Kaikala Satyanarayana Death : నటుడిగా కైకాల ప్రయాణంలో మజిలీలు - సత్యనారాయణ సమగ్ర సినిమా చరిత్ర
Kaikala Satyanarayana Death : నటుడు కైకాల సత్యనారాయణ ఈ రోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు తుదిశ్వాస విడిచారు.
నాయకుడిగా...
ప్రతినాయకుడిగా...
నటుడిగా... హాస్యనటుడిగా...
కైకాల చేయని క్యారెక్టర్ లేదు.
జానపదమైనా...
పౌరాణికమైనా...
చారిత్రాత్మకమైనా...
సాంఘీక చిత్రమైనా...
కైకాల టచ్ చేయని జానర్ లేదు.
ఆయన మెప్పించని సినిమా లేదు.
ఐదు తరాల హీరోలతో సినిమాలు చేసిన నట శిఖరం...
ఆరు పదుల సినిమా ప్రయాణం...
ఎనిమిది వందలకు పైగా సినిమాల్లో నటించిన అభినయ కౌశలం... కైకాల సత్యనారాయణ (Kaikala Satyanarayana).
హీరోలకు స్టార్లు, సూపర్ స్టార్లు బిరుదులు ఇచ్చినట్టు... క్యారెక్టర్ ఆర్టిస్టులకు ఇస్తే? అందులో కైకాలది ముందు వరుస. క్యారెక్టర్ ఆర్టిస్టుగా సూపర్ స్టార్ట్ స్టేటస్ సొంతం చేసుకున్న ఘనత ఆయనది. ఆయన ఓ నటనా విశ్వ విద్యాలయం. ఆయనది 'నవసర నటనా సార్వభౌమ'గా ప్రేక్షకుల చేత మన్ననలు అందుకున్న అభినయం. మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ నటుల్లో ఆయన ఒకరు. అటువంటి కైకాల సత్యనారాయణ ఇక లేరు (Kaikala Satyanarayana Is No More).
ఇకపై కైకాల... తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరువలేని చరిత్ర.
కైకాల జన్మస్థలం కృష్ణా జిల్లాలోని కౌతవరం. ఆయన జూలై 25, 1935న జన్మించారు. గుడ్లవల్లేరులో పదో తరగతి వరకూ, విజయవాడలో ఇంటర్, గుడివాడలో డిగ్రీ చదివారు. కాలేజీ రోజుల్లో ఆయనకు నాటకాలపై ఆసక్తి, అభిరుచి ఏర్పడ్డాయి. నటుడు కావాలని కలలు కన్నారు. 'బంగారు సంకెళ్లు', 'ప్రేమ లీలలు', 'కులంలేని పిల్ల', 'ఎవరు దొంగ' తదితర నాటకాల్లో నటించారు. అందులో 'ఎవరు దొంగ' నాటకాన్ని ఆచార్య ఆత్రేయ రాశారు. కైకాల పలు నాటక పోటీల్లో పాల్గొన్నారు. ఎన్నో బహుమతులు అందుకున్నారు. వెండితెరకు హీరోగా పరిచయమైన ఆయన, తర్వాత విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. అంతకు ముందే... నాటకాల్లోనూ కైకాల హీరోగా, విలన్‌గా నటించారు. నాటకాల్లోనూ ఆయనో స్టార్. ఆయన నటుడు మాత్రమే కాదు, స్పోర్ట్స్ ప్లేయర్ కూడా! కాలేజీలో ఉన్నప్పుడు వాలీబాల్, క్రికెట్ ఆడేవారు. స్పోర్ట్స్ అథారిటీ మేనేజర్‌గా పని చేశారు. ఆయన్ను స్నేహితులందరూ హీరోలా ఉంటాడని అనేవారు. కొందరు ఎన్టీఆర్‌లా ఉన్నాడనేవారు. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించమని సలహాలు ఇచ్చేవారు. ఇంటర్‌లో ఉండగా ఇండస్ట్రీ నుంచి ఆయనకు ఆహ్వానాలు వచ్చాయి. అయితే... డిగ్రీ పూర్తి చేసిన తర్వాత సినిమా ఛాన్సుల కోసం ప్రయత్నించారు.
Kaikala Satyanarayana First Movie : అప్పుడు కైకాలకు ఇరవై ఏళ్లు కూడా నిండలేదు. ఇంటర్ చదువుతున్నారు. అప్పటికే నాటకాల్లో నటిస్తున్నారు. విజయవాడలోని హనుమంతరాయ గ్రంథాలయంలో నాటక పోటీలకు వెళ్లారు. 'ఎవరు దొంగ' నాటకాన్ని ప్రదర్శించారు. ఆ పోటీలకు అతిథిగా వచ్చిన దర్శకుడు గరికపాటి రాజారావు సినిమాల్లోకి రావాలని ఆహ్వానించగా... డిగ్రీ పూర్తి చేశాక వస్తానని కైకాల చెప్పారు. అయితే... డిగ్రీ పూర్తయిన తర్వాత నేరుగా సినిమాల్లోకి వెళ్లలేదు. రాజమండ్రిలో కొంతకాలం కుటుంబానికి చెందిన కలప వ్యాపారం చూసుకున్నారు. ఆ తర్వాత స్నేహితుడు కె.ఎల్. ధర్ సలహాతో సినిమా ఛాన్సుల కోసం మద్రాస్ వెళ్లారు. ప్రముఖ దర్శక-నిర్మాత ఎల్.వి. ప్రసాద్ దగ్గర అప్పటికే కె.ఎల్. ధర్ సహాయ దర్శకుడిగా పని చేస్తున్నారు. ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వంలో ఓ సినిమా చేసే అవకాశం వచ్చింది. కానీ, కాలం కలిసి రాలేదు. సినిమా మొదలు కాలేదు. మరో అవకాశం వచ్చింది. చివరకు, అది వేరొకరికి దక్కింది. దాంతో పరిశ్రమలో పరిస్థితులు ఎలా ఉంటాయో నటుడు కాకముందే కైకాలకు తెలిసింది. అయినా... పట్టు వదలని విక్రమార్కుడిగా ప్రయత్నించారు. సక్సెస్ మీద సక్సెస్ అందుకున్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమకు కైకాల సత్యనారాయణ పరిచయమైన సినిమా 'సిపాయి కూతురు'. అందులో ఆయన హీరో. జమునకు జంటగా నటించారు. అయితే... ఆయనకు వచ్చిన తొలి ఛాన్స్ 'సిపాయి కూతురు' కాదు, 'కొడుకులు - కోడళ్లు'. అది ఎల్.వి. ప్రసాద్ తీయాలన్న సినిమా. కె.ఎల్. ధర్ ద్వారా ఎల్.వి. ప్రసాద్‌ను కైకాల కలిశారు. 'కొడుకులు - కోడళ్లు' ఆడిషన్స్ జరుగుతుంటే... కైకాల పాల్గొన్నారు. రంగస్థలం మీద నటించిన అనుభవం ఉండటంతో అవలీలగా నటించేశారు. స్క్రీన్ టెస్ట్‌లు చేసి ఎల్.వి. ప్రసాద్ ఓకే చేశారు. కానీ, బ్యాడ్ లక్. సినిమా స్టార్ట్ కాలేదు. ఆ తర్వాత కె.వి. రెడ్డి దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన 'దొంగ రాముడు'లో విలన్ రోల్ చేసే ఛాన్స్ వచ్చింది. ఆడిషన్స్, స్క్రీన్ టెస్ట్‌లు చేశారు. అంతా ఓకే అనుకున్నారు. చివరకు, ఆ రోల్ ఆర్. నాగేశ్వరరావుకు దక్కింది. ఆ సమయంలో కైకాల కుంగిపోలేదు. పట్టు వదలని విక్రమార్కుడిలా, ధైర్యంగా అవకాశాల వేట సాగించారు. ఓ రోజు అక్కినేనితో 'దేవదాసు' సినిమా నిర్మించిన డి.ఎల్. నారాయణ కంట్లో సత్యనారాయణ పడ్డారు. తాను నిర్మిస్తున్న 'సిపాయి కూతురు'లో హీరోగా కైకాలకు ఆయన అవకాశం ఇచ్చారు. ఏ 'దొంగ రాముడు'లో అయితే ఆయన అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిందో... ఆ సినిమాలో అక్కినేని చెల్లెలుగా నటించిన జమునకు జంటగా, హీరోగా నటించే అవకాశం వచ్చింది. అవకాశాలు రావడం అదృష్టం అయితే... హీరోగా చేసిన సినిమాలు ఆశించిన విజయాలు అందుకోకపోవడం దురదృష్టం. అలాగని, కైకాల కుంగిపోలేదు. కొన్ని సినిమాల్లో నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్)కు డూప్‌గా చేసే అవకాశాలు వస్తే... కాదనకుండా చేశారు. ఆ తర్వాత హీరో నుంచి నటుడిగా మారారు.
జానపద బ్రహ్మ విఠలాచార్య సలహాతో కైకాల సత్యనారాయణ విలన్‌గా మారారు. ఆ నిర్ణయంతో కొన్నాళ్లు కెరీర్‌లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 'కనకదుర్గ పూజా మహిమ'లో కైకాలకు నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేసే అవకాశం ఇచ్చారు విఠలాచార్య. ఆ తర్వాత ఎన్టీఆర్ 'అగ్గి పిడుగు'లోనూ విలన్ వేషం ఇచ్చారు. ఆ తర్వాత వరుస ప్రతినాయకుడి పాత్రలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో కైకాల సత్యనారాయణ నంబర్ వన్ విలన్ అయ్యారు. అయితే... ఆయనకు టైప్ కాస్ట్ కావడం ఇష్టం ఉండేది కాదు. డిఫరెంట్ క్యారెక్టర్లు చేయాలని కోరుకునేవారు. పౌరాణిక పాత్రలు చేశారు. తన అభినయంతో ప్రేక్షకులను మెప్పించారు. రాముడు, కృష్ణుడు తప్ప ఎన్టీఆర్ పోషించిన పౌరాణిక పాత్రలు అన్నీ కైకాల పోషించారు. రాముడిగా, కృష్ణుడిగా ఎన్టీఆర్‌కు డూప్‌గా చేశారు. పౌరాణిక పాత్రలు, విలన్ క్యారెక్టర్లు చేస్తున్న కైకాల సత్యనారాయణ కెరీర్‌లో మరో మలుపు 'ఉమ్మడి కుటుంబం'. అందులో ఎన్టీఆర్ అన్నయ్యగా... అత్తారింట్లో ఇబ్బందులు పడే చేతకాని అల్లుడిగా అద్భుతంగా నటించారు. కళాతపస్వి కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన 'శారద' సినిమా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కైకాలకు తిరుగులేదని నిరూపించింది. ఆ తర్వాత నుంచి సినిమాల్లో కీలక పాత్రల కోసం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
కైకాల సత్యనారాయణ సినిమా జీవితంలో మేలు మజిలీ అంటే 'యమగోల' అని చెప్పాలి. ఎన్టీఆర్ హీరోగా తాతినేని రామారావు దర్శకత్వం వహించిన ఆ సినిమాలో యముడిగా కైకాల నటించారు. యముడు అంటే ఇలాగే ఉంటాడేమో అన్నంతగా మెప్పించారు. ఎన్టీఆర్ 'యమగోల' నుంచి రవితేజ 'దరువు' వరకూ పలు చిత్రాల్లో యముడిగా నటించారు. ఈ మధ్యలో కొంతమంది యముడిగా నటించారు. ప్రేక్షకుల్లో కైకాల సత్యనారాయణ వలే ఎవరూ పేరు తెచ్చుకోలేదు. జనాల్లో యముడు అంటే ఆయనే అన్నంతగా ముద్ర పడింది. 'ప్రేమనగర్', 'అడవి రాముడు', 'వేటగాడు', 'మోసగాళ్ళకు మోసగాడు', 'దొంగల వేట', 'తాత మనవడు', 'తూర్పుపడమర', 'నేరము శిక్ష', 'సిరిసిరి మువ్వ', 'గ్యాంగ్ లీడర్', 'సంసారం సాగరం', 'రామయ్య తండ్రి', 'జీవితమే ఒక నాటక రంగం', 'దేవుడే దిగివస్తే', 'సమరసింహారెడ్డి', 'బొబ్బిలి రాజా', 'మంత్రిగారి వియ్యంకుడు', 'అత్తకు యముడు అమ్మాయికి మొగుడు', 'ఒంటరి పోరాటం'... నటుడిగా కైకాల సత్యనారాయణ మెప్పించిన సినిమాలు చెబుతూ వెళితే ఎన్నో, ఎన్నెన్నో! కైకాల నటించిన చివరి సినిమా 'మహర్షి'. అందులో పూజా హెగ్డే తాతయ్యగా, అతిథి పాత్రలో తళుక్కుమన్నారు. అంతకు ముందు ఎన్టీఆర్ బయోపిక్ 'యన్.టి.ఆర్ - కథానాయకుడు'లో దర్శకుడు హెచ్.యమ్. రెడ్డి పాత్రలో కనిపించారు. నటుడిగా ఆయన పూర్తిస్థాయిలో కనిపించిన చివరి సినిమా 'అరుంధతి' అని చెప్పాలి.
Kaikala Satyanarayana As Producer : నటనకు మాత్రమే పరిమితం కాకుండా నిర్మాతగానూ కైకాల సత్యనారాయణ తనదైన ముద్ర వేశారు. రమా ఫిలిమ్స్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి... తమ్ముడు కె. నాగేశ్వరరావు నిర్మాతగా సినిమాలు తీశారు. దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఆయన నిర్మించిన 'బంగారు కుటుంబం' చిత్రానికి నంది పురస్కారం అందుకున్నారు. ఇంకా 'గజ దొంగ', 'ఇద్దరు దొంగలు', 'కొదమ సింహం', 'ముద్దుల మొగుడు' చిత్రాలు నిర్మించారు. చిరంజీవి చిత్రాలు కొన్నిటికి సహ నిర్మాతగా వ్యవహరించారు. కైకాలకు ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు... మొత్తం నలుగురు సంతానం. అమ్మాయిలు ఇద్దరూ చెన్నైలో సెటిల్ అయ్యారు. ఆయన కుమారులు నటులుగా రాలేదు. కానీ, నిర్మాణంలో వచ్చారు. కన్నడ హీరో యశ్‌కు రెండో కుమారుడు సన్నిహితుడు. ఆయన కన్నడలో సినిమాలు చేస్తున్నారు.
Also Read : ఆస్కార్ బరిలో తెలుగమ్మాయి నిర్మించిన పాకిస్తాన్ సినిమా
తెలుగులో నాగయ్య తరం నుంచి ఆ తర్వాత ఎన్టీఆర్, ఏయన్నార్... చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్... ఇప్పటి స్టార్ హీరోలు మహేష్ బాబు, ఎన్టీఆర్ వరకూ... ఐదు తరాల హీరోలు అందరితో కైకాల నటించారు. తమిళంలో రజనీకాంత్, కమల్ హాసన్... హిందీలో దిలీప్ కుమార్, అనిల్ కపూర్ వంటి హీరోలతో కైకాల సత్యనారాయణ నటించారు.
నాయకుడిగా, ప్రతినాయకుడిగా, నటుడిగా, విలనిజంలో వినోదం పండించిన నటుడిగా వెండితెరపై వైవిధ్యానికి మారుపేరుగా ఆయన నిలిచారు. 'నవసర నటనా సార్వభౌమ'గా పేరు పొందారు. 2011లో రఘుపతి వెంకయ్య పురస్కారం వరించింది. అయితే... ఆయనకు పద్మ పురస్కారం రాలేదు. ఈ విషయం గురించి ఓ సందర్భంలో మాట్లాడుతూ "నాకు బ్యాక్ గ్రౌండ్ లేకపోవడం వల్ల ఆ అవార్డులు రాలేదు. అయినా ప్రజల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నాను. అదే అన్నిటి కంటే పెద్ద అవార్డు. నాకు అది చాలు" అని అన్నారు. నిజమే... ప్రజల హృదయాల్లో కైకాల సత్యనారాయణది ఎప్పటికీ చెరగని స్థానమే.
Also Read : స్టార్ డైరెక్టర్స్ పరువు తీసిన 2022 - ఈ ఏడాది వీళ్ళ స్టార్ బాగోలేదనుకుంట!