Sukumar: పూరికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయాలనుకున్న సుకుమార్ - ఇప్పుడేమో!
పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేసిన 'లైగర్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. రేపే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
టాలీవుడ్ లో ఉన్న అగ్ర దర్శకుల్లో పూరి జగన్నాధ్ ఒకరు. ఆయన సినిమాలకు యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. మరోపక్క క్రియేటివ్ డైరెక్టర్ గా తనకంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు సుకుమార్. 'పుష్ప' సినిమాతో ఆయన రేంజ్ ఇంటర్నేషనల్ లెవెల్ కి రీచ్ అయింది. అలాంటి దర్శకుడు సుకుమార్.. పూరి జగన్నాధ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయాలనుకున్న విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేసిన 'లైగర్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. రేపే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పూరిని ఇంటర్వ్యూ చేశారు సుకుమార్. ఈ ఇంటర్వ్యూలో పూరి ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇదే సమయంలో పూరి పనితనాన్ని పొగుడుతూ కొన్ని కామెంట్స్ చేశారు సుకుమార్.
'మీరు సినిమాల్లో హీరోలను ప్రెజంట్ చేసే విధానం నాకు బాగా నచ్చుతుంది. 'బద్రి' సినిమాలో పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్ ట్రేడ్ మార్క్ గా నిలిచాయి. 'పోకిరి' సినిమాలో మహేష్ బాబు, 'బుజ్జిగాడు'లో ప్రభాస్ డైలాగ్ డెలివెరీ ఓ రేంజ్ లో ఉంటాయి' అంటూ పూరిని తెగ పొగిడేశారు. ఇదే సమయంలో పూరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయడానికి అతడిని సంప్రదించిన విషయాన్ని కూడా వెల్లడించారు.
సుకుమార్ తన కెరీర్ ఆరంభంలో వి.వి.వినాయక్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. వినాయక్ డైరెక్ట్ చేసిన 'దిల్' సినిమాకి డైలాగ్స్ కూడా రాశారు సుకుమార్. ఆ తరువాత ఆర్య సినిమాతో దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టారు. ఇప్పుడు ఇండియాలో ఉన్న బెస్ట్ డైరెక్టర్స్ లో ఒకరిగా మారారు. ప్రస్తుతం ఆయన 'పుష్ప2' సినిమాను రూపిందించే పనిలో పడ్డారు.
ఇక 'లైగర్' సినిమా విషయానికొస్తే.. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. స్పోర్ట్స్ యాక్షన్ ప్రధానంగా సాగే ఈ సినిమాలో రమ్యకృష్ణ విజయ్ తల్లి పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించారు. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలకపాత్రలో నటించారు. ప్రముఖ బాలీవుడ్ దర్శక - నిర్మాత కరణ్ జోహార్‌కు చెందిన ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ నిర్మించారు. ఈ సినిమాకు పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా నిర్మాతలు.
ఈ సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. సినిమా నిడివి 2 గంటల 20 నిమిషాలు. అయితే ఈ సినిమాకి సెన్సార్ టీమ్ ఏడు మార్పులు సూచించినట్లు తెలుస్తోంది. అందులో కొన్ని డైలాగ్స్ మార్చాల్సి వచ్చింది, కొన్ని చోట్ల మ్యూట్ వేయాల్సి వచ్చింది. నిడివిలో మాత్రం ఎలాంటి మార్పులు లేదు.