Rishab Shetty: రూ.350 కోట్లకు చేరువలో ‘కాంతార’ కలెక్షన్స్ - రిషబ్ శెట్టికి దక్కింది ఇంతేనా?
‘కాంతార’ మూవీ 50 రోజులు పూర్తి చేసుకుంది. అంతేకాదు, సుమారు రూ.350 కోట్ల వసూళ్లతో బాక్సాఫీసు రికార్డులను బద్దలకొడుతోంది.
కన్నడ చిత్రం ‘కాంతార’ ఇంకా తన హవా కొనసాగిస్తూనే ఉంది. ఓటీటీలో ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతుందని ప్రకటించిన తర్వాత కూడా వసూళ్లు ఏ మాత్రం తగ్గలేదు. ఎందుకంటే.. ఈచిత్రాన్ని థియేటర్లో చూస్తేనే సూపర్‌గా ఉంటుందనేది బయట టాక్. అందుకే, వీకెండ్స్‌లో ఎవరూ మిస్ కాకుండా ఈ మూవీని చూస్తున్నారు. అందుకే, రిలీజ్ సమయం నుంచి ఇప్పటివరకు వచ్చిన వసూళ్లలో భారీ వ్యత్యాసమే ఉంది. కానీ, 50 రోజులపాటు థియేటర్లలో ఈ మూవీ ఇంక స్క్రీనింగ్ కొనసాగుతూనే ఉంది. ఫలితంగా ‘కాంతార’ రూ.350 కోట్లకు చేరువవుతున్నట్లు సమాచారం. డైలీ కలెక్షన్లు కూడా ఇంకా రూ.కోట్లలోనే ఉండటంతో ఈ చిత్రం రూ.400 కోట్ల వసూళ్లను రాబడుతుందని భావిస్తున్నారు.
అయితే, ‘కాంతార’ నవంబరు 24 నుంచి ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో స్ట్రీమింగ్ కానుంది. ఆ ప్రభావం సినిమాపై ఎంతవరకు చూపుతుందనేది చూడాలి. ‘కాంతార’ మూవీలో బీజీఎంకు ఎంతో ప్రత్యేకత ఉంది. అకస్మాత్తుగా వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుడిని ఉలిక్కిపాటుకు గురిచేస్తుంది. ఆ సీన్స్‌ను ఓటీటీల్లో చూస్తే అంత మజా రాకపోవచ్చని.. ఇప్పటికే ఆ మూవీని చూసిన ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఓటీటీలో ఈ మూవీ వచ్చేందుకు ఇంకా ఎన్నో రోజులు లేవు. ఈ నేపథ్యంలో ఈ వీకెండ్‌లో ఈ సినిమా ఎంత వసూలు చేస్తుందో చూడాలి.
రూ.344 కోట్లు వసూళ్లు, హిందీలోనూ దూసుకెళ్తున్న ‘కాంతార’
‘కాంతారా’ మూవీ హిందీలో కూడా దూసుకెళ్తోంది. బాలీవుడ్ చిత్రాలను దాటుకుని మరీ వసూళ్లలో సునామీ సృష్టిస్తోంది. ఇప్పటివరకు అక్కడ రూ.93.50 కోట్లు వసూళ్లు చేసినట్లు తెలిసింది. ఇక కర్ణాటకలో రూ.168 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.56 కోట్లు చొప్పున వసూళ్లు సాధించింది. తమిళనాడులో రూ.9.25 కోట్లు, కేరళలో రూ.17.25 కోట్లు రాబట్టింది. మొత్తంగా రూ.344 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్లతో ‘కాంతారా’ ఔరా అనిపిస్తోంది.
రిషబ్ శెట్టి పారితోషికం అంతేనా?: వందల కోట్ల వసూళ్లతో సాగిపోతున్న ఈ చిత్రంలో దర్శకుడు, హీరో రిషబ్ శెట్టికి రూ.4 కోట్లు మాత్రమే పారితోషికం లభించడం ఆశ్చర్యం కలిగిస్తోందని సినీ వర్గాలు అంటున్నాయి. రిషబ్ సరసన నటించిన సప్తమి గౌడకు రూ.1.2 కోట్లు పారితోషికం ఇచ్చారు. మొత్తం ఈ చిత్రాన్ని రూ.16 కోట్ల వ్యయంతో తెరకెక్కించడం గమనార్హం. మొదట్లో ఈ సినిమాపై అంతటి అంచనాలు లేవు. అయితే, కన్నడ ప్రజలకు బాగా నచ్చేయడంతో ఊహించని విజయం సాధించింది.
Also Read : 'ఐరావతం' రివ్యూ : థ్రిల్స్ ఉన్నాయా? లేదంటే టార్చర్ చేశారా?
తెలుగు కలెక్షన్లు కూడా కన్నడ నిర్మాతకే: వాస్తవానికి ‘కాంతార’ మూవీని తెలుగులో విడుదల చేసేందుకు గీతా ఆర్ట్స్.. హక్కులు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, కేవలం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ మాత్రమే తీసుకున్నట్లు సమాచారం. రైట్స్ మొత్తం కొనుగోలు చేయకుండా కేవలం కమీషన్ రూపంలో మాత్రమే వసూళ్లు దక్కుతాయి. అంటే వచ్చే కలెక్షన్లు మొత్తం గీతా ఆర్ట్స్‌కు రావు. వాటిలో కొంత మాత్రమే వస్తాయి. మిగతావి ఆ సినిమా నిర్మించిన కన్నడ నిర్మాతకు దక్కుతాయి. ‘కేజీఎఫ్’ వంటి పాన్ ఇండియా మూవీని అందించిన విజయ్ కిరగందూర్ ఈ చిత్రానికి నిర్మాత.