Thangalaan: ‘కేజీఎఫ్’తో విక్రమ్ ‘తంగలాన్’కు లింకు - ఆ రహస్యాలన్నీ బయటపెడతారట!
Thangalaan Movie: విక్రమ్ హీరోగా పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ‘తంగలాన్’పై ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా కథ ఇదే అంటూ రూమర్స్ కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి.
Thangalaan Movie Story: కోలీవుడ్‌లో ఈ ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. అందులో ఒకటి విక్రమ్ హీరోగా నటించిన ‘తంగలాన్’. ఈ సినిమా కోసం హీరో విక్రమ్ మేక్ ఓవర్ చూసి ఇప్పటికే ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. ‘తంగలాన్’ ఇప్పటికే పలుమార్లు విడుదల తేదీని వాయిదా వేసుకుంది. అంతే కాకుండా ఇప్పటికే ఈ సినిమా చుట్టూ ఎన్నో రూమర్స్ కూడా వైరల్ అయ్యాయి. తాజాగా మరో రూమర్ వల్ల ‘తంగలాన్’ మూవీ గురించి సినీ సర్కిల్లో హాట్ టాపిక్ మొదలయ్యింది. ఈ సినిమా కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అలియాస్ ‘కేజీఎఫ్’ రహస్యాలను బయటపెడుతుందని సమాచారం.
సోనే కీ చిడియా వెనుక కథేంటి..
కర్ణాటకలోని ‘కేజీఎఫ్’ గోల్డ్ మైన్స్ గురించి ఇప్పటికే ప్రశాంత్ నీల్ తన సినిమాల్లో చెప్పుకొచ్చాడు. ఒక చాప్టర్ సరిపోదని రెండు చాప్టర్స్‌తో దీని గురించి ప్రేక్షకులకు వివరించాడు. ఇప్పుడు విక్రమ్ కూడా తన సినిమా ‘తంగలాన్’తో ఈ కేజీఎఫ్ గురించి తెలిసేలా చేస్తాడని కోలీవుడ్‌లో రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో బ్రిటిష్ వాళ్లు ఇండియాను ‘సోనే కీ చిడియా’ అంటే ‘బంగారు పక్షి’ అని ఎందుకు అనేవారో దర్శకుడు పా రంజిత్ వివరిస్తాడని సమాచారం. బ్రిటిష్ వాళ్లు ఇండియాను ఆక్రమించి పాలించక ముందు ఈ దేశంలో చాలా బంగారం ఉండేదని అందరికీ తెలిసిందే. అన్నింటికంటే ముఖ్యంగా కేజీఎఫ్ కారణంగానే బ్రిటిష్.. ఇండియాకు సోనే కి చిడియా అని పేరు పెట్టిందని, అదే నేపథ్యంలో ‘తంగలాన్’ సినిమా రానుందని తెలుస్తోంది.
19వ శతాబ్దం కథ..
ఇండియాను బ్రిటిష్ పాలిస్తున్న సమయంలో ఇక్కడ నుండి వారి దేశానికి దాదాపు 900 టన్నుల బంగారాన్ని తరలించారు. అంతే కాకుండా ఇండియాలోని అతిపెద్ద బంగారు గని అయిన కేజీఎఫ్‌ను దోచుకున్నారు. అయితే ఇదంతా ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనే విషయం మాత్రం చాలామందికి తెలియదు. ‘తంగలాన్’లో అదే విషయాన్ని క్షుణ్ణంగా చూపిస్తామని మేకర్స్ చెప్తున్నారు. ముఖ్యంగా కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ వెనుక ఉన్న బ్యాక్‌గ్రౌండ్ స్టోరీని ప్రేక్షకులకు తెలిసేలా చేస్తామని అంటున్నారు. బ్రిటిషర్ల నుండి కేజీఎఫ్‌ను ప్రజలంతా కలిసి ఎలా కాపాడుకున్నారు అనేది ‘తంగలాన్’ కథ. 19వ శతాబ్దం బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథ సాగనుంది. ఇప్పటికే ఆ కాలంలోని వ్యక్తిగా కనిపించడం కోసం హీరో విక్రమ్ చాలా కష్టపడ్డాడు.
వయొలెంట్‌గా టీజర్..
గతేడాది నవంబర్‌లో ‘తంగలాన్’ టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. అందులో విక్రమ్‌ను ఒక పామును చంపడం చూపించారు. అది చూసి ప్రేక్షకులంతా షాక్ అయ్యారు. అసలు విక్రమ్ గుర్తుపట్టలేని విధంగా మేక్ ఓవర్ అయ్యాడని అనుకున్నారు. టీజర్‌లోనే చాలా వయొలెన్స్‌ను చూపించాడు దర్శకుడు పా రంజిత్. ఏప్రిల్‌లో ఈ మూవీ విడుదల అవుతుందని సంక్రాంతి సందర్భంగా ప్రకటించింది మూవీ టీమ్. మాళవికా మోహనన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో పార్వతీ తిరువోతు కూడా మరొక కీలక పాత్రలో కనిపించనుంది. పసుపతి, ముత్తుకుమార్, హరి కృష్ణన్, ప్రీతి, అర్జున్ ప్రభాకరన్ లాంటి నటీనటులు ఇందులో ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. స్టూడియో గ్రీన్.. ‘తంగలాన్’ను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.
Also Read: తన పక్కన నటించాలంటే అలా ఉండాలన్నారు - ఎన్టీఆర్, ఏఎన్నార్‌లపై వై విజయ ఆసక్తికర వ్యాఖ్యలు