Satish Kaushik: నా భర్తే హత్య చేయించి ఉంటాడు - దర్శకుడు సతీష్ కౌశిక్ కేసులో ఊహించని ట్విస్ట్
బాలీవుడ్ నటుడు సతీష్ కౌశిక్ కేసు ఊహించని మలుపు తిరిగింది. రూ.15 కోట్ల ఆర్థిక లావాదేవీల కారణంగా నా భర్త, స్నేహితులతో కలిసి హత్య చేయించి ఉంటాడంటూ ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది.
బాలీవుడ్ నటుడు, దర్శకుడు సతీష్ కౌశిక్ గుండెపోటుతో మృతి చెందినట్లుగా మొదట ప్రచారం జరిగింది. ఆ తర్వాత పోలీసులు అనుమానాస్పద మృతిగా పరిగణిస్తూ కేసు నమోదు చేశారు. ఈ సమయంలోనే ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారవేత్త భార్య పోలీసుల ముందుకొచ్చి సంచలన విషయాలను వెల్లడించింది. రూ.15 కోట్ల విషయంలో తలెత్తిన వివాదం కారణంగా తన భర్త స్నేహితులతో కలిసి సతీష్ కౌశిక్ ను హత్య చేయించి ఉంటాడని అనుమానిస్తున్నట్లుగా పేర్కొంది. గత కొన్నాళ్లుగా తన భర్త, నటుడు సతీష్ కౌశిక్ మధ్య ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివాదం కొనసాగుతోందని... ఆ వివాదం ఇటీవల మరింత పెరిగిందని చెప్పింది. ఆ కారణంగానే విషపూరిత పదార్థాలతో కౌశిక్ ను తన భర్త హత్య చేయించి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేసింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా నటుడు మరణించిన ఫామ్ హౌస్ లో కొన్ని నిషేధిత పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు పేర్కొన్న విషయం తెల్సిందే. ఓ వ్యాపారవేత్త భార్యగా చెప్పుకుంటున్న ఆ మహిళ చేసిన వ్యాఖ్యలతో ఈ కేసు ఒక్కసారిగా మలుపు తిరిగింది.
పోలీసుల వద్ద ఆ వ్యాపారవేత్త భార్య పలు విషయాలను వెల్లడించింది. ''నేను మార్చి 13, 2019 సంవత్సరంలో ఆ వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నాను. నా భర్త ద్వారా సతీష్ కౌశిక్ తో పరిచయం ఏర్పడింది. ఢిల్లీతో పాటు దుబాయిలో పలు సార్లు ఆయనను కలిశాను. ఆగస్టు 23, 2022న దుబాయిలో నా భర్త వద్దకు ఆయన వచ్చి రూ.15 కోట్లు ఇవ్వాల్సిందిగా హెచ్చరించారు. నేను పక్క రూములో ఉండగా.. వారిద్దరు చాలా సమయం పాటు రూ.15 కోట్ల విషయమై వాగ్వాదానికి దిగారు. ప్రస్తుతం తనకు డబ్బు చాలా అవసరం ఉందని సతీష్ కౌశిక్ అన్నారు. పెట్టుబడి కోసం వెంటనే ఆ డబ్బు తనకు కావాలని... వీలైనంత త్వరగా ఇవ్వాల్సిందిగా నా భర్తను అడిగాడు. కానీ నా భర్త మాత్రం ప్రస్తుతానికి తన వద్ద డబ్బు లేదని చెప్పడంతో ఆయనకు చాలా కోపం వచ్చింది. మోసం చేయాలని చూస్తున్నావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రస్తుతానికి నా వద్ద డబ్బు లేదని.. త్వరలోనే నీకు ఇవ్వాల్సిన మొత్తం ఇస్తానని నా భర్త ఆయనతో అన్నాడని'' ఆ మహిళ వెల్లడించింది.
దుబాయిలో మరో రోజు కూడా సతీష్ కౌశిక్ కు తన భర్తకు మధ్య గొడవ జరిగిందని ఆ మహిళ తెలియజేసింది. డబ్బు తీసుకున్నట్లుగా ఎలాంటి రుజువు లేదని అయినా కూడా తాను డబ్బు ఇవ్వాలనుకుంటున్నానని... అందుకు కాస్త సమయం కావాలని తన భర్త కోరినట్లుగా వివరించింది. ఆ వివాదం తర్వాత తన భర్తతో ఆ రూ.15 కోట్ల విషయం గురించి మాట్లాడానని.. ఆయనతో ఉన్న గొడవ ఏంటని అడిగానని చెప్పుకొచ్చింది. కొవిడ్ సమయంలో తాను పెద్దమొత్తంలో డబ్బు కోల్పోయానని తన భర్త చెప్పినట్లుగా పేర్కొంది. అంతేగాకుండా ఈ వివాదాన్ని త్వరలోనే పరిష్కరించుకుంటానని హామీ ఇచ్చాడని వివరించింది.
ఇటీవల కౌశిక్ మరణం గురించి తనకు తెలిసిందని ఆ మహిళ పేర్కొంది. తన భర్త ఇవ్వాల్సిన రూ.15 కోట్ల డబ్బును తిరిగి ఇవ్వకుండా ఉండేందుకే ఆయనను హత్య చేయించి ఉంటాడని ఆ మహిళ అనుమానం వ్యక్తం చేసింది. అంతేగాకుండా తన భర్త డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాడని కూడా ఆమె పోలీసులకు తెలియజేసింది. ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో భాగంగా పలు కోణాల్లో ఆరా తీస్తున్నారు.
Also Read : వెంకటేష్ ఫ్యామిలీ ఇమేజ్ గోవింద - రానాను తిడుతున్న నెటిజన్లు