Kaikala Satyanarayana Died: ఎన్టీఆర్‌కు డూప్‌గా నటించిన కైకాల - అన్నగారికి తమ్ముడిలా, విడదీయలేని బంధం!
కైకాల సత్యనారాయణ, ఎన్టీఆర్ మధ్య ఉన్న అనుబంధం అలాంటి ఇలాంటిది కాదు. అన్నదమ్ముల్లా, ప్రాణ స్నేహితుల్లా మెలిగేవారు. సినిమాల్లో, రాజకీయాల్లో ఎల్లప్పుడూ కలిసే ఉండేవారు.
కైకాల సత్యనారాయణ, ఎన్టీఆర్ మధ్య ఉన్న అనుబంధం మాటల్లో చెప్పలేనిది. ఆ రోజుల్లో ఎన్టీఆర్ తనకు ఏ విధంగా సహాయపడేవారనేది చాలా సందర్భాల్లో కైకాల చెప్పేవారు. వాస్తవానికి సత్యనారాయణ సినిమాల్లోకి రావడానికి కారణం.. ఎన్టీఆర్‌కు దగ్గర పోలికలు ఉండటమేనట. ఒక్కోసారి అవకాశాలేవీ లేనప్పుడు ఎన్టీఆర్‌కు డూప్‌గా చేస్తావా అని అడిగేవారట. అంతకన్నా గొప్ప అవకాశం ఏముంది అనుకుంటూ కైకాల కూడా డూప్‌గా చేయడానికి అంగీకరించేవారట. ఆ తర్వాత కైకాల క్రమేనా తన ప్రతిభను నిరూపించుకుని విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడ్డారు. ఎన్టీఆర్‌తో కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. నటనలోనే కాదు.. రాజకీయ రంగంలో కూడా ఆయనతో కలిసి అడుగులేశారు సత్యనారాయణ. ఎన్టీఆర్ రాజకీయ పార్టీ స్థాపనలో కీలక పాత్ర పోషించారు.
యముడంటే కైకాలే!
ఎన్టీఆర్, సత్యనారాయణ కలిసి నటించిన సినిమాలు అక్షరాలా 100. ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఓ నటుడు కలిసి నటించిన అత్యధిక చిత్రాల రికార్డు దక్షిణాదిన వీరిదేనేమో. రాముడు-భీముడు సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ద్విపాత్రాభినయం కాగా.. ఓ పాత్రలో కైకాల సత్యనారాయణే ఎన్టీఆర్ కి డూప్ గా వ్యవహరించారు. పతాక సన్నివేశాల్లో, ఫైట్ సీన్లలో నేరుగా సత్యనారాయణే ఎన్టీఆర్ నటించిన సందర్భాలు ఉన్నాయి. ఎన్టీఆర్ పోషించటానికి వీలులేని పాత్రలన్నీ సత్యనారాయణ దగ్గరకు రావటం ప్రారంభించాయి. తన కోసం ఇంత కష్టపడుతున్న సత్యనారాయణ.. నటుడిగానూ నిరూపించుకోవాలని ఎన్టీఆర్ తాపత్రయ పడేవారట. అలా ఎన్నో పౌరాణిక చిత్రాల్లో తన పాత్ర తర్వాత అంత ప్రాధాన్యం ఉన్న పాత్రలను సత్యనారాయణకు ఇప్పించేవారట ఎన్టీఆర్. ఇద్దరి మధ్య కొన్ని సందర్భాల్లో మనస్పర్థలు వచ్చినా.. తమ్ముడూ అంటూ ఆప్యాయంగా పిలుస్తూ క్షమించమని కోరటం ఎన్టీఆర్ పెద్దరికానికి నిదర్శనం అంటారు సత్యనారాయణ. ఇక యమగోల సినిమాతో తొలిసారి యముడి వేషం కట్టిన కైకాల సత్యనారాయణను చూసి యముడంటే ఇలానే ఉండాలని ఎన్టీఆర్ ఓ స్టేట్‌మెంట్ ఇచ్చారు. కైకాల హుందా నటన, ఎన్టీఆర్ మాస్ యాక్టింగ్ కలిసి ఆ రోజుల్లో బద్దలు కొట్టిన రికార్డులు, సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు.
స్నేహమంటే వారిదే..
‘నిప్పులాంటి మనిషి’ చిత్రంలో స్నేహమేరా జీవితం పాట.. సినిమా పరంగా ఎలా ఉన్నా వాళ్ల నిజజీవిత అనుబంధానికి అద్దం పడుతుంది. సత్యనారాయణ, ఎన్టీఆర్ ఒకే ఫ్రేములో ఉంటే ఒక సింహం, ఒక ఏనుగు ఢీకొన్నట్లు ఉండేది. నన్ను నంబర్ వన్ విలన్‌వి అని అన్నగారు మెచ్చుకునేవారని చెబుతారు సత్యనారాయణ. ఉమ్మడి కుటుంబం సినిమాలో సెంటిమెంట్ పండించే రైతు పాత్రను ఇస్తే.. విలన్‌గా చేసేవాడికి సెంటిమెంట్ క్యారెక్టరా అన్నవాళ్లు ఉన్నారు. ఆ పాత్రతో ప్రేక్షకులచేత కన్నీరు పెట్టించి నటుడిగా తనేంటో నిరూపించుకునే అవకాశాన్ని ఎన్టీఆర్ కల్పించారంటూ చాలా సార్లు కృతజ్ఞతలు చెప్పుకుంటారు సత్యనారాయణ. ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పుడు.. ఆయన పార్టీ నిర్మాణానికి రూపకల్పన చేస్తున్నప్పుడు.. ప్రచార ప్రణాళికలు.. అధికారం కైవసం చేసుకోవటం ఇలా ప్రతీ సందర్భంలోనూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా సత్యనారాయణ ఎన్టీఆర్ కు తోడుగా నిలిచారు. కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎన్నిసార్లు ఆహ్వానించినా.. సత్యనారాయణ పెద్దగా ఆసక్తి చూపించలేదు. చివరిరోజుల్లో సత్యనారాయణను పిలిచి నీకు మాత్రమే ఏం చేయలేకపోయాను. రాజ్యసభకు పంపించే ఆలోచనలో ఉన్నానని చెప్పారట ఎన్టీఆర్. అది అప్పుడు కుదరకపోయినా.. ఆతర్వాత చంద్రబాబు ఆహ్వానం మేరకు 1996లో మచిలీపట్నం ఎంపీగా గెలిచి లోక్ సభకు వెళ్లారు సత్యనారాయణ. ఆ మరుసటి ఎన్నికల్లో ఓటమి పాలవటంతో.. రాజకీయాల నుంచి పూర్తిగా నిష్క్రమించారు సత్యనారాయణ. అలా సత్యనారాయణ కెరీర్ లో ఎన్టీఆర్ ది ప్రత్యేక అనుబంధం.
Also Read: నటుడిగా కైకాల ప్రయాణంలో మజిలీలు - సత్యనారాయణ సమగ్ర సినిమా చరిత్ర