(Source: ECI/ABP News/ABP Majha)
Korameenu Release Date : 'అవతార్ 2'తో పోటీ లేదు - వెనక్కి వెళ్ళిన 'కోరమీను'
Korameenu Postponed : ఆనంద్ రవి కథానాయకుడిగా నటించిన 'కోరమీను' చిత్రాన్ని తొలుత 'అవతార్ 2'కు పోటీగా విడుదల చేయాలనుకున్నారు. కానీ, ఇప్పుడు వెనక్కి వెళ్ళారు.
ఆనంద్ రవి (Anand Ravi) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'కోరమీను' (Korameenu Movie). ఏ స్టోరీ ఆఫ్ ఈగోస్... అనేది ఉపశీర్షిక. దీనికి ఆనంద్ రవి కథ, కథనం, మాటలు అందించారు. తొలుత ఈ చిత్రాన్ని డిసెంబర్ 15న విడుదల చేయాలని అనుకున్నారు. 'అవతార్ 2' విడుదలకు ఒక్క రోజు ముందు తమ చిత్రాన్ని తీసుకు వస్తున్నామని పోస్టర్ విడుదల చేసి... అందర్నీ సర్‌ప్రైజ్ చేశారు. ఆనంద్ రవి అండ్ టీమ్ ఆ రోజు విడుదల చేయడానికి రెడీగా ఉన్నా... సరిపడా సంఖ్యలో థియేటర్లు లభించని కారణంగా వెనక్కి వెళ్ళారు.
డిసెంబర్ 31న 'కోరమీను'
Korameenu New Release Date : 'కోరమీను'ను డిసెంబర్ 31న థియేటర్లలో విడుదల చేస్తున్నామని ఆనంద్ రవి వెల్లడించారు. ఆ రోజు ప్రేక్షకులు అందరూ సినిమా చూసి న్యూ ఇయర్‌ను హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఆనంద్ రవి మాట్లాడుతూ ''మర్డర్, కిడ్నాప్ నేపథ్యంలో మిస్టరీ సినిమాలు ఉంటాయి. కానీ, ఓ మనిషికి మీసాలు ఎవరు తీసేశారు? అనే కాన్సెప్ట్ మీద ప్రపంచంలో ఎక్కడా సినిమా రాలేదు. కాబట్టి, దీనిని మీసాల మిస్టరీ అని చెప్పవచ్చు. మీసాల నుంచి సినిమా మొదలు అవుతుంది. పేదవాడికి, గొప్ప వాడికి మధ్య జరిగే గొడవను కథలో తీసుకున్నాం. సినిమాలో చివరి ముప్పై నిమిషాలు ఎంతో కీలకం. మీరు సినిమా చూస్తే సర్ ప్రైజ్ అవుతారు. ఇది థ్రిల్లర్ సినిమా మాత్రమే కాదు... ఇందులో మంచి మ్యూజిక్ కూడా ఉంది. డిసెంబర్ 31న మ్యూజికల్ ఫిల్మ్‌గా సినిమాను ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. మేం కూడా హ్యాపీగా న్యూ ఇయర్‌ను సెలబ్రేట్ చేసుకునేలా చేస్తారని ఆశిస్తున్నాను'' అని అన్నారు.
సినిమాలో 'తెలిసిందిలే...' పాటను ప్రముఖ గాయని సునీత, 'బింబిసార' దర్శకుడు వశిష్ఠ విడుదల చేశారు. ఈ సందర్భంగా సినిమా విడుదల తేదీనీ ప్రకటించారు. సినిమాల్లో చిన్న, పెద్ద తేడాలు లేవని... మంచి కంటెంట్ ఉన్న సినిమాలు బాగా ఆడుతున్నాయని, ఆ కోవలో ఈ సినిమా కూడా చేరుతుందని ఆశిస్తున్నట్లు సునీత తెలిపారు. 'ప్రతినిధి'తో రచయితగా, 'నెపోలియన్'తో కథానాయకుడిగా హీరోగా విజయం సాధించిన ఆనంద్ రవి... 'కోరమీను'తో రచయితగా, కథానాయకుడిగా సక్సెస్ కావాలని కోరుకున్నట్లు వశిష్ఠ తెలిపారు.
ఫుల్ బాటిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శ్రీపతి కర్రి దర్శకత్వంలో పెళ్లకూరు సమన్య రెడ్డి 'కోరమీను' చిత్రాన్ని నిర్మించారు. ఆల్రెడీ విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. 'తెలిసిందే లే..' పాటకు కూడా మంచి స్పందన లభిస్తోందని నిర్మాత సమన్య రెడ్డి తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో శత్రు, 'జబర్దస్త్' ఇమ్మాన్యుయేల్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : మహేష్, త్రివిక్రమ్ సినిమాలో ఏం జరుగుతోంది? ఇకనైనా పుకార్లకు ఫుల్ స్టాప్ పడుతుందా?
కోటి పాత్రలో ఆనంద్ రవి, కరుణగా హరీష్ ఉత్తమన్, మీసాల రాజు పాత్రలో శత్రు, మీనాక్షిగా కిషోరీ దత్రక్, దేవుడు పాత్రలో రాజా రవీంద్ర, సీఐ కృష్ణ పాత్రలో గిరిధర్, ముత్యంగా 'జబర్దస్త్' ఇమ్మాన్యుయెల్, సుజాతగా ఇందు కుసుమ, వీరభద్రమ్ పాత్రలో ప్రసన్న కుమార్, కరుణ అసిస్టెంట్ పాత్రలో ఆర్కే నాయుడు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : కార్తీక్ కొప్పెర, నేపథ్య సంగీతం : సిద్ధార్థ్ సదాశివుని, నిర్మాణ సంస్థ : ఫుల్ బాటిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్, కథ - కథనం - మాటలు : ఆనంద్ రవి, దర్శకత్వం : శ్రీపతి కర్రి, నిర్మాత : పెళ్లకూరు సమన్య రెడ్డి.