(Source: ECI/ABP News/ABP Majha)
Guntur Kaaram: ఏంటి గురూజీ, 'గుంటూరు కారం' కూడా కాపీయేనా?
Guntur Kaaram: మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమా కథ ఓ నవల నుంచి కాపీ కొట్టారనే వార్తలు వినిపిస్తున్నాయి.
Guntur Kaaram Movie: సంక్రాంతి కానుకగా టాలీవుడ్ లో విడుదల అవుతున్న పెద్ద సినిమాల్లో ‘గుంటూరు కారం’ ఒకటి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్ బాబు కెరీర్ లో 28వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానులలో భారీగా అంచనాలు ఉన్నాయి. త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబోలో వస్తున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.
‘గుంటూరు కారం’ మూవీపై కాపీ ఆరోపణలు
తాజాగా ఈ మూవీ గురించి ఇండస్ట్రీలో ఓ సంచలన విషయం వైరల్ అవుతోంది. ఈ సినిమా కథను ఓ నవల నుంచి కాపీ కొట్టినట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. యద్దనపూడి సులోచనా రాణి నవలల్లో మళ్లీ ఒకదాన్ని ఎత్తేసినట్లు తెలుస్తోంది. ఆమె రచించిన 'కీర్తి కిరీటాలు' నవల నుంచి 'గుంటూరు కారం' కథను కాపీ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఊహాగానాలు నిజం అయితే, సులోచనా రాణికి తగిన క్రెడిట్ ఇచ్చారా? ప్రచురణ కర్తల నుంచి హక్కులను తీసుకున్నారా? అనేది తెలియాల్సి ఉంది.
త్రివిక్రమ్ సినిమాలు అన్నింటి మీదా అవే ఆరోపణలు
వాస్తవానికి త్రివిక్రమ్ తెరకెక్కించిన చాలా సినిమాల కథలు ఆయా నవలల నుంచి కాపీ చేసినవే అనే ఆరోపణులు ఉన్నాయి. యద్దనపూడి సులోచనా రాణి నవల ఆధారంగా తెరకెక్కిన విజయనిర్మల 'మీనా' చిత్ర కథను త్రివిక్రమ్ ‘అ ఆ’ కోసం కాపీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. రచయితకు, సినిమా నిర్మాతకు క్రెడిట్ ఇవ్వకుండా ఈ సినిమాను తెరకెక్కించారు. ఆ తర్వాత సులోచనా రాణి కేసు పెట్టడంతో, సైలెంట్ గా మ్యాటర్ సెటిల్ చేసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా పైనా కాపీ ఆరోపణలు వచ్చాయి. ఈ సినిమా కథను ‘ఇంటి దొంగ’ అనే సినిమా నుంచి కాపీ కొట్టినట్లు విమర్శలు వచ్చాయి. ఆ మూవీ కథను లైన్ ను బేస్ చేసుకుని అల్లు అర్జున్ కు అనుకూలంగా మార్చి తీశారు. ఈ సినిమా మంచి హిట్ అందుకున్నా, ఆయన మీద విమర్శలు వెల్లువెత్తాయి. ‘గుంటూరు కారం’ విషయంలోనూ మరోసారి కాపీ విమర్శలు రావడంతో, ప్రతి సినిమా కథ కాపీయేనా గురూజీ అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఈ ఆరోపణలు ఎంత వరకు నిజమో తెలియాలంటే సినిమా విడుదలయ్యేంత వరకు ఆగాల్సిందే.
సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల
మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మహేష్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, జగపతిబాబు, వెన్నెల కిషోర్ ఈశ్వరీ రావ్, రఘుబాబు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2024 జనవరి 12 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Also: ఆమాట విని తారక్ సీరియస్ అయ్యారు, రామ్ చరణ్ బ్రేక్ తీసుకుందాం అన్నారు - రాజీవ్ కనకాల