Varun Sandesh : పాపం వరుణ్ సందేశ్ - చివరకు డ్యాన్స్ టీమ్‌ను పరిచయం చేసే స్థాయికి....
బళ్ళు ఓడలు, ఓడలు బళ్ళు కావడం అంటే ఇదేనేమో!? వెండితెరపై ఓ వెలుగు వెలిగిన వరుణ్ సందేశ్ స్థాయి ఇప్పుడు బుల్లితెరకు పడిపోవడం ఆయన్ను అభిమానించిన ప్రేక్షకులను బాధ పెడుతోంది.
'హ్యాపీ డేస్' వచ్చి పదిహేనేళ్ళు దాటింది. ఇప్పటికీ ఆ సినిమా చూసే జనాలు ఉన్నారు. 'హ్యాపీ డేస్' చూసి బీటెక్ చేరిన స్టూడెంట్స్ ఎంతో మంది! అలాగే, సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కుర్రాళ్ళు కూడా! ఎందుకంటే... ఆ సినిమాతో దర్శకుడు శేఖర్ కమ్ములు నలుగురు హీరోలను పరిచయం చేశారు. అందులో వరుణ్ సందేశ్ (Varun Sandesh) ఒకరు. సినిమా విడుదలైన తర్వాత ఆయనకు ఎక్కువ పేరు వచ్చింది. సినిమా అవకాశాలు కూడా! అయితే... ఇప్పుడు రేసులో వెనుకబడ్డారు.
'హ్యాపీ డేస్'లో ఓ హీరోగా నటించిన నిఖిల్ సిద్ధార్థ్ స్థాయి ఏంటి? అనేది ఇప్పుడు అందరికీ తెలుసు. ఆయన పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. 'కార్తికేయ 2' హిందీలోనూ భారీ వసూళ్ళు సాధించింది. 'హ్యాపీ డేస్'లో వరుణ్ సందేశ్ జోడిగా నటించిన తమన్నా భాటియాకు, ఆ సినిమా విడుదల అయ్యే సమయానికి పెద్ద గుర్తింపు లేదు. దానికి ముందు తెలుగులో మంచు మనోజ్ 'శ్రీ' ఒక్కటే చేశారు. 'హ్యాపీ డేస్'తో వచ్చిన గుర్తింపును సద్వినియోగం చేసుకుని ఆ తర్వాత స్టార్ స్టేటస్ అందుకున్నారు. అగ్ర కథానాయకులతో నటించారు. ఇంకా ఆమె స్టార్ హీరోయినే. మరి, వరుణ్ సందేశ్ ఏం చేస్తున్నారు? సినిమాల్లో కాకుండా టీవీ షోల్లో కనపడుతున్నారు. డ్యాన్స్ రియాలిటీ షోలో ఒక గ్రూపుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
వెండితెర నుంచి బుల్లితెరకు పడిన వరుణ్!
వరుణ్ సందేశ్ (Varun Sandesh In Dhee Premier League)తో పాటు 'బిగ్ బాస్' ఫేమ్ వీజే సన్నీ, యూట్యూబర్ గంగవ్వ, గాయని మధుప్రియ, సుదర్శన్, సిరి హనుమంతు, హరితేజ, 'గెటప్' శ్రీను మిగతా గ్రూపులకు ప్రాతినిధ్యం వహిస్తారు. అంటే... 'ఢీ 16'లో మొత్తం ఎనిమిది టీమ్స్ ఉంటాయి. ఒక్కొక్కరూ ఒక్కో టీమ్ ను వీక్షకులకు పరిచయం చేస్తారు. ఫస్ట్ ఎపిసోడ్ వరకు షోలో కనపడతారు. మిగతా వాళ్ళను తక్కువ చేయాలని ఉద్దేశం కాదు గానీ 'హ్యాపీ డేస్' విడుదలైన సమయానికి వాళ్ళెవరికీ సరైన గుర్తింపు లేదు.
'హ్యాపీ డేస్' విడుదలయ్యే సమయానికి మిగతా గ్రూపులకు ప్రాతినిధ్యం వహించే వాళ్ళందరూ గుర్తింపు కోసం పాకులాడిన వ్యక్తులే. 'ఢీ', 'జబర్దస్త్' వంటి షోలతో గుర్తింపు తెచ్చుకున్న 'సుడిగాలి' సుధీర్ ఇప్పుడు హీరోగా బిజీ అయ్యారు. సినిమాల కోసం ఆయన టీవీ కార్యక్రమాలు వదిలేశారు. 'ఢీ' యాంకర్ ప్రదీప్ మాచిరాజుకు హీరోగా అవకాశాలు వస్తున్నాయి. బళ్ళు ఓడలు, ఓడలు బళ్ళు కావడం అంటే ఇదేనేమో! హీరోగా వరుణ్ సందేశ్ ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు టీవీ షోలు చేసిన వాళ్ళు ఇప్పుడు హీరోలుగా సినిమాలు చేస్తుంటే... వరుణ్ సందేశ్ ఏమో టీవీ షోలో యూట్యూబ్, ఇతర షోస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సెలబ్రిటీలతో కలిసి ఒక్క ఎపిసోడ్ కోసం కనపడుతున్నారు.
'హ్యాపీ డేస్'తో యువతలో మంచి క్రేజ్ తెచ్చుకున్న వరుణ్ సందేశ్, తర్వాత 'కొత్త బంగారు లోకం', 'ఏమైంది ఈవేళ', 'అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్' వంటి హిట్ సినిమాలు చేశారు. ఆయనతో సినిమాలు చేసిన దర్శకులు శేఖర్ కమ్ముల, సంపత్ నంది ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నారు. కనీసం వాళ్ళ సినిమాల్లో క్యారెక్టర్లు కూడా వరుణ్ సందేశ్ వరకు రావడం లేదు. సందీప్ కిషన్ 'మైఖేల్'లో డిఫరెంట్ క్యారెక్టర్ చేశారు. సినిమా హిట్ అయ్యి ఉంటే కెరీర్ టర్న్ తీసుకునేదేమో! ఫ్లాప్ కావడంతో పేరు రాలేదు. ప్రస్తుతం 'కానిస్టేబుల్', 'చిత్రం చూడర' సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు వరుణ్ సందేశ్ సినిమాలకు సరైన బజ్ రావడం లేదు. ఆయన కంటే ప్రదీప్ మాచిరాజు, 'సుడిగాలి' సుధీర్ సినిమాలపై ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు.
Also Read : పవన్ కళ్యాణ్ సినిమా ఒక్కటీ చూడలేదు... 'పొగరు' హీరోయిన్ శ్రియా రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
ఇంతకు ముందు 'బిగ్ బాస్'లో వరుణ్ సందేశ్ పార్టిసిపేట్ చేశారు. అయితే... హీరో కనుక ఆయన్ను తీసుకున్నారని ప్రేక్షకులు భావించారు. ఇప్పుడు ఏకంగా డ్యాన్స్ రియాలిటీ షోలో డ్యాన్స్ గ్రూప్ ప్రతినిధి, డ్యాన్సర్లను పరిచయం చేయడం కోసం వచ్చారనే సరికి కొందరు ఫీలవుతున్నారు. వెండితెరపై ఓ వెలుగు వెలిగిన వరుణ్ సందేశ్ స్థాయి ఇప్పుడు బుల్లితెరకు పడిపోవడం ఆయన్ను అభిమానించిన ప్రేక్షకులను బాధ పెడుతోంది. సరైన ప్లానింగ్ లేకపోవడం, చేసిన సినిమాలు సరిగా ఆడకపోవడంతో వరుణ్ సందేశ్ కెరీర్ అనుకున్న విధంగా ముందుకు సాగలేదు. పరిశ్రమలోకి కొత్తగా వచ్చేవాళ్ళకు ఆయన కెరీర్ ఒక ఉదాహరణ అంటున్నారు. ఒక్కోసారి కష్టపడి పని చేసినా అదృష్టం ఉండాలని ఇండస్ట్రీ జనాలు చెప్పేది ఇందుకేనేమో!?
Also Read : రామ్ చరణ్ ఇంట మాత్రమే కాదు, ఈ స్టార్ హీరోల ఇంట్లోనూ మొదటి సంతానం అమ్మాయే