Devatha July 25th Update: మా నాయన దుర్మార్గుడని ఆదిత్యకి చెప్పిన దేవి- నీకోసమే ఇదంతా చేశానంటూ మాధవ పైశాచికత్వం
రుక్మిణి తనదగ్గర నుంచి వెళ్ళకుండా చేసేందుకు మాధవ దేవి మనసులో తన కన్నతండ్రి గురించి కథ అల్లి విషాన్ని నింపుతాడు. దీంతో కథనం ఉత్కంఠగా మారింది. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
దేవి కోసం ఆదిత్య స్కూల్ దగ్గరకి వస్తాడు. ఆదిత్యని చూసిన దేవి, చిన్మయి సంతోషంగా పరిగెత్తుకుంటూ వస్తారు. దేవి డల్ గా ఉండటం చూసి ఏమైందని అడుగుతాడు. ఏం లేదు సారు అని చెప్పి దేవి బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మళ్ళీ వెనక్కి దేవి ఒక్కతే వస్తుంది. నువ్వు పెద్ద ఆఫీసర్ వి కదా నీకు పోలీసులంతా తెలుసు కదా నాకొక సాయం కావాలి అని ఆదిత్యని దేవి అడుగుతుంది. ఏం కావాలమ్మా అని ప్రేమగా అడుగుతాడు. నాకు మా నాయన్ని పట్టిస్తావా అని అడుగుతుంది. అది విని మొదట షాక్ అయినా తర్వాత సంతోషంగా మీ నాయన గురించి మీ అమ్మ చెప్పిందా అని ఆత్రంగా అడుగుతాడు. మాయమ్మ చెప్పలే నాకే తెలిసింది.. ఇప్పుడు ఉన్న నాయన మా నాయన కాదు ఇంకొకరు ఉన్నారు. ఆ నాయన్ని పట్టిస్తావా. ఎక్కడ ఉన్నాడో వెతికిస్తావా అని అడుగుతుంది. అసలు నాన్న ఉన్నాడు అని చెప్పిన వాడు ఆ నాన్న ఎవరో చెప్పలేదా ఆ నాన్నని నేనే అని ఆదిత్య అనబోతుంటే దేవి ఆయన ఎవరో చెప్పి ఉంటే సీదా తీసుకుపోయి పోలీసులకి పట్టించేదాన్ని అనడంతో ఆదిత్య షాక్ అవుతాడు. అదంతా చాటుగా భాగ్యమ్మ వింటూ ఉంటుంది.
ఆదిత్య: ఎందుకమ్మా మీ నాన్న అంతా తప్పు ఏం చేశాడు.
దేవి: మా నాయన చాలా దుర్మార్గుడు సారు.. మాయమ్మని మస్త్ కష్టపెట్టినడు. మాయమ్మ కడుపుతో ఉన్నప్పుడు తాగొచ్చి తిట్టి కొట్టినడు. పాపం మాయమ్మ చచ్చిపోదామని చూస్తుంటే ఈ నాయనే కాపాడి తీసుకొచ్చాడంట.. మా నాయన చేసిన పనికి చచ్చిపోకుండా నన్ను మాయమ్మని ఇప్పుడు ఉన్న ఈ నాయనే కాపాడంట. ఎంత మంచోడో కదూ. మాయమ్మని ఇంత సతాయించినవాడిని విడిచిపెట్టవచ్చా, అందుకే నువ్వు పోలీసులకి చెప్పి ఎక్కడ ఉన్నా జైల్లో వేయించాలి. నువ్వు నాకు ఈ సాయం చెయ్యాలని అంటుంది.
ఆదిత్య: మీ నాన్న అలాంటి వాడని నీకు ఎవరు చెప్పారమ్మ అని బాధగా అడుగుతాడు.
దేవి: పాపం చెప్పలేక చెప్పలేక ఇప్పుడు ఉన్న నాయనే చెప్పాడు.
ఆ మాటలు విని ఆదిత్య, భాగ్యమ్మ ఆగ్రహంతో ఊగిపోతారు. స్కూల్ బెల్ మోగేసరికి ఇక దేవి వెళ్తూ ఎలాగైనా మా నాన్నని పట్టి ఇవ్వాలి, జైల్లో వేయించాలి అని అడుగుతుంది. 'నేను దేవి మీద వేసిన మంత్రం బాగా పని చేసింది. వాళ్ళ నాన్న ఆఫీసరే అని తెలియక దేవి వాళ్ళ నాన్న మీద బాగా ద్వేషం పెంచుకుంది. అటు ద్వేషం పెరిగే కొద్ది ఇటు నా మీద ప్రేమ పెరుగుతూనే ఉంటుంది. నాకు కావలసింది ఆదేగా. నా రాధ ఈ ఇంటి గడప దాటకూడదు. ఆ ఇంటి గడప తొక్కకుండ అవకాశం ఉండకూడడంటే నేను ఇంతకన్నా ఏం చెయ్యగలను. రాధ ఇదంతా నీ మీద ఉన్న ప్రేమతోనే చేస్తున్నా. ఇది నీకు అర్థం కావడం లేదు. నువ్వు ఇప్పటికీ నన్ను తప్పుగా అనుకున్నా ఎప్పటికీ నా కోట దాటి పోలేవు.. నువ్వు పోవాలి అన్నా నువ్వు పంపించాలి అనుకున్న నీ కూతురే పోనివ్వదు' అని మాధవ తన మనసులోని కుట్రను బయటపెడతాడు. భాగ్యమ్మ కోపంగా రుక్మిణి ఇంటికి వస్తుంది. అది చూసి ఏమైంది అమ్మ ఇంత కోపంగా వస్తుందని అనుకుని తనని ఆపుతుంది. ఆగు బిడ్డ.. గీ పొద్దు ఆ మాధవ అంటూ తేల్చాలంటూ ఆగ్రహంతో ఊగిపోతుంటే రుక్మిణి ఆపి పక్కకి తీసుకెళ్తుంది. నువ్వు ఎక్కడికి వచ్చి ఏం చేస్తున్నావో అర్థం అవుతుందా అసలు ఏమైంది ఏమి చెప్పకుండా ఎందుకు ఇలా అంటున్నవాని రుక్మిణి అడుగుతుంది. అసలు ఆ మాధవ ఏం చేస్తున్నాడో నీకు ఎరుకనా దేవమ్మ స్కూల్ దగ్గర పటేల్ తో ఏం మాట్లాడిందో నువ్వు వింటే వాడిని నరుకుతావ్ అని అంటుంది. ఇక్కడ జరిగిందంతా భాగ్యమ్మ రుక్మిణికి చెప్తుంది.
Also Read: ఆదిత్యపై సత్య అనుమానం, రుక్మిణి దగ్గరకి వచ్చి ఆరా- మాధవని వదిలిపెట్టేదె లేదంటున్న ఆదిత్య
దేవమ్మ ఎందుకు ఇలా చేసింది. పెనిమిటికి ఎందుకు ఇలా చెప్పింది. ఇది చెప్పలేక పెనిమిటి ఫోన్ తియ్యలేదు. ఇప్పుడు పెనిమిటికి ఏం చెప్పాలనై రుక్మిణి మనసులోనే భయపడుతుంది. అప్పుడే ఆ మాధవ సారు అంటూ చూస్తానంటే వద్దన్నావ్, ఇప్పుడు ఏం చేస్తావ్, నీ బిడ్డ ని నీ పెనిమిటి దగ్గరకి ఎలా చేరుస్తావని భాగ్యమ్మ అడుగుతుంది. ఇక రుక్మిణి అదిత్యకి ఫోన్ చేస్తుంది కానీ లిఫ్ట్ చేయ్యడు. ఇదంతా ఆ మాధవ సారు వల్లే ఈరోజు ఆయన చేసిన పనికి నా పెనిమిటి అల్లాడిపోతున్నాడు, పెనిమిటి ఫోన్ తియ్యడం లేదు ఈ సారు ఇంట్లో లేడు అని టెన్షన్ పడుతుంది. తర్వాత ఆదిత్య ఫోన్ లిఫ్ట్ చేసి నాకు అంతా తెలిసింది అక్కడికే వచ్చి మాట్లాడతాను అని కోపంగా చెప్తాడు. ఇక ఆదిత్య, రుక్మిణిని కలుస్తాడు.
ఆదిత్య: దేవికి ఆరోజు నేనే నాన్నని అని నిజం చెప్తానంటే చాలా సంతోషించాను. నా కూతురు నాదగ్గరకి రాబోతుందని ఎంత సంతోషించాను.
రుక్మిణి: అవును పెనిమిటి నేను దేవిని నీ దగ్గరకి చేరుద్దామని ఎంతో ఆశపడ్డాను.
ఆదిత్య: నువ్వు ఆశపడటమే చేశావ్ కానీ ఆ మాధవ చూడు నా బిడ్డ దగ్గరే నన్ను దుర్మార్గుడిని చేశాడు. నా కూతురే నా దగ్గరకి వచ్చి మా నాయనకి శిక్ష పడాలి అని చెప్తే నాకు ఎలా ఉంటుంది. నువ్వు ఉన్నావు నీ మాట కాదని నేను ఎలాంటి నిర్ణయం తీసుకుంటే మధ్యలో నువ్వు ఇబ్బంది పడతావని తెలిసి నేను ఊరుకున్నాను. నా బిడ్డ మరొకరిని నాన్న అంటున్న సహించను అది నేను చేసిన తప్పా. నాన్న అంటూ నా దగ్గరకి వస్తుందని ఎదురు చూస్తుంటే మా నాన్న దుర్మార్గుడు, రాక్షసుడు ఆఫీసర్వి కాబట్టి తనని పట్టిస్తావా, కొట్టిస్తావా, తిట్టిస్తావా అంటుంటే నేను ఏమి మాట్లాడలేక మౌనంగా చూస్తున్నాను.
రుక్మిణి: పెనిమిటి నీ బాధ నాకు అర్థం అవుతుంది
ఆదిత్య: ఏం అర్థం అవుతుంది రుక్మిణి అదే అర్థం అయితే మాధవ ఇలా చేశాడని ఆ రోజే నాకు చెప్పేదానివి. నువ్వు నాకే విషయం చెప్పకుండా ఏడ్చుకుంటూ వెళ్లిపోయావ్. ఇంట్లో నువ్వు ఎలా ఉన్నావో అని నేను టెన్షన్ పడ్డాను, అదే ఆ రోజే నువ్వు చెప్పి ఉంటే ఆ మాధవగాడిని..
రుక్మిణి: నువ్వు ఇలా చేస్తావనే నేను చెప్పలేదు. అప్పుడు లొల్లి అయితది.. దేవమ్మకి ఏం అర్థం కాక ఆ సారు చెప్పిందే నిజమని అనుకుని నీకు తను ఇంకా దూరం అవతది. అందుకే నీకు ఏం చెప్పలేదు.
ఆదిత్య: నా కూతురుకి నేనే నాన్న అని తెలియక నన్నే తిడుతుంది. తన మనసులో నేను ఒక దుర్మార్గుడిని అని ముద్ర పడ్డాక నేనేం చెయ్యాలి. నేను దుర్మార్గుడిని కాదని నిరూపించుకోవడానికి నేనేం చెయ్యాలి. ఇప్పటి వరకు ఎదురు చూసింది చాలు. ఈరోజు ఆ మాధవగాడో నేనో తేల్చుకుంటాను అని చెప్పి రుక్మిణి ఆగమని పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళతాడు.