Paid TV: ఓటీటీలకే ఓటేస్తున్నారా? డీటీహెచ్, కేబుల్ టీవీలకు కాలం చెల్లిందా? ఈ లెక్కలు షాకిస్తాయి !
End of Cable TV: ఓటీటీ, కేబుల్ టీవీ లేని ఇళ్లను అసలు ఊహించలేం. అది ఒకప్పుడు. ఇప్పుడు ఏ కనెక్షన్ ఉండటం లేదు. ఓటీటీలు మాత్రమే ఉంటున్నారు.

40 million Indian homes quit paid TV: భారతదేశ వినోద రంగంలో ఒక భారీ మార్పు చోటుచేసుకుంటోంది. గత ఆరేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా సుమారు 4 కోట్ల ఇళ్లు పెయిడ్ టీవీ డైరెక్ట్-టు-హోమ్ - DTH లేదా కేబుల్ టీవీ కనెక్షన్లను వదులుకున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఒకప్పుడు ప్రతి ఇంట్లోనూ అంతర్భాగంగా ఉన్న కేబుల్ టీవీ వ్యవస్థ ఇప్పుడు క్రమంగా కనుమరుగవుతోంది.
ప్రతి ఇంట్లో రెండు, మూడు టీవీలు ఉంటున్నాయి. ప్రతి ఇంటికి కేబుల్ లేదా.. డీటీహెచ్ ఉండటం అనేది కామన్. అయితే ఇప్పుడు పూర్తిగా ప్రజల అభిరుచి మారిపోతోంది. డీటీహెచ్ లేదా కేబుల్ టీవీని రీచార్జ్ చేసుకోవడం దాదాపుగా మానేశారు. ఓటీటీలకే ఓటేస్తున్నారు. ఓటీటీలకు నెలవారీ చెల్లింపులు చేస్తున్నారు.
ఈ మార్పుకు ప్రధాన కారణం హై-స్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి రావడం OTT ప్లాట్‌ఫారమ్‌ల పెరుగుదల. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్ వంటి సేవలు తక్కువ ధరకే అపరిమితమైన కంటెంట్‌ను అందిస్తుండటంతో, పట్టణ ప్రాంతాల్లోని మధ్యతరగతి , ఎగువ మధ్యతరగతి ప్రజలు కార్డ్ కటింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. కేబుల్ టీవీలో వచ్చే యాడ్స్ వేధింపులు లేకపోవడం, నచ్చిన సమయంలో నచ్చిన షో చూసుకునే వెసులుబాటు ఉండటం ఓటీటీలకు ప్లస్ పాయింట్‌గా మారింది.
మరోవైపు, గ్రామీణ , తక్కువ ఆదాయం ఉన్న వర్గాల్లో ఫ్రీ డిష్ ప్రాచుర్యం పెరగడం కూడా పేయిడ్ టీవీ మార్కెట్‌పై ప్రభావం చూపింది. ఎలాంటి నెలవారీ రుసుము చెల్లించాల్సిన అవసరం లేని ఉచిత ఛానెళ్ల వైపు ప్రజలు మళ్లుతున్నారు. దీనివల్ల ప్రైవేట్ డీటీహెచ్ ఆపరేటర్లు భారీగా చందాదారులను కోల్పోతున్నారు. ట్రాయ్ నిబంధనల ప్రకారం ఛానెళ్ల ధరలు పెరగడం కూడా సామాన్యులకు భారం కావడంతో, వారు పెయిడ్ టీవీకి స్వస్తి పలుకుతున్నారు. స్మార్ట్ టీవీల అమ్మకాలు పెరగడం ఈ పరిణామాన్ని మరింత వేగవంతం చేసింది. ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న టీవీలన్నీ ఇంటర్నెట్ ఆధారితంగా పనిచేస్తుండటంతో, కేబుల్ వైర్ల అవసరం లేకుండానే నేరుగా యూట్యూబ్ లేదా ఇతర యాప్స్ ద్వారా వినోదాన్ని పొందుతున్నారు. దీనివల్ల సాంప్రదాయ టీవీ బ్రాడ్‌కాస్టర్లు తమ ఆదాయాన్ని కాపాడుకోవడానికి ఇప్పుడు ఓటీటీ వైపు తమ దృష్టిని మళ్లిస్తున్నారు.
భారతీయ వినోద రంగంలో ఒక శకం ముగిసి, డిజిటల్ విప్లవం పూర్తిస్థాయిలో రాజ్యమేలుతోంది. రాబోయే రోజుల్లో కేబుల్ టీవీ తన ఉనికిని చాటుకోవాలంటే భారీ మార్పులు లేదా ధరల తగ్గింపు తప్పనిసరి అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అయినా మనుగడ సాగించడం కష్టమేనని.. ఆయన వ్యాపార వర్గాలు కొత్త మార్గాలను అన్వేషించుకోవాలన్న అభిప్రాయం వినిపిస్తోంది.





















