Darshan: కన్నడ దర్శన్‌కు కోర్టులో ఎదురు దెబ్బ - అలాంటివి జైల్లో కుదరవంటూ షాకిచ్చిన న్యాయస్థానం
అభిమాని రేణుకాస్వామి హత్యకేసులో జైలు జీవితం గడుపుతున్న నటుడు దర్శన్ విషయంలో న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన ఇంటి భోజనం కాకుండా, జైలు భోజనమే పెట్టాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
Court Denies Darshan’s Request For Home Food: తన అభిమాని చిత్రదుర్గ రేణుకాస్వామి హత్యకేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ జైలు జీవితాన్ని గడుపుతున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆయనను న్యాయస్థానం ఆదేశాల మేరకు పోలీసులు పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. ఆయనకు జైలులో సాధారణ ఖైదీ మాదిరిగానే అధికారులు ట్రీట్ చేస్తున్నారు. ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించలేదు. జైలు భోజనమే పెడుతున్నారు. ఈ నేపథ్యంలో దర్శన్ తనకు కొన్ని వసతులు కల్పించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఇంటి భోజనం, పరుపు, దుస్తులు ఇవ్వాలని కోరుతూ దర్శన్ పిటీషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ పిటీషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది.
హత్య కేసు నిందితులకు ప్రత్యేక వసతులు ఉండవన్న న్యాయస్థానం
జైలు భోజనంతో అజీర్ణం కలగడంతో పాటు, డయేరియా సోకిందని దర్శన్ కోర్టుకు వెల్లడించారు. జైల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 5 కేజీల వరకు బరువు తగ్గానని చెప్పారు. ఇంటి భోజనానికి అనుమతి ఇవ్వాలంటూ ఆయన తరపు న్యాయవాదులు న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను తాజాగా విచారించిన కోర్టు.. హత్యకేసులో అరెస్టు అయిన వారికి ఇంటి భోజనంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించే అవకాశం లేదన్నారు.
జైలు రూల్స్ ప్రకారం అక్కడి భోజనం తినాల్సిందేనని తేల్చి చెప్పారు. అటు జైలు భోజనం కారణంగానే దర్శన్ కు డయేరియా సోకిందనే విషయాన్ని వైద్యులు ఎక్కడా చెప్పలేదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెల్లడించారు. షూటింగ్ వేళ ఆయన గాయం అయ్యిందని, అందుకే పరుపు ఇవ్వాలని కోరారని వెల్లడించారు. దర్శన్ కు ఇంటి భోజనానికి అనుమతి ఇస్తే, ఎక్కడైనా పొరపాటు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. పీపీ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి దర్శన్ పిటీషన్ న తిరస్కరిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
జూన్ 9న రేణుకాస్వామి దారుణ హత్య
నటుడు దర్శన్, హీరోయిన్ పవిత్ర గౌడతో కలిసి ఆయన అభిమాని రేణుకాస్వామిని దారుణంగా హింసించి చంపారే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులోనే జూన్ 11న పోలీసులు దర్శన్ ను అరెస్టు చేశారు. జూన్ 9న బెంగళూరులోని ఓ షెడ్డులో రేణుకాస్వామిని హింసించి చంపినట్లు పోలీసులు గుర్తించారు. అతడి డెబ్ బాడీని అక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మురికినీటి కాలువలో పడవేసినట్లు పోలీసులు తెలిపారు. బెంగళూరుకు 200 కిలోమీటర్ల దూరంలోని చిత్రదుర్గలో నివసించే రేణుకాస్వామి.. దర్శన్ సన్నిహితురాలు పవిత్ర గౌడపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆ కోపంతోనే దర్శన్ అతడిని హత్య చేయించాడని పోలీసులు తెలిపారు. ఈ కేసులోనే ప్రస్తుతం దర్శన్ జైలు జీవితాన్ని గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో తనకు కొన్ని ప్రత్యేక వసతులు కల్పించాలని న్యాయస్థానాన్ని కోరారు. కానీ, ఆయన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది.
Also Read: విమానంలో సారా అలీ ఖాన్ కు చేదు అనుభవం, నెట్టింట వీడియో వైరల్- నిజంగానే జరిగిందా? కావాలని చేశారా?