KCR Targets NTR? : ఎన్టీఆర్‌ను టార్గెట్ చేసిన కేసీఆర్? - దెబ్బకు రెండున్నర కోట్ల నష్టం
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టార్గెట్ చేశారా? ఆ ప్రభావం 'బ్రహ్మాస్త్ర' ప్రీ రిలీజ్ ఈవెంట్ మీద పడిందా? ఇటు సినిమా ఇండస్ట్రీలో, అటు ప్రేక్షకుల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR Jr) ను తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు టార్గెట్ చేశారా (Telangana CM KCR Targets NTR)? అందువల్ల, రామోజీ ఫిల్మ్ సిటీలో జరగాల్సిన 'బ్రహ్మాస్త్ర' (Brahmastra Pre Release Event) కు పోలీస్ శాఖ నుంచి అనుమతులు రాలేదా? పైకి వినాయక చవితి మండపాలు, ఇతర పనుల్లో పోలీసులు బిజీగా ఉన్నారని చెబుతున్నా... అసలు కారణాలు వేరే ఉన్నాయా? ఇప్పుడు ఇటు సినిమా ఇండస్ట్రీలోనూ, అటు సాధారణ ప్రేక్షకులలోనూ హాట్ టాపిక్ ఇది.
ఎన్టీఆర్ మీద కేసీఆర్‌కు కోపం ఎందుకు?
ఇటీవల కేంద్ర మంత్రి, భారతీయ జనతా పార్టీ అగ్ర నేతల్లో ఒకరైన అమిత్ షా తెలంగాణ వచ్చారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం పూర్తి చేసుకున్నాక... భాగ్య నగరంలో ఎన్టీఆర్‌ను కలిశారు. పైకి, మర్యాదపూర్వక భేటీ... 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో కొమురం భీమ్‌గా అద్భుతమైన అభినయం కనబరచడంతో ప్రశంసించడానికి కలిశారని చెబుతున్నా... వాళ్ళిద్దరి మధ్య రాజకీయాల గురించి చర్చ జరిగిందని బలమైన ప్రచారం జరుగుతోంది. 'రజాకార్ ఫైల్స్'లో నటించమని ఎన్టీఆర్ ముందు అమిత్ షా ఒక ప్రతిపాదన తీసుకొచ్చారట. ఆ సంగతులు పక్కన పెడితే...
ఇప్పుడు బీజేపీ అంటే కేసీఆర్ మండి పడుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వానికి, తెలంగాణ ముఖ్యమంత్రికి అసలు పడటం లేదు. ఈ నేపథ్యంలో బీజేపీ పెద్దలను ఎన్టీఆర్ కలవడం కేసీఆర్‌కు నచ్చలేదట. అందుకే, 'బ్రహ్మాస్త్ర' ఈవెంట్‌కు చివరి నిమిషంలో నిబంధలు చూపించి అనుమతులు నిరాకరించారని ఎన్టీఆర్ అభిమానులు, పరిశ్రమలో కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈవెంట్‌కు ఏర్పాట్లు చేసిన శ్రేయాస్ మీడియా సంస్థ ఏమంటోంది?
'బ్రహ్మాస్త్ర' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చివరి నిమిషంలో పోలీస్ శాఖ అనుమతులు కోరుతూ శ్రేయాస్ మీడియా సంస్థ దరఖాస్తు చేసిందని ప్రచారం జరుగుతోంది. దాన్ని శ్రేయాస్ మీడియా సంస్థ ఖండించింది. గత నెల... ఆగస్టు 25వ తేదీన అనుమతి కోరుతూ అధ్యాశ్రీ ఇన్ఫోటైన్ మెంట్ (శ్రేయాస్ మీడియా) తరఫున రాచకొండ సీపీ ఆఫీసులోని ఈవెంట్స్ విభాగంలో దరఖాస్తు చేసినట్లు తెలిపింది. పోలీసులకు అందజేసిన లేఖను కూడా విడుదల చేసింది.
రెండు రోజుల క్రితం ఏర్పాట్లను పర్యవేక్షించిన స్థానిక సీఐ
రామోజీ ఫిల్మ్ సిటీలో నాలుగైదు రోజుల నుంచి 'బ్రహ్మాస్త్ర' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. అనుమతి ఇస్తామని పోలీసులు భరోసా ఇవ్వడంతో భారీ ఖర్చుతో ఈవెంట్ చేయడానికి ప్లాన్ చేశారు. రెండు రోజుల ఈవెంట్ చేయబోయే స్థలానికి స్థానిక సీఐ వచ్చారని, ఏర్పాట్లను పర్యవేక్షించారని శ్రేయాస్ మీడియా సంస్థ తెలియజేసింది. ఆయన సూచనలను దృష్టిలో పెట్టుకుని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. భారీగా బౌన్సర్లను తరలించారు.
'బ్రహ్మాస్త్ర' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కొన్ని గంటల ముందు పోలీసులు అనుమతి నిరాకరించడంతో శ్రేయాస్ మీడియాకు పెద్ద దెబ్బ తగిలింది. ఆల్రెడీ ముంబై నుంచి రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, కరణ్ జోహార్ వంటి ప్రముఖులు మాత్రమే కాదు, మీడియాను సైతం భారీ సంఖ్యలో తీసుకొచ్చారు. ఈవెంట్ క్యాన్సిల్ చేయలేక... వాళ్ళందరినీ పార్క్ హయత్ హోటల్‌కు తరలించి అక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
ఈవెంట్ క్యాన్సిల్ చేయడంతో రెండున్నర కోట్లు...
'బ్రహ్మాస్త్ర' ఈవెంట్ క్యాన్సిల్ చేయడంతో రెండున్నర కోట్ల నష్టం వాటిల్లిందట. ఆ ఈవెంట్‌లో 'తొడ కొట్టు చిన్నా' అని రణ్‌బీర్ అంటే... ఎన్టీఆర్ తొడ కొట్టడం, ఆ తర్వాత ఫైర్ వర్క్స్ రావడం వంటివి ప్లాన్ చేశారు. ఈవెంట్ క్యాన్సిల్ కావడంతో ఆ ప్రయత్నం అంతా వృథా అయ్యింది. కేవలం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈవెంట్ కోసం రెండు కోట్ల పాతిక లక్షలు ఖర్చు చేశారు. బందోబస్తు కోసం వచ్చే 800 మంది పోలీసులకు భోజన ఏర్పాట్లు చేశారు. అక్కడ క్యాన్సిల్ చేసి... పార్క్ హయత్‌కు రావడానికి మరో పది పదిహేను లక్షలు ఖర్చు అయ్యింది. మొత్తం మీద రెండున్నర కోట్లు నష్టం జరిగినట్లు తెలుస్తోంది.
Also Read : ప్రేక్షకులకు బంపర్ ఆఫర్ - ఆ రోజు టికెట్ రేట్ 75 రూపాయలే
హుందాగా స్పందించిన ఎన్టీఆర్!
'బ్రహ్మాస్త్ర' ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వివిధ రాష్ట్రాల నుంచి ఎన్టీఆర్ అభిమానులు తరలి వచ్చారు. వాళ్లందరికీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సారీ చెప్పారు. పోలీసులు మన భద్రత కోసం కోసం పని చేస్తారని, వాళ్ళ మాట వినడం దేశ పౌరుడిగా మన ప్రథమ ధర్మమని ఎన్టీఆర్ హుందాగా స్పందించారు. సెప్టెంబర్ 9న 'బ్రహ్మాస్త్ర థియేటర్లలో విడుదల కానుంది.