Vyjayanthi Movies Legal Notice : 'కల్కి' మేకర్స్ నుంచి మరో లీగల్ నోటీస్.. ఈ వార్నింగ్ 'మెగా' టీమ్కేనా?
'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమా కంటెంట్‌ని అనధికారికంగా ఉపయోగిస్తే, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వైజయంతీ మూవీస్ సంస్థ లీగల్ పబ్లిక్ నోటీసు జారీ చేసింది.
ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతాయి. కానీకొన్ని మాత్రమే ఎవర్ గ్రీన్‌గా నిలిచిపోయే కల్ట్ మూవీస్ అవుతాయి. అలాంటి వాటిలో 'జగదేక వీరుడు అతిలోక సుందరి' ముందు వరుసలో ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి జంటగా.. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో అశ్వినీదత్ నిర్మాణంలో రూపొందిన చిత్రమిది.1990లో వచ్చిన ఈ సోషియో ఫాంటసీ మూవీ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఎన్నో సంచలనాలు సృష్టించింది. సినిమా వచ్చి మూడు దశాబ్దాలు దాటిపోయినా ఇప్పటికీ మాట్లాడుకునేలా చరిత్రలో నిలిచిపోయింది. అలాంటి ఈ చిత్రం ఇప్పుడు అనుకోని విధంగా వార్తల్లో నిలిచింది.
వైజయంతీ మూవీస్ సంస్థ మంగళవారం 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమాకు సంబంధించి లీగల్ పబ్లిక్ నోటీసు ఇష్యూ చేసింది. ఈ సినిమాలోని కంటెంట్‌ని అనధికారికంగా ఉపయోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, మోరల్ రైట్స్, క్యారెక్టర్ రైట్స్, స్టోరీ రైట్స్, మ్యూజిక్ రైట్స్.. ఇలా సర్వహక్కులు తమ సొంతమని పేర్కొన్నారు. ఆ సినిమా ఆధారంగా రీమేక్, సీక్వెల్, ప్రీక్వెల్, వెబ్ సిరీస్ లాంటివి తీయడం చట్టరీత్యా నేరమని తెలిపారు. ఈ సినిమాకు దగ్గరగా ఎవరైనా, ఏ భాషలోనైనా, ఏ మాధ్యమంలోనైనా ఫిలిం తీస్తే కాఫీరైట్ ఉల్లంఘన కింద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని నిర్మాత స్పష్టం చేశారు. ఈ మేరకు పలు పత్రికల్లో లీగల్‌గా పబ్లిక్ నోటీసు జారీ చేయడమే కాదు, సోషల్ మీడియాలోనూ షేర్ చేశారు.
View this post on Instagram
నిజానికి 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమా కంటెంట్‌ను ఇప్పటికే ఎన్నో సినిమాల్లో, జబర్దస్త్ లాంటి కామెడీ షోలలో అన్ని విధాలుగా ఉపయోగించుకున్నారు. యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే ఈ సినిమాపై లెక్కలేనన్ని స్పూఫ్ వీడియోలు, కవర్ సాంగ్స్ కనిపిస్తాయి. అయితే ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్న వైజయంతీ టీమ్.. సినిమా రిలీజైన 33 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఉన్నఫలంగా రైట్స్ తమ సొంతమని పబ్లిక్ లీగల్ నోటీస్ ఇవ్వడం అందరి దృష్టిలో పడింది. ఇదే ప్రస్తుతం ఫిలిం సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా నడుస్తోంది. దీనిపై పలు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా Mega157తో లింక్ చేస్తూ ఓ రూమర్ చక్కర్లు కొడుతోంది.
Also Read: ఓటీటీలో వచ్చేస్తోన్న బ్లాక్ బస్టర్ మూవీ!
'బింబిసార' ఫేమ్ మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ వారు దీనికి నిర్మాతలు. ఇదొక సోషియో ఫాంటసీ సినిమా అని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. పంచభూతాల కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కనుందని అనౌన్స్మెంట్ పోస్టర్‌ను బట్టి అర్థమవుతోంది. అయితే ఈ కథని 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమాతో పోలుస్తూ సోషల్ మీడియాలో కొన్ని రూమర్స్ వినిపించాయి. మెగాస్టార్ క్యారెక్టర్ కూడా గైడ్ రాజు పాత్రకు కొనసాగింపుగా ఉంటుందని మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలోనే అశ్వనీదత్ పబ్లిక్ నోటీసు జారీ చేసి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమాను కుదిరితే మెగా వారసుడు రామ్ చరణ్‌తో రీమేక్ చేస్తానని నిర్మాత అశ్వినీ దత్ ఎన్నాళ్ల నుంచో చెబుతూ వస్తున్నారు. హీరోయిన్గా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ను తీసుకునే అవకాశాలు ఉన్నాయంటూ ఇప్పటికే పలుమార్లు కథనాలు వచ్చాయి. అలాంటప్పుడు చిరంజీవి రాబోయే సినిమాకు వైజయంతీ టీమ్ పబ్లిక్ నోటీసు ద్వారా హెచ్చరికలు జారీ చేసిందని అనుకోలేమనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఒకవేళ అలాంటిది ఏమైనా ఉన్నా కలిసి చర్చించుకునేంత సత్సంబంధాలు వారి మధ్య ఉన్నాయని అంటున్నారు.
అదే సమయంలో వైజయంతీ నోటీస్ మెగా157 సినిమా కోసం కాదు.. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఓ ఓటీటీ వెబ్ సిరీస్ కోసమనే టాక్ కూడా వినిపిస్తోంది. ఓ పీరియాడిక్ ఫాంటసీ మూవీ చేయటానికి టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ఒకరు ప్రయత్నాలు చేస్తున్నారని, ఈ కథ దాదాపు 'జగదేక వీరుడు అతిలోక సుందరి' ఉంటుందట. అందుకే ముందు జాగ్రత్తగా ఇప్పుడు అన్ని హక్కులు తమ దగ్గరే ఉన్నాయని నిర్మాత పబ్లిక్ నోటీస్ ఇచ్చారని అనుకుంటున్నారు. ఇందులో ఏది నిజమో తెలియదు కానీ, ఇటీవల 'కల్కి 2898 AD' కంటెంట్ లీక్ విషయంలో లీగల్ నోటీసులు ఇచ్చిన వైజయంతీ మూవీస్.. ఇప్పుడు 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమాకి సంబంధించి పబ్లిక్ నోటీసులు జారీ చేసి చర్చల్లో నిలిచింది.
Also Read: శ్రీలీల పక్కన మోక్షజ్ఞ - 'భగవంత్ కేసరి' టీమ్‌తో బాలయ్య వారసుడి పిక్ అదిరింది కదూ!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial