Women's Day Special : వెయ్యి కోట్ల సినిమాకు అయినా సరే 'ఆమె' కావాలి - ఆడదే ఆధారం
కమర్షియల్ కథానాయిక, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని తక్కువ చేసి చూడకండి! వెయ్యి కోట్ల సినిమాకు అయినా సరే 'ఆమె' కావాలి. స్త్రీ లేని స్టార్ హీరో సినిమా ఒక్కటి చూపించండి.
స్త్రీ లేకపోతే జననం లేదు...
స్త్రీ లేకపోతే గమనం లేదు...
స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు...
స్త్రీ లేకపోతే ఆఖరికి సినిమా కూడా లేదు!
వెయ్యి కోట్ల సినిమాకు అయినా సరే 'ఆమె' కావాలి. సినిమాలో కంపల్సరీ ఉండాలి. కమర్షియల్ కథానాయిక అంటారో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటారో... పిలుపు ఏదైనా సరే 'ఆమె' లేని సినిమాను ఊహించలేం. వెయ్యి కోట్లు వసూలు చేసిన భారతీయ సినిమాలు తీసుకుంటే... ప్రతి సినిమాకూ కథానాయిక, ఫిమేల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు వెన్నుముకగా నిలిచాయి. సినిమాను ముందుకు నడిపించాయి.
'దంగల్' కథే అమ్మాయిలది!
ఇండియాలో కలెక్షన్స్ ఎంత? చైనా, ఓవర్సీస్ వసూళ్లు ఎన్ని? లెక్కలు పక్కన పెడితే భారతీయ బాక్సాఫీస్ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా 'దంగల్' (Dangal Movie). అందులో ఆమిర్ ఖాన్ హీరో కావచ్చు. కానీ, ఆ సినిమా కథే అమ్మాయిలది. అదేమీ కల్పిత కథ కాదు. రెజ్లింగ్ పరంగా దేశానికి ఎంతో పేరు తీసుకువచ్చిన ఫోగాట్ సిస్టర్స్ జీవిత కథ. భారతీయులకు మాత్రమే కాదు... వాళ్ళ కథ చైనీయులకు, విదేశీయులకు కూడా నచ్చింది.
శివగామి... దేవసేన...
'బాహుబలి'కి అండ, దండ
భారతీయ బాక్సాఫీస్ చరిత్రలో 'బాహుబలి' (Baahubali Movie) ప్రభాస్, రానా, రాజమౌళిల చిత్రమే. ఆ సినిమాకు మూలం? శివగామి, దేవసేన పాత్రలే. ఆడదాని కోసం రాజ్యాల మధ్య యుద్ధాలు జరిగాయని చరిత్ర చెబుతోంది. రాజ్యాల మధ్యే కాదు... సోదరులు కూడా యుద్ధం జరుగుతుందని 'బాహుబలి'లో చూపించారు. రాజ్యకాంక్షతో పాటు దేవసేన మీద భల్లాలదేవ మనసు పారేసుకోవడం కథలో కాన్‌ఫ్లిక్ట్‌కి కారణం. అసలు, కన్న కొడుకును కాదని మరొకరికి రాజ్యం కట్టబెట్టాలని శివగామి అనుకోకపోతే స్టార్టింగులో కథకు ఫుల్ స్టాప్ పడేది కదా!
'బాహుబలి'లో మహిళల పాత్రలను రాజమౌళి బలంగా తీర్చిదిద్దారు. ఆ పాత్రల్లో రమ్యకృష్ణ, అనుష్క, తమన్నా అద్భుతంగా నటించారు. మిల్కీ బ్యూటీగా పేరు పడిన తమన్నా... 'బాహుబలి'లో విల్లు ఎక్కుపెట్టి యుద్ధాలు చేశారు. 'పచ్చబొట్టు వేసినా...' పాటలో అందంగానూ కనిపించారు. సినిమాలో మహిళలు అందరూ వాళ్ళను తప్ప మరొకరిని ఊహించుకోలేనంతగా జీవించారు. సినిమా విజయంలో వాళ్ళకూ వాటా ఉంటుంది. వాళ్ళు లేని ఆ చిత్రమే లేదు.
తల్లి మాటలే రాఖీ భాయ్ డ్రైవింగ్ ఫోర్స్!
ఓ సామాన్యుడు అసాధారణ స్థాయికి వెళ్లే కథలు ఎప్పుడూ విజయాలు సాధిస్తాయి. అటువంటి కథల్లో ప్రేక్షకులు తమను తాము చూసుకుంటారు. ఆ కథకు మదర్ సెంటిమెంట్, ఎమోషన్ తోడైతే? 'కెజియఫ్' లాంటి విజయాలు వస్తాయి. బాక్సాఫీస్ బరిలో వెయ్యి కోట్లు వస్తాయి. 'కెజియఫ్' సినిమా (KGF Movie) లో రాఖీ భాయ్ పాత్రలో హీరోయిజం చూశారు కొందరు. ఫైట్స్ & ఎలివేషన్స్ నచ్చాయని ఇంకొందరు చెప్పారు. అసలు, ఆ హీరోయిజాన్ని ముందుకు నడిపిన డ్రైవింగ్ ఫోర్స్? తల్లి కోరికే కదా! తల్లికి ఇచ్చిన మాట కోసం హీరో ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఆ ఎమోషన్ లేకుండా ఫైట్స్ చేస్తే చూసేవారా?
'కెజియఫ్'లో తల్లి క్యారెక్టర్ మాత్రమే కాదు... ప్రధాన మంత్రి పాత్ర కూడా చాలా బలంగా ఉంటుంది. రమికా సేన్ పాత్రలో రవీనా టాండన్ నటన బలమైన ప్రతినాయకుడికి ఏమాత్రం తక్కువ కాదు. 'గూస్ కే మారెంగే' డైలాగ్ చెప్పిన సమయంలో ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చాయంటే అతిశయోక్తి కాదు. 'కెజియఫ్ 2'లో హీరో హీరోయిన్స్ యశ్, శ్రీనిధి శెట్టి మధ్య 'మెహబూబా...' సాంగ్ ప్రేక్షకులకు రిలీఫ్ ఇచ్చింది. ఆడదానికి చేతులు ఎత్తి మొక్కాలనే సందేశాన్ని కూడా ఇచ్చారు.
'పఠాన్'లో దీపికా పదుకోన్...
గ్లామర్ కాదు, అంతకు మించి!
'పఠాన్' (Pathaan Movie) విడుదలకు ముందు 'బేషరమ్ రంగ్' పాటలో దీపికా పదుకోన్ ధరించిన బికినీ రంగుపై పెద్ద చర్చ జరిగింది. గ్లామర్ గురించి డిస్కషన్ ఎక్కువ నడిచింది. 'పఠాన్' విడుదలైన తర్వాత చూస్తే... గ్లామర్ షో మాత్రమే కాదు, అంతకు మించి అనేలా ఆమె క్యారెక్టర్ ఉంది. అందాల బొమ్మగా కనిపిస్తూ... పాత్రకు అవసరమైన ఎమోషన్స్ పలికించారు. దీపికా పదుకోన్ క్యారెక్టర్ ట్విస్టులకు కారణమైంది.
Also Read : వెంకటేష్ మహా ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యారు? ఆయనకు అసలు పాయింట్ అర్థమవుతోందా?
వెయ్యి కోట్ల సినిమాలు మాత్రమే కాదు... ఏ సినిమా తీసుకున్నా సరే, ఏ భాషలో సినిమా చూసినా సరే ఫిమేల్ క్యారెక్టర్లు కంపల్సరీ. పాటలకు, రొమాంటిక్ సీన్లకు అయినా సరే వాళ్ళను తీసుకోక తప్పదు. ఒకప్పుడు గ్లామర్ కోణంలో మాత్రమే స్త్రీ పాత్రలను కొందరు సృష్టించారు. ఈ మధ్య కాలంలో సినిమాల్లో మహిళలకు ప్రాముఖ్యం పెరుగుతోంది. పాటలకు, కొన్ని సీన్లకు హీరోయిన్లను పరిమితం చేసిన సినిమాలు ఓ స్థాయి విజయాలు సాధిస్తున్నాయి. మహిళలకు పెద్దపీట వేసిన సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ భారీ విజయాలు సాధిస్తున్నాయి.
Also Read : ఆట బొమ్మలు కాదు ఆడ పులులు - రంగంలోకి దిగితే రచ్చ రచ్చే!