Vishwak Sen: ‘కల్ట్’ టైటిల్ నాదే, నిర్మాతలు కొడతారు నన్ను - విశ్వక్ సేన్
Vishwak Sen Cult Movie: ఇప్పటివరకు విశ్వక్ సేన్ నిర్మాతగా కేవలం తన సినిమాలను మాత్రమే ప్రొడ్యూస్ చేస్తూ వచ్చాడు. ఇప్పుడు కొత్త నటీనటులతో ‘కల్ట్’ అనే సినిమాను నిర్మించబోతున్నాడు.
యంగ్ హీరో విశ్వక్ సేన్‌కు కొన్ని సినిమాల అనుభవమే ఉన్నా.. వెంటనే నిర్మాతగా కూడా మారాడు. సొంత బ్యానర్‌ను ప్రారంభించి తన సినిమాలను తానే నిర్మించుకున్నాడు. కానీ మొదటిసారి తను నిర్మాతగా మాత్రమే వ్యవహరిస్తూ.. కొత్త నటీనటులతో ‘కల్ట్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు విశ్వక్. ఇక ఈ మూవీ గురించి ప్రేక్షకులకు తెలియడం కోసం ఒక ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేశాడు. అందులో ఈ మూవీ టైటిల్ గురించి, కాన్సెప్ట్ గురించి పలు విషయాలపై క్లారిటీ ఇచ్చాడు. అంతే కాకుండా ‘కల్ట్’లో తను హీరోగా నటించకుండా కొత్తవారిని ఎందుకు తీసుకుంటున్నాడు అనే విషయాన్ని కూడా రివీల్ చేశాడు.
శేఖర్ కమ్ములనే ఉదాహరణ
గతేడాది విడుదలయిన బ్లాక్‌బస్టర్ సినిమాల్లో ‘బేబి’ కూడా ఒకటి. అయితే ఆ మూవీ అంత పెద్ద హిట్ అయిన ఆనందంలో తమ సినిమా కల్ట్ బొమ్మ అని నిర్మాత ఎస్‌కేఎన్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు అదే పదాన్ని తన సినిమా టైటిల్‌గా పెట్టుకోవడంపై విశ్వక్ సేన్ క్లారిటీ ఇచ్చాడు. ‘‘మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. ఎవరి దగ్గర కల్ట్‌కు సంబంధించిన ఏ టైటిల్ లేదు’’ అని అన్నాడు. అంతే కాకుండా కొత్తవారితో ఈ సినిమా చేయడానికి కారణం కూడా బయటపెట్టాడు. ‘‘నా ముక్కు, మొహం కూడా ఒకప్పుడు ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు మీతో కూర్చొని మాట్లాడుతున్నా కదా. సినిమాలో మ్యాటర్ ఉండాలి. చాలాసార్లు ఇలా వర్కవుట్ అయ్యింది. శేఖర్ కమ్ముల వర్కవుట్ చేసి చూపించారు. మొన్న ‘మ్యాడ్’ వచ్చింది. సినిమాలో చాలా మ్యటర్ ఉంది. మీ కడుపు చెక్కలయ్యేలా నవ్వుతారు’’ అని అన్నాడు.
మజా వస్తుందని చేస్తున్నా
Culd movie title : తను పడిన కష్టాలు కొత్తవాళ్లు పడకూడదు అనే ఉద్దేశ్యంతో ఎప్పటికప్పుడు కొత్తవాళ్లకు ఛాన్స్ ఇస్తున్నారా అని విశ్వక్‌కు ప్రశ్న ఎదురయ్యింది. ‘‘అంత లేదు. నాకు మజా వస్తుందని సినిమా చేసుకుంటున్నా. ఇప్పుడు ప్రజాసేవ చేసి నేనేదో ఉద్దరించాలని బయటికి రాలేదు’’ అని సూటిగా సమాధానమిచ్చాడు విశ్వక్ సేన్. అయితే ‘కల్ట్’ పోస్టర్‌లో డ్రగ్స్ గురించి ప్రస్తావన ఉంది. దాని గురించి అడగగా.. సినిమాలో డ్రగ్స్ గురించి మాత్రమే కాదని.. ఇంకా చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయని అన్నాడు విశ్వక్. వియత్నాంలో సంవత్సరం క్రితం జరిగిన ఒక సంఘటన ఆధారంగా కథ రాసుకున్నానని చెప్పాడు. ఇది మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా అయినా కమర్షియల్‌గా వర్కవుట్ అవుతుందని విశ్వక్ ధీమా వ్యక్తం చేశాడు. ‘యానిమల్’ సినిమాలో ఐటెమ్ సాంగ్ లేదని, అయినా సినిమా కమర్షియల్‌గా వర్కవుట్ అయ్యిందని గుర్తుచేశాడు.
నిర్మాతలు కొడతారు
‘కల్ట్’లో తనే హీరోగా చేయవచ్చు కదా అని విశ్వక్‌ను ప్రశ్నించగా.. ‘‘మూడు రోల్స్ ఉన్నాయి. మూడింటిలో ఏది చేయాలని కన్‌ఫ్యూజ్ అయ్యాను. కొత్త నటీనటులతో మీరు ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. అంతే కాకుండా షెడ్యూల్ టైట్ ఉంది. మా నిర్మాతలందరూ కొడతారు నన్ను. అందరికీ డేట్స్ ఇచ్చేశాను. రెండేళ్లలోపు కథ కూడా పాతది అయిపోతుంది. ఈరోజు, రేపు ఆరు నెలలకే కొత్త కంటెంట్స్ వచ్చేస్తున్నాయి. సినిమా తీయడం, రిలీజ్ చేయడం వెంటవెంటనే అయిపోవాలి. ఎందుకంటే మన సినిమా జోనర్‌లోనే వేరే సినిమా వస్తే మన సినిమా పనికిరాకుండా అయిపోతుంది. నాకు కూడా వెంటనే ప్రారంభించాలని ఉంది’’ అని అన్నాడు. గెస్ట్ రోల్ గురించి ఇంకా క్లారిటీ లేదని చెప్పాడు విశ్వక్ సేన్.
Also Read: వివాదాలకు విరామం, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ రిలీజ్ డేట్ ఫిక్స్