(Source: Poll of Polls)
Dilip Kumar Bungalow: లెజెండరీ యాక్టర్ దిలీప్ కుమార్ ఐకానిక్ బంగ్లా కూల్చివేతకు నిర్ణయం! కారణం ఏంటో తెలుసా?
దివంగత బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ కు ఎంతో ఇష్టమైన బంగళాను కూల్చివేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. దాని స్థానంలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ తో పాటు మ్యూజియాన్ని ఏర్పాటు చేయబోతున్నారు.
బాలీవుడ్ లెజెండరీ సూపర్‌స్టార్ దిలీప్ కుమార్ కన్నుమూసి రెండు సంవత్సరాలు పూర్తయ్యింది. అనారోగ్యం సమస్యలతో బాధపడుతూ జూలై 7, 2021 నాడు చనిపోయారు. హిందీ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఆయన 98 ఏళ్ల వయసులో అస్తమించారు. బాలీవుడ్ ట్రాజెడీ కింగ్‌గా గౌరవించబడిన దిలీప్ కుమార్, ‘మొఘల్-ఎ-ఆజం’, ‘దేవదాస్’, ‘నయా దౌర్’, ‘గుంగా జుమ్నా’, ‘మషాల్’ లాంటి క్లాసిక్ చిత్రాలతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశారు. లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు.
దిలీప్ కుమార్ ఐకానిక్ బంగళా కూల్చివేత
దిలీప్ కుమార్ కుటుంబం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై పాలి హిల్స్ లోని ఆయనకు ఎంతో ఇష్టమైన బంగ్లాను కూల్చివేయాలని నిర్ణయించింది. దాని స్థానంలో అద్భుమైన రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ను నిర్మించాలని భావిస్తోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం దిలీప్ కుమార్ ఫ్యామిలీ మెంబర్స్ రియల్టీ డెవలపర్ అషార్ గ్రూప్ ను సంప్రదించారు. ఇప్పటికే ప్రాజెక్టుకు సంబంధించిన ప్లాన్ పూర్తి అయినట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2027 నాటికి ఈ నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఒకటిన్నర ఎకరాల్లో, 1.75 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ప్రతిష్టాత్మక నిర్మాణం చేపట్టనున్నారు. మొత్తం 11 అంతస్తులలో నిర్మాణం కానుంది. గ్రౌండ్ ఫ్లోర్ లో దిలీప్ కుమార్ కు సంబంధించిన మ్యూజియం ఏర్పాటు చేయనున్నారు. ఇందులో అతడి సినీ జీవితానికి సంబంధించి వివరాలతో పాటు సాధించిన విజయాలకు సంబంధించిన జ్ఞాపకాలను పొందుపర్చనున్నారు. ఈ కొత్త బంగ్లా ద్వారా సుమారు రూ.900 కోట్ల బిజినెస్ జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
న్యాయపరమైన వివాదాల్లో దిలీప్ కుమార్ బంగళా
వాస్తవానికి దిలీప్ కుమార్ కు సంబంధించిన ఈ బంగళా స్థలం కొన్నేళ్లుగా న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకుంది. ఈ జాగాపై కన్నేసిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ నకిలీ పత్రాలను సృష్టించి ఆస్తిని కొట్టేయాలని భావించింది. అయితే, సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత, ఆయన భార్య సైరాబాను 2017లో ఈ కేసును గెలిచింది. ఐకానిక్ బంగ్లా దిలీప్ కుమార్ కు సంబంధించినదేనని న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. ప్రస్తుతం ఈ ప్రదేశంలోనే ఆయన కుటుంబ సభ్యులు రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ను నిర్మించబోతున్నారు.
‘ట్రాజెడీ కింగ్’గా గుర్తింపు తెచ్చుకున్న దిలీప్ కుమార్
నటుడు దిలీప్ కుమార్ విషాదకరమైన ముగింపు ఉన్న పాత్రలను పోషించడంలో ప్రసిద్ధి చెందాడు. ‘మేళా’(1948), ‘అందాజ్’(1949), ‘దీదార్’(1951), ‘దేవదాస్’(1955), ‘యహుది’ (1958), ‘మధుమతి’(1958) లాంటి హిట్స్ అందుకున్న తర్వాత సినీ ప్రేమికులు దిలీప్ కుమార్‌ను ‘ట్రాజెడీ కింగ్’ అని పిలవడం ప్రారంభించారు. అతడి కెరీర్‌లోని ‘గంగా జమున’(1961), ‘రామ్ ఔర్ శ్యామ్’(1967), ‘క్రాంతి’(1981) లాంటి అద్భుత విజయాలు ఉన్నాయి. కానీ, దిలీప్ కుమార్‌ను హిందీ చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా నిలబెట్టిన చిత్రం 1960లో విడుదలైన మాగ్నమ్ ఓపస్ ‘మొఘల్-ఎ-ఆజం’. ఈ సినిమాలో నటించిన హీరోయిన్ మధుబాలతో దిలీప్ కుమార్ ఎఫైర్ కొనసాగించినట్లు అప్పట్లో ఊహాగానాలు కూడా వినిపించాయి.
Read Also: పూనమ్ కౌంటర్‌కు ఆర్జీవీ ఎన్‌కౌంటర్ - ఇద్దరిపై నిప్పులు చెరుగుతున్న పవన్ ఫ్యాన్స్!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial