Devatha September 3rd Update: రాధని ఇబ్బంది పెడుతుంది నువ్వేనా అని మాధవ్ ని అడిగేసిన జానకి- దేవికి మాధవ్ ని దూరంగా ఉంచాలని నిర్ణయించుకున్న రుక్మిణి
ఆదిత్యకి దేవిని శాశ్వతంగా దూరం చెయ్యడానికి మాధవ్ మరో కుట్రకి తెర తీశాడు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
దేవికి ఆదిత్యే తన తండ్రి అనే విషయం చెప్పాలని అనుకుంటున్నావ్ కదా నేను ఉండగా అది జరగనివ్వను అని మాధవ్ రాధతో చెప్తాడు. నువ్వు అనుకోవడం కాదు సారు ఆ దేవుడు అనుకోవాలి, నువ్వు ఇట్లా ఎన్ని రోజులు నా బిడ్డ, నా పెనిమిటి కలవకుండా చూస్తావో నేను చూస్తా అని రాధ కోపంగా చెప్పి వెళ్ళిపోతుంది. ఆదిత్య దేవి కోసం స్కూల్ దగ్గరకి వచ్చి తన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. దేవి ఆదిత్యని చూసి సంతోషంగా వెళ్ళి కౌగలించుకుంటుంది. బుజ్జి పాపతో ఆడుకోవాలని ఉందని దేవి, చిన్మయి అనేసరికి తీసుకెళ్తాను అని చెప్తాడు.
బిడ్డ నాయన కావాలని అడుగుతుంటే అలా చూస్తూ ఉంటావెంటీ.. పటేల్ మీ నాయన అని చెప్పడానికి ఏమైంది ఎందుకు ఆలోచిస్తావ్, ఎన్ని దినాలు ఈ ఇంట్లో పడి బాధలు పడతావ్. నీతో కాకపోతే చెప్పు నేను బిడ్డని కూర్చోబెట్టి జరిగింది అంతా చెప్తాను అని భాగ్యమ్మ అంటుంది. ‘నువ్వు చెప్తావ్ అమ్మా కానీ తర్వాత మనం నాయన్ని వదిలి ఇక్కడ ఎందుకు ఉంటున్నాం అని అడుగుతుంది నేను ఏం చెప్పాలి, కండ్ల ముందే దేవి వేరే వాళ్ళని నాయన అని పిలుస్తా ఉంటే పానం పోతుంది. రోజు కళ్ల ముందే మా నాయన కనిపిస్తుంటే ఈయనే మీ నాయన అని నాకు ఎందుకు చెప్పలేదంటే నేనెమని చెప్పాలి. చిన్మయి వచ్చి నువ్వు మా అమ్మవి కాదా నన్ను విడిచి పెట్టి పోతావ అంటే నేను ఏం చెప్పాలి. ఇక్కడ నుంచి వెళ్లాలంటే చాలా ఆలోచించాలి. సత్య గురించి కూడా ఆలోచించాలి. నేను బతికే ఉన్నా అని తెలిస్తే అత్తమ్మ తీసుకెళ్తుంది కానీ సత్య బతుకు ఏమవాలి. నా బిడ్డకి నిజం చెప్పి నా చెల్లిని చంపుకోవాలా’ అని రుక్మిణి ఎమోషనల్ అవుతుంది.
‘నువ్వు నీ బిడ్డ కష్టం గురించి ఆలోచిస్తున్నావ్ కానీ నేను నా బిడ్డ, పెనిమిటి, సత్య, అత్తింటి గురించి ఆలోచిస్తున్నా, దేవమ్మ అర్థం చేసుకునేదాక నేను ఏమి చెయ్యలేను ఇలా ఏడుస్తూ కూర్చోవడమే అని రుక్మిణి బాధపడుతుంది. నిన్ను ఆదిత్యని ఆడుకోవడానికి నాకు ఉన్న ఒకే ఒక్క ఆయుధం దేవి. ఈసారి నిన్ను ఆడుకోవడానికి నేను ప్లాన్ వేశాను దాంతో నీకు ఊపిరి కూడా ఆడదు. చూస్తా ఉండు అలాంటి ప్లాన్ వేశాను అని మాధవ్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. రాధ పిల్లలకి అన్నం తీసుకుని స్కూల్ కి వెళ్తుంది. మాధవ్ సారు నా బిడ్డ మనసు పాడు చేస్తున్నాడు అందుకే ఇక నుంచి స్కూల్ దగ్గర పిల్లల్ని దింపడానికి అన్నం పెట్టడానికి తనే రావాలని మనసులో అనుకుంటుంది.
మాధవ్ ఇంట్లో రాధ కోసం వెతుకుతూ ఉంటే జానకి వచ్చి ఎవరి కోసం వెతుకుతున్నావ్ అని అడుగుతుంది. రాధ స్కూల్ కి పిల్లలకి బాక్స్ తీసుకుని వెళ్ళిందని చెప్తుంది. 'నీ ప్రవర్తన అదోలా ఉంటుంది, మొన్న దేవిని ఎక్కడికో తీసుకెళ్లావ్. నిన్ను చూస్తే ఇలా అంటున్నావ్, రాధ కూడా ఏదో విషయంలో నువ్వు ఇబ్బంది పడుతుంది ఏంటి అని అడిగితే చెప్పడం లేదు, నువ్వు కానీ రాధని ఏమి అనలేదు కదా’ జానకి అడిగేస్తుంది. నువ్వు నా గురించి నాన్న గురించి మాత్రమే ఆలోచించు రాధ గురించి కాదని మాధవ్ అంటాడు. అదేంటి అలా అంటావ్ ఇంట్లో అమ్మాయి అలా బాధపడుతుంటే పట్టించుకోకుండా ఎలా ఉండమంటావ్ అని జానకి కోపంగా అడుగుతుంది. వదిలేయ్ నీకు సంబంధం లేని విషయాలు రాధ గురించి ఆలోచించడం మానేయ్ ఇంట్లో పనులు మాత్రమే చూసుకో అనేసి కోపంగా వెళ్ళిపోతాడు. ఆ మాటకు జానకి బిత్తరపోతుంది.
Also Read: యష్, వేదని విడదీసేందుకు అభిమన్యు కుట్ర - ఆదిత్యని ఖుషి స్కూల్ లో చేరాడని తెలిసి భయపడుతున్న మాలిని
నేను ఏమన్నా అని ఇంత కోపంగా మాట్లాడుతున్నాడు రాధే అనుకుంటే వీడి ప్రవర్తనలో కూడా మార్పు వచ్చిందని ఆలోచిస్తుంది. మాధవ్ పద్ధతి ఏం బాగోలేదని రామూర్తితో అంటుంది. ఎప్పుడు బయట బయటే తిరుగుతున్నాడు,ఎప్పుడు లేనిది ఈరోజు నన్ను కసురుకున్నాడు, నేను అడిగితే సమాధానం చెప్పడం లేదు మీరైన కాస్త గట్టిగా అడగండి అని చెప్తుంది. వాడేమన్న చిన్న పిల్లాడా ఆడగటానికి ఏముంటుందని అంటాడు. రాధని అడుగుదామంటే ఇంట్లో నుంచి ఎక్కడ వెళ్లిపోతుందో అని భయం ఇక నేనేమీ మాట్లాడతాను అని రామూర్తి అంటాడు. వల్ల గురించి ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు అని సలహా ఇస్తాడు. మొత్తానికి ఏదో జరుగుతుంది, అది ఏంటి అనేది తెలియడం లేదని ఆలోచనలో పడుతుంది జానకి.