Avatar2 Movie: 'అవతార్ 2' తెలుగు రైట్స్ విలువ అన్ని కోట్ల రూపాయలా?
అవతార్' కు సీక్వెల్ గా 'అవతార్ 2 ది వే ఆఫ్ వాటర్' సినిమాను ముందుకు తీసుకొస్తున్నారు జేమ్స్ కేమరూన్. సుమారు 160 దేశాల్లో ఈ సినిమా గ్రాండ్ గా ఈ యేడాది డిసెంబర్ 16 న విడుదల కానుంది.
తెలుగులో హాలీవుడ్ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. హాలీవుడ్ లో హిట్ అయిన అన్ని సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. హాలీవుడ్ మూవీ 'అవతార్' గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండరు అనుకుంటా. అంతలా ఆకట్టుకుంది ఆ సినిమా. ఒక్క తెలుగులోనే కాదు భాషలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ప్రతి చోట ‘అవతార్’ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 'టైటానిక్' సినిమా తీసిన జేమ్స్ కేమరూన్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఆయన ఈ సినిమా కోసం తొమ్మిది సంవత్సరాలు కృషి చేసారు. ఆయన అన్నేళ్ల కృషి ఫలితమే 'అవతార్' సినిమా. ఈ విజువల్ వండర్ భారతీయ ప్రేక్షకులనూ ఓ కొత్త లోకం లోకి తీసుకెళ్లింది. 2009 డిసెంబర్ 10 న విడుదలైన 'అవతార్' కు ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు.
అయితే ఇప్పుడు 'అవతార్' కు సీక్వెల్ గా 'అవతార్ 2 ది వే ఆఫ్ వాటర్' సినిమా ను ముందుకు తీసుకొస్తున్నారు జేమ్స్ కేమరూన్. సుమారు 160 దేశాల్లో ఈ సినిమా గ్రాండ్ గా ఈ యేడాది డిసెంబర్ 16 న విడుదల కానుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హై ఎండ్ టెక్నాలజీతో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సీనిమా బిజినెస్ అన్ని చోట్లా రికార్డులు సృష్టిస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక ఈ సినిమా రైట్స్‌కు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉత్కంఠ నెలకొంది. డిస్టిబ్యూటర్లు ఈ సినిమా రైట్స్ ను పొందటానికి ఆసక్తి చూపుతున్నారట. ఈ సినిమా తెలుగు వెర్షన్ కు 100 కోట్ల పైగానే ధర ఉందని ట్రేడ్ వర్గాల టాక్. పలువురు బడా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కలసి ఈ 'అవతార్ 2' సినిమాను కొనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు ఈ వార్తలే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
మన దేశంలో హాలీవుడ్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. హాలీవుడ్ సినిమాలను ఇండియన్స్ ఎక్కువగానే చూస్తారు. ఇప్పటివరకూ వచ్చిన హాలీవుడ్ సినిమాల కంటే 'అవతార్ 2' బిజినెస్ ఎక్కువగా జరగడం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే మార్వెల్ స్టూడియోస్, డీసీ నుంచి వచ్చే సినిమాలను చూసేందుకే మన ఆడియెన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ముఖ్యంగా సూపర్ హీరోస్ బ్యాగ్రౌండ్ లో ఉన్న సినిమాలు ఇక్కడ ఎక్కువ కలెక్షన్స్ సాధించాయి.
ఇప్పటి వరకు హాలీవుడ్ సినిమాల్లో ఇండియాలో ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమాగా అవెంజర్స్ ఎండ్ గేమ్ ఉంది. ఈ సినిమాకు ఇండియా లో 446 కోట్లకు పైగా వసూళ్ళు వచ్చాయి. దీని తర్వాత అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ 290 కోట్లు, జంగిల్ బుక్ 258 కోట్లు వచ్చాయి. కానీ వీటి బిజినెస్ మాత్రం 100 కోట్ల లోపే జరిగింది. కానీ 'అవతార్2' బిజినెస్ 330 కోట్లకు పైగా జరగడం ఆసక్తి నెలకొంది. అందులోనూ తెలుగు డబ్బింగ్ రైట్స్ కూడా వంద కోట్లకు పైగా ఉండటం తో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి 'అవతార్2' ఇటు తెలుగు అటు జాతీయ స్థాయిలో ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో చూడాలి.