Dhanush Speech: తెలుగు, తమిళ ప్రజలు ఎంత దగ్గరివారో తెలిసింది - ‘సార్’ ట్రైలర్ లాంచ్‌లో ధనుష్ ఏమన్నారంటే?
‘సార్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ధనుష్ మాట్లాడారు.
Dhanush Speech: ధనుష్ హీరోగా నటిస్తున్న ‘సార్’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ బుధవారం జరిగింది. హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో హీరో ధనుష్ సహా చిత్రబృందం మొత్తం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ధనుష్ మాట్లాడారు. తెలుగు, తమిళ ప్రజలకు మధ్య ఉన్న దగ్గరితనం అప్పుడే తెలిసిందన్నారు.
‘నాకు తెలుగు అంతగా తెలీదు. కొంచెం కొంచెం అర్థం అవుతుంది. కానీ పూర్తిగా తెలియదు. సాధారణంగా తెలుగు తెలియకపోతే ఇంగ్లిష్‌లో మాట్లాడతారు. కానీ పక్కనే ఉన్న రాష్ట్రం కాబట్టి తమిళంలో మాట్లాడుతున్నాను. మీకు తమిళం అర్థం అవుతుంది అనుకుంటున్నాను. ఇది నాకు చాలా స్పెషల్ డే. నా మొదటి డైరెక్ట్ తెలుగు సినిమా ఇదే. మీ అందర్నీ కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది.’
(తమిళంలో మాట్లాడుతూ)‘ఇంతకుముందు చూస్తే తమిళ సినిమా, తెలుగు సినిమా, మలయాళం సినిమా, కన్నడ సినిమా అని వేర్వేరుగా ఉండేవి. ఇప్పుడు అందరూ అన్ని సినిమాలూ చూస్తున్నారు. అంతా ఒకే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలా అయింది. అది చాలా మంచిది. ఇప్పుడు మీరందరూ తమిళ సినిమా చూస్తున్నారు. మేమంతా తెలుగు సినిమా చూస్తున్నాం. ఈ మార్పు చాలా బాగుంది. ఇప్పుడు నేను నటించిన తెలుగు సినిమా ప్రమోట్ చేయడానికి మీ ముందుకు వచ్చాను. నాకు చాలా సంతోషంగా ఉంది.’
‘ఈ సినిమా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ బోర్డర్‌లోని ఒక గ్రామంలో జరిగే కథ. రెండు సంస్కృతులు కలిసి ఉన్నాయి. రెండు భాషలూ కలిసి ఉన్నాయి. అది చూడటానికి చాలా అందంగా ఉంది. మనమంతా ఎంత పక్కపక్కనే ఉన్నామో అప్పుడు అర్థం అయింది. అది చాలా అద్భుతమైన విషయం. అలాంటి కథలో నటించినందుకు నాకు సంతోషంగా ఉంది.’ అన్నారు. ఆ తర్వాత ఆడియన్స్ అర్థం కావడం లేదనడంతో మళ్లీ ఇంగ్లిష్‌లో మాట్లాడారు.
‘నేను వెంకీ అట్లూరికి థ్యాంక్స్ చెప్పాలి. వంశీ, త్రివిక్రమ్, యువరాజ్ (డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ), సంయుక్త అందరికీ చాలా థ్యాంక్స్. హైపర్ ఆదికి ఇంత మంది ఫ్యాన్స్ ఉన్నారని నాకు తెలీదు. అతను చాలా అద్భుతంగా మాట్లాడాడు. అందరి తరఫున తనే మాట్లాడాడు. ఆ తర్వాత మాట్లాడటానికి కూడా పెద్దగా ఏమీ లేదు. అందరికీ చాలా థ్యాంక్స్.’ అంటూ ముగించాడు. ఆ తర్వాత చివర్లో ‘రఘువరన్ బీటెక్’ సినిమాలోని అమూల్ బేబీ డైలాగ్ చెప్పారు. ‘సార్’ సినిమాలో పెద్ద హిట్ అయిన మాస్టారు పాటను తెలుగు, తమిళ భాషల్లో పాడి అభిమానులను అలరించారు.
ఈ సినిమాలో ధనుష్ సరసన సంయుక్త మీనన్ జంటగా నటించింది. 'భీమ్లా నాయక్', నందమూరి కళ్యాణ్ రామ్ 'బింబిసార' తర్వాత ఆమె నటిస్తున్న తెలుగు చిత్రమిది. ‘తొలి ప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’, ‘రంగ్ దే’ సినిమాల దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాను తెరకెక్కించారు.
ఫిబ్రవరి 17వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. జాతీయ అవార్డు అందుకున్న జీవీ ప్రకాష్ కుమార్ పాటలు అందించారు. ఈ సినిమా తమిళ వెర్షన్ ఆడియో లాంచ్ ఇటీవలే తమిళనాడులో గ్రాండ్‌గా జరిగింది.