కాంబినేషన్లు కాపాడతాయా? కథలేకుండా సినిమాలు తీసేస్తున్న బడా నిర్మాతలు - చేతులు కాలాక ఏం లాభం?
కాంబినేషన్ లను నమ్ముకుని పూర్తి కథ లేకుండానే డిజాస్టర్ లు తీస్తున్న బడా నిర్మాతలు. ఏజెంట్ నిర్మాత అనిల్ ట్వీట్ తో మరోసారి వెలుగులోకి వచ్చిన వాస్తవాలు.
‘ఏజెంట్’ సినిమా డిజాస్టర్ కావడం పై నిర్మాత అనిల్ సుంకర స్పందిస్తూ బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండానే షూటింగ్ కు వెళ్లి ఖరీదైన గుణపాఠం నేర్చుకున్నామంటూ ట్వీట్ చేశారు. అయితే ఈ తప్పు చెయ్యడం ఆయనకు ఇదే తొలిసారి కాదు. గతంలో మహేష్ బాబు తో కూడా ఇలానే సరైన స్క్రిప్ట్ లేకుండానే హడావుడిగా తెరకెక్కించిన ఆగడు ఫలితం కూడా డిటో నే. అంతకు ముందు ఈ నిర్మాతే తీసిన ‘దూకుడు’ సినిమా బ్లాక్ బస్టర్ అయిన సందర్భం లోనే మహేష్ బాబు మాట్లాడుతూ బౌండెడ్ స్క్రిప్ట్ తో షూటింగ్ మొదలుపెట్టామని అందుకే ‘దూకుడు’ అంత పెద్ద హిట్ అయింది అనీ, ఇకపై తాను పూర్తి స్క్రిప్ట్ లేకుండా షూటింగ్ లు చెయ్యనని చెప్పారు. కానీ ఆ తరువాత ఆలాంటి పొరబాట్లు ఆయన కూడా చేసిన సందర్భాలు లేకపోలేదు.
టాలీవుడ్ కొంపముంచుతున్న కాంబినేషన్ల క్రేజ్
ప్రస్తుతం టాలీవుడ్ లో డైరెక్టర్ -హీరో ల కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ నిర్మాతల పాలిట శాపమై కూర్చుంది అంటారు విశ్లేషకులు. హీరో తో తనకున్న పరిచయం లేదా స్నేహాన్ని దృష్టిలో పెట్టుకుని డేట్స్ తెచ్చుకున్న కొంతమంది దర్శకులు వాటిని నిర్మాతకు చూపించి సినిమా స్టార్ట్ చేస్తున్నారు. అయితే ముందుగా సిద్ధం చేసుకోవాల్సిన కథ లేకుండానే కేవలం ఒకలైన్ పట్టుకుని సినిమా మొదలుపెట్టేస్తున్నారు. కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకుని నిర్మాత కూడా కిక్కురు మనకుండా డబ్బులు కుమ్మరిస్తున్నారు. తీరా ఫలితం చూశాక తల పట్టుకుంటున్న పరిస్థితి. గతంలో రామానాయుడు, KS రామారావు లాంటి దిగ్గజ నిర్మాతలు పూర్తి స్క్రిప్ట్ లేకుండా సినిమా మొదలు పెట్టేవారు కారు. అందుకే వారి బ్యానర్ ల నుండి క్లాసిక్స్ వచ్చాయి. అయితే ఆ పరిస్థితి ఇప్పుడు లేదు అంటారు క్రిటిక్స్.
బ్రహ్మోత్సవం,ఆచార్య లదీ ఇదే తీరు
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ హిట్ కావడంతో మహేష్, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో మొదలైన సినిమా బ్రహోత్సవం. ఆ సినిమా మహేష్ కెరీర్ లోనే కనీవినీ ఎరుగని డిజాస్టర్ అయింది. నిర్మాత పీవీపీ ఆ ఫలితం పై మాట్లాడుతూ తానెన్ని సార్లు అడిగినా పూర్తి కథ చెప్పలేదని అసలు స్క్రిప్టే లేకుండా షూటింగ్ మొదలు పెట్టారని పలు ఇంటర్వూల్లో చెప్పారు. కాదంటే ఎక్కడ కాంబినేషన్ మిస్ అవుతుందో అనే భయం తో షూటింగ్ కంప్లీట్ చేశామని ఆ సినిమా డిజాస్టర్ అవుతుంది అని తనకు ముందు నుండే డౌట్ ఉందని ఆయన అన్నారు. అలాగే, చిరంజీవి నటించిన ‘ఆచార్య’ ఇదే తంతు. చిరంజీవి - కొరటాల కాంబినేషన్ లో మొదలైన ఈ సినిమా లో చిన్న పాత్ర అనుకున్న సిద్ద క్యారెక్టర్ రాంచరణ్ ఎంట్రీ తో పెద్ద పాత్రగా మార్చారు. దానితో మధ్యలో కథ మారిపోవడం.. సినిమా స్టోరీ దారి తెన్నూ లేకుండా పోవడంతో కెరీర్ లో తొలిసారి ప్లాప్ ను మూటగట్టుకున్నారు కొరటాల శివ. ఎన్టీఆర్ -హరీష్ శంకర్ ల కాంబినేషన్ లో వచ్చినా రామయ్యా వస్తావయ్యా ది మరో రకం కథ. సినిమా మొదలుపెట్టినప్పుడు కథ వేరే. అయితే ఆ సినిమా షూటింగ్ మధ్యలో రెబల్ సినిమా కథ కూడా ఇంచుమించు ఇదే లైన్ అని తెలిసి సెకండాఫ్ స్టోరీ మొత్తాన్ని మార్చేశారు. దానితో ఆ సినిమాను అనుకున్నట్టు తెరకెక్కించ లేకపోయామని హరీష్ శంకర్ చెప్పారు. దీనికి కౌంటర్ గా అనిల్ రావిపూడి పటాస్, పూరి జగన్నాథ్ టెంపర్ లు కూడా ఇంచుమించు ఒకే లైన్ తో తెరకెక్కుతున్నాయని తెలిసినా ఆ దర్శకులు తమ స్క్రిప్ట్ మీద నమ్మకంతో సినిమాలు పూర్తి చేసి రెండూ సూపర్ హిట్స్ కొట్టారు.
తాజాగా ‘ఏజెంట్’
ఒక పెద్ద మాస్ హిట్ కోసం చూస్తున్న అఖిల్ అక్కినేని స్టైలిష్ డైరెక్టర్ గా పేరుబడ్డ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ డిజాస్టర్ ‘ఏజెంట్’ అసలు బౌడెడ్ స్క్రిప్ట్ అన్నదే లేకుండా షూటింగ్ మొదలు పెట్టేశారని అందువల్లే ఇంతపెద్ద ప్లాప్ మూట గట్టుకున్నామని నిర్మాత అనిల్ సుంకర ట్వీట్ చేయడం టాలీవుడ్ లో కొందరి దర్శక -హీరోల తీరు ను తెలియజేస్తుంది. ఇప్పటికే టాలీవుడ్‌లో నిర్మాతల పరిస్థితి చెక్కులు చింపి ఇచ్చే అకౌంటెంట్ పాత్రకు పరిమితమై పోయిందన్న వాదనను కొందరు సీనియర్ నిర్మాతలే తెరమీదకు తెస్తున్నారు. అయితే ఇందులో నిర్మాతల తప్పూ లేకపోలేదు. కేవలం కాంబినేషన్ లను దృష్టిలో పెట్టుకుని అప్పులు చేసి మరీ తలాతోకా లేని డిజాస్టర్ సినిమాలు తీసి కనుమరుగైపోతున్నారు.
పక్కా స్క్రిప్ట్ తో సూపర్ హిట్స్ కొడుతున్న చిన్న హీరోలు
‘ఏజెంట్’ సినిమా జోనర్ లోనే గతంలో వచ్చిన అడవి శేష్ గూఢచారి ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. స్పై సినిమా అంటే ఇదీ అని టాలీవుడ్ కు తెలియజేసిన మూవీ అది. ఇప్పుడు దానికి సీక్వెల్ కూడా వస్తుంది. అదనే కాదు క్షణం, ఎవరు, మేజర్ లాంటి సినిమాలను అందించిన అడవి శేష్ సరైన స్క్రిప్ట్ లేకుండా షూటింగ్ కు వెళ్లరని పేరు. అలాగే హీరోగా నిర్మాతగా డబుల్ రోల్ పోషిస్తున్న నాని కూడా పక్కా స్క్రిప్ట్ తో హిట్ సినిమా ఫ్రాంచైజీని టాలీవుడ్ కు అందించారు. ఇటీవల వచ్చి సూపర్ హిట్స్ ఐన సినిమాలు ‘విరూపాక్ష’, ‘సార్’ లాంటి సినిమాలు కూడా పక్కా స్క్రిప్ట్ పూర్తి అయ్యాక మాత్రమే తెరకెక్కిన సినిమాలు. అందుకే ‘విరూపాక్ష’ డైరెక్టర్ కార్తీక్ ను బడా నిర్మాత దిల్ రాజు అంతలా స్టేజ్ పై పొగిడింది. అలాగే నిఖిల్, నితిన్ లు కూడా సినిమా లేటైనా పర్వాలేదు. కానీ పక్కా స్క్రిప్ట్ లేకుండా షూటింగ్ కు వెళ్ళేది లేదని చెప్పేస్తున్నారు. అందుకే శ్రీకాంత్ ఓదెల, కార్తీక్, శైలేష్ కోనేరు లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ లు తెరమీదకు వస్తున్నారు. కానీ సమస్యల్లా పెద్దహీరోల - డైరెక్టర్ లతోనే. కేవలం కాంబినేషన్ కున్న క్రేజ్ తో పూర్తి కథ లేకుండా వారు తీస్తున్న సినిమాలు టాలీవుడ్ కు మేజర్ డిజాస్టర్ లను ఇస్తున్నాయి. మరి ‘ఏజెంట్’ ఫలితంతో వారి పంథాలో మార్పు వస్తుందేమో చూడాలి అంటున్నారు సినిమా అభిమానులు.