Venu Swamy: ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వేణు స్వామి... మహిళా కమిషన్‌లో ఫిర్యాదు వల్లనే జర్నలిస్టులపై ఆరోపణలా?
ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఒక జర్నలిస్ట్ టార్గెట్ చేశారని, తన నుంచి భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపణలు చేశారు.
ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి (Venu Swamy) సరికొత్త డ్రామాకు తెర తీశారా? తన మీద కంప్లైంట్స్ చేసిన జర్నలిస్టులను ఆయన టార్గెట్ చేశారా? తనపై ఎవరు వ్యతిరేక వార్తలు గానీ, కథనాలు గానీ ప్రసారం చేయకూడదని... చేయకుండా ఉండాలని వేణు స్వామి ప్రయత్నిస్తున్నారా? లేదంటే నిజంగా ఆయన మీద జర్నలిస్టులు కత్తి కట్టారా? సోషల్ మీడియాలో సోమవారం భార్యతో కలిసి ఆయన చేసిన వీడియో పోస్ట్ సరికొత్త అనుమానాలకు, సందేహాలకు దారి తీసేలా ఉంది.
ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నా!
ఎంతో మంది జీవితాల నుంచి కష్టాలను తొలగించిన తాను మానసిక ధైర్యం కోల్పోయానని, ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని ఈ రోజు విడుదల చేసిన వీడియోలో వేణు స్వామి పేర్కొన్నారు. తనకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఒక ప్రముఖ జర్నలిస్ట్ అని ఆయన ఆరోపణలు చేశారు.
Venus Swamy sensational comments: తన మీద 2017వ సంవత్సరం నుంచి ప్రముఖ జర్నలిస్ట్ దాడి చేస్తున్నారని వేణు స్వామి ఆరోపించారు. ఎనిమిది నెలలుగా మళ్లీ ఆ దాడి మొదలు అయ్యిందని, తన నుంచి భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశారని ఆయన చెబుతున్నారు. వేణు స్వామి నుంచి సదరు జర్నలిస్ట్ టీం 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లుగా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్న ఆడియో క్లిప్ సైతం వేణు స్వామి పోస్ట్ చేశారు. వారం రోజుల నుంచి తమకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారని వేణు స్వామి భార్య వీణ సైతం ఆరోపణలు చేశారు.
సదరు జర్నలిస్ట్ మీద ఆరోపణలు ఎందుకు?
అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ నిశ్చితార్థం జరిగిన తర్వాత వాళ్ళిద్దరూ ఎక్కువ రోజులు కలిసి ఉండరని, జాతకాల ప్రకారం విడిపోతారని వేణు స్వామి జ్యోతిషం చెప్పారు. శుభమా అని ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండాలని పెళ్లికి సిద్ధమైతే... ఏడు అడుగులు కూడా వేయక ముందే విడిపోతారని ఆయన చెప్పడం పట్ల ప్రజల సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ, ఏపీ ఎన్నికలలో వేణు స్వామి చెప్పిన జ్యోతిష్యం తప్పు అని రుజువైంది. దాంతో తాను ఇకపై జాతకాలు చెప్పను అని వేణు స్వామి స్వయంగా ఓ వీడియో విడుదల చేశారు. అయితే... నాగ చైతన్య వ్యక్తిగత జీవితం మీద మళ్లీ జ్యోతిష్యం చెప్పడం పట్ల సామాన్య ప్రేక్షకులు సైతం విమర్శలు చేశారు. గతంలో నాగ చైతన్య, సమంత విడిపోతారని తాను చెప్పినది నిజమైందని... దానికి కంటిన్యూయేషన్ ప్రజెంట్ చెప్పానని వివరణలు ఇచ్చారు వేణు స్వామి.
నాగచైతన్య వ్యక్తిగత జీవితం మీద వేణు స్వామి జ్యోతిష్యం చెప్పిన తర్వాత ప్రముఖ టీవీ ఛానల్ డిబేట్ నిర్వహించింది. అందులో సదరు జర్నలిస్ట్ వేణు స్వామి బండారం బయట పెట్టారు. తనకు అనుకూలంగా ప్రచారం నిర్వహించాలని కొంతమంది యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులతో ప్రముఖ హోటల్ లో పార్టీ ఇచ్చిన విషయాలను సైతం బట్టబయలు చేశారు. బిగ్ బాస్ రియాలిటీ షోలోకి వెళ్లాలని వేణు స్వామి చేస్తున్న ప్రయత్నాలను సైతం ప్రజలకు వివరించారు. దాంతో ఆయనను టార్గెట్ చేస్తూ వేణు స్వామి ఈ వీడియో విడుదల చేసినట్లు అర్థమవుతోంది.
View this post on Instagram
Also Read: ఒకే వేదికపైకి అల్లు అర్జున్ - సుకుమార్... మారుతి నగర్ ఈవెంట్‌లో 'పుష్ప 2' పుకార్లకు చెక్!?
వేణు స్వామి వ్యవహార శైలిని జర్నలిస్టు సంఘం తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ దృష్టికి తీసుకు వెళ్లారు. ఆయన మీద చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ ఫిర్యాదు స్వీకరించిన మహిళా కమిషన్ వేణు స్వామికి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జర్నలిస్ట్ సంఘం పెద్దలపై కూడా వేణు స్వామి, అతని బృందం ఆరోపణలు చేసింది. ఎవరి జీవితం గురించి అయినా సరే వ్యాఖ్యానించే హక్కు, జ్యోతిష్యం చెప్పే హక్కు తనకు ఉన్నాయి కానీ... తన గురించి ఎటువంటి డిబేట్లు పెట్టకూడదని వేణు స్వామి కోరుకుంటున్నట్లు ఉంది ఆయన వ్యవహార శైలి చూస్తే అని సామాన్యులు కామెంట్ చేస్తున్నారు. వేణు స్వామి విడుదల చేసిన వీడియో కింద సదరు జర్నలిస్టుకు మద్దతుగా పలువురు వ్యాఖ్యలు చేస్తున్నారు.