Maa Bava Manobhavalu Song : మా బావ మనోభావాలు - బాలకృష్ణ 'వీర సింహా రెడ్డి'లో కిర్రాక్ ఐటెం సాంగ్ వచ్చేసిందోచ్
Veera Simha Reddy New Song : నట సింహం నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా 'వీర సింహా రెడ్డి'లో 'మా బావ మనోభావాలు...' సాంగ్ విడుదలైంది.
మనోభావాలు... నిన్న మొన్నటి వరకు ఈ పదం చెబితే ఏమైంది? ఎవరు నిరసన చేస్తున్నారు? ఎక్కడ ఆందోళనకు దిగారు? వంటి పదాలు వినిపించేవి. ఇప్పుడు మాత్రం ఓ పాట గుర్తుకు వస్తుంది. అదీ నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) మహిమ! అదీ 'వీర సింహా రెడ్డి' సినిమా క్రేజ్!
మా బావ మనోభావాలు...
కిర్రాక్ ఐటెం వచ్చేసిందోయ్!
గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా ఆయన వీరాభిమాని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న భారీ ఫ్యాక్షన్ ఎంటర్‌టైనర్ 'వీర సింహా రెడ్డి'. ఇందులోని మూడో పాట 'మా బావ మనోభావాలు...' (Maa Bava Manobhavalu Full Song) ఈ రోజు విడుదల చేశారు. సినిమాలో ఐటెం సాంగ్ ఇది.
నారి నారి నడుమ నందమూరి బాలయ్య డ్యాన్స్ చేస్తే? ఆ సాంగ్ సూపర్ హిట్టే! అందుకు ఉదాహరణలు కోకొల్లలు. ఇప్పుడీ 'మా బావ మనోభావాలు దెబ్బ తిన్నాయి...' పాటలో కూడా ఇరువురు భామలతో ఆయన డ్యాన్స్ చేశారు. ఎప్పటిలా హుషారుగా స్టెప్పులు వేశారు. ఆ ఇద్దరిలో ఒకరు సినిమాలో హీరోయిన్ హానీ రోజ్ కాగా... మరొకరు 'చీకటి గదిలో చితక్కొట్టుడు' సినిమా ఫేమ్ చంద్రికా రవి. ఇద్దరు అందాల భామలకు ఇదే తొలి సినిమా కావడం విశేషం. సినిమాలో ఈ సాంగ్ చాలా స్పెషల్‌గా ఉండబోతోందని, ప్రేక్షకుల చేత థియేటర్లలో స్టెప్పులు వేయించేలా ఉంటుందని యూనిట్ టాక్.
బాలకృష్ణ కోసం తమన్ మాంచి ఎనర్జిటిక్ ట్యూన్ కంపోజ్ చేశారు. లిరికల్ వీడియోలో విజువల్స్ తక్కువ చూపించారు. వాటిలో బాలకృష్ణ డ్యాన్స్ ఇరగ దీసినట్టు అర్థం అవుతోంది. సాహితీ చాగంటి, యామిని, రేణు కుమార్ ఆలపించిన ఈ పాటను రామ జోగయ్య శాస్త్రి రాశారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు.
'మా బావ మనోభావాలు...' సాంగ్ లిరికల్ వీడియో ఇదిగో :
శృతితో చివరి పాట చిత్రీకరణలో బాలకృష్ణ
సంక్రాంతి కానుకగా జనవరి 12న 'వీర సింహా రెడ్డి' సినిమా థియేటర్లలోకి వస్తోంది. ఇందులోని తొలి పాట 'జై బాలయ్య'కు మంచి స్పందన లభించింది. రెండో పాట 'సుగుణ సుందరి'లో బాలకృష్ణ, శృతి హాసన్ మధ్య స్టెప్పులు అలరించాయి. ఇప్పుడు మూడో సాంగ్ కూడా ప్రోమోతో హిట్ టాక్ తెచ్చుకుంది. తమన్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయ్యేలా ఉంది.
ప్రస్తుతం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో లాస్ట్ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. హీరో హీరోయిన్లు బాలకృష్ణ, శృతి హాసన్ మీద ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ నేతృత్వంలో చిత్రీకరణ చేస్తున్నారు. ఈ పాట పూర్తయితే... సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అవుతుంది.
బాలకృష్ణకు దర్శకుడు గోపీచంద్ మలినేని వీరాభిమాని. లుక్స్ పరంగా మరింత కేర్ తీసుకుని, అభిమానులు కోరుకునే విధంగా చూపించారట. సాధారణంగా కమర్షియల్ సినిమాల రన్ టైమ్ రెండున్నర గంటల లోపు ఉండేలా దర్శక నిర్మాతలు జాగ్రత్త పడతారు. అంత కంటే ఎక్కువ ఉన్న సినిమాలు భారీ విజయాలు సాధించాయి. అందులో 'అఖండ' ఒకటి. ఆ సినిమా రన్ టైమ్ రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాలు. ఇప్పుడు 'వీర సింహా రెడ్డి' రన్ టైమ్ కూడా అటు ఇటుగా అంతే ఉంటుందని సమాచారం.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి.
హానీ రోజ్, వరలక్ష్మీ శరత్ కుమార్, మలయాళ నటుడు లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. చీకటి గదిలో చితకొట్టుడు' ఫేమ్ చంద్రికా రవి ప్రత్యేక గీతం చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు.
Also Read : బాలకృష్ణ ఇంటి నుంచి మరో నిర్మాత - పెట్టుబడి & వాటా?