Kaikala Satyanarayana Last Movie : చివరి సినిమాలో కూడా యముడిగా - కైకాలకు ఈ సినిమా అంకితం
Kaikala Satyanarayana Death : కైకాల సత్యనారాయణ ఈ రోజు తుదిశ్వాస విడిచారు. ఆయన ఎన్నో పాత్రల్లో నటించారు. అందులో యముడి పాత్ర ఒకటి.
కైకాల సత్యనారాయణను నవరస నటనా సార్వభౌమ బిరుదుతో సత్కరించారు. తెలుగు తెరపై ఆయన ఎన్నో పాత్రల్లో నటించారు. ప్రేక్షకులను మెప్పించారు. అయితే, అన్ని పాత్రల కంటే యముడి పాత్ర ప్రత్యేకం. నరకాధిపతి యముడి పాత్రలో నటించిన ఆహార్యం, వాచకం ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకున్నాయి. వెండితెరపై ఆయన చివరి సినిమాలో క్యారెక్టర్ కూడా యముడి పాత్ర కావడం యాదృశ్చికం ఏమో!?
యముడిగా ఎన్నో సార్లు వెండితెరపై తన నటన, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్న కైకాల సత్యనారాయణ, చివరి సారిగా యముడి వేషం వేసి తిరిగి రాని లోకాలకు వెళ్ళారు. కార్తీక్ రాజు కథానాయకుడిగా నటించిన సినిమా 'దీర్ఘాయుష్మాన్ భవ'. ఇందులో మిస్తీ చక్రవర్తి కథానాయిక. టారస్ సినీ కార్ప్ & త్రిపుర క్రియేషన్స్ పతాకాలపై బొగ్గరం వెంకట శ్రీనివాస్, వంకాయలపాటి మురళీకృష్ణ సంయుక్తంగా నిర్మించారు. చిత్రానికి పూర్ణానంద్ దర్శకత్వం వహించారు. ఇందులో కైకాల యముడి పాత్ర పోషించారు. ఆయన మృతి పట్ల చిత్ర బృందం సంతాపం వ్యక్తం చేసింది.
'దీర్ఘాయుష్మాన్ భవ' చిత్ర నిర్మాతలు బొగ్గరం వెంకట శ్రీనివాస్, వంకాయలపాటి మురళీకృష్ణ మాట్లాడుతూ ''కైకాల సత్యనారాయణ గారు నవరస భరితమైన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించిన గొప్ప నటుడు. చారిత్రాత్మక, సాంఘిక చలన చిత్రాల్లో తనదైన శైలితో మెప్పించిన నవరస నటనా సార్వ భౌమడు. మేం నిర్మిస్తున్న 'దీర్ఘాయుష్మాన్ భవ'లో ఆయన యుముడి పాత్ర పోషించారు. ఆయన చివరి సినిమా ఇదే. ఈ రోజు కైకాల సత్యనారాయణ గారు మధ్య లేకపోవడం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ... కైకాల గారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం'' అని చెప్పారు.
జనవరిలో 'దీర్ఘాయుష్మాన్ భవ'!?
జనవరిలో 'దీర్ఘాయుష్మాన్ భవ' చిత్రాన్ని విడుదల చేయాలని అనుకున్నట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు. కైకాల సత్యనారాయణ గారి చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేసి, ఆ తర్వాత సినిమాను విడుదల చేయాలనుకున్నామని... కానీ, ఇంతలో ఈ విధంగా అయ్యిందని వారు పేర్కొన్నారు. కైకాల మరణం తమను తీవ్రంగా కలిచి వేసిందని చెప్పారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : మల్హర్ భట్ జోషి, సంగీతం : వినోద్ యాజమాన్య, సమర్పణ : శ్రీమతి ప్రతిమ.
Also Read : '18 పేజెస్' రివ్యూ : నిఖిల్, అనుపమ నటించిన సినిమా ఎలా ఉందంటే?
యముడంటే ఆయనే...
నిండైన విగ్రహం.. అలంకారాలతో అతి గంభీరంగా కనిపించే యముడు.. అంత సరదాగా ఉంటాడని.. మన ఇంట్లో మనిషిగా మారిపోతాడని ఎవరైనా ఊహించారా.. స్వచ్ఛమైన తన చిరునవ్వుతో.. అద్భుతమైన తన నటనతో సాధ్యం చేసిన వాడు కైకాల. అంతకు మందు పౌరాణిక సినిమాల్లో చాలా మంది యముడి పాత్రలు పోషించారు. కానీ కైకాల ఆ క్యారెక్టర్ కే.. ఓ క్యారెక్టరిస్టిక్ తీసుకొచ్చారు. ఇంకెవరు ఎంత బాగా చేసినా ఆయన సాటికి రారు అన్నంత రీతిలో దాన్ని నిలిపారు. యముడు, ఘటోత్కచుడు వంటి పాత్రలకు చిన్న పిల్లలు సైతం కేరింతలు కొట్టేలా చేయగలిగారు అంటే.. అది ఆయనకు మాత్రమే సాధ్యమైన విద్య.
Also Read : ధమాకా రివ్యూ: 2022ని రవితేజ హిట్టుతో ముగించాడా? థియేటర్లో ధమాకా పేలిందా? తుస్సుమందా?
ఎన్టీఆర్ సైతం ఆశ్చర్యపోయేలా...
గొప్పగా నటించగలిగే వాళ్లు చాలా మంది ఉంటారు, ఉండొచ్చు. కానీ అందరికీ అన్నీ పాత్రలు నప్పవు. కానీ సత్యనారాయణ, ఎస్వీఆర్, ఎన్టీఆర్ లాంటి వాళ్లు అన్ని పాత్రలకు సరితూగగలిగే నటులు. సత్యనారాయణ మంచి అందగాడు.. స్పురద్రూపి ఏ క్యారెక్టర్ అయినా అవలీలగా పోషించగలిగే ముఖ వర్చస్సు ఉన్న వ్యక్తి. అందుకే అన్ని క్యారెక్టర్లు ఆయన ముందువాలాయి. కథానాయకుడిగానే సినిమా ప్రయాణం మొదలుపెట్టినా.. విలన్ వేషాలతో కేరీర్ కొనసాగించాల్సి వచ్చింది. కానీ ఆయనకేమో ఆల్ రౌండర్ అనిపించుకోవాలని కోరిక. అందుకే విలక్షణ పాత్రలను వేయాలని పరితపించేవారు. ఆ కోరికను తీర్చింది.. ఎన్టీఆర్ నిర్మాణ సారధ్యంలోని ‘ఉమ్మడి కుటుంబం’ సినిమా. అందులో అత్తారింట్లో నలిగిపోయే అల్లుడిగా సత్యనారాయణ చేసిన పాత్ర ఎన్టీఆర్‌నే ఆశ్చర్యపోయేలా చేసింది. క్రూరత్వం నిండిన పాత్రలతోనే జనాలకు తెలిసిన సత్యనారాయణ ఆ పాత్ర చేయలేరేమో అని, చేసినా జనం స్వీకరించరేమో అని ఎన్టీఆర్ సందేహించారు. కానీ.. అందరి అభిప్రాయాలను ఆ సినిమాతో పటాపంచలు చేశారు సత్యనారాయణ.