విషయంలోనూ ఆదర్శంగా నిలిచారు. ఒక్కొక్కరూ మూడు షిఫ్టులు నటిస్తూ సినిమాలు చేసిన రోజులు ఉన్నాయి. నిర్మాతలు నష్టపోతే మరొక సినిమా చేయడమనే సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. తెలుగు చిత్రసీమకు విలువల్ని భోదించారు. అటువంటి తారలు అందరూ ఇవాళ మన మధ్య లేకపోవడం బాధాకరం.
సినీ వినీలాకాశంలో తారలు వెలుగు వెలిగిన వారందరూ ఇప్పుడు ఆకాశం నుంచి తారల వలే పరిశ్రమపై చల్లటి కిరణాల్ని ప్రసారం చేస్తూ మనల్ని చల్లగా చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)