Dil Raju: పది కథల్ని పక్కన పెట్టేసిన స్టార్ ప్రొడ్యూసర్ 'దిల్' రాజు, రెండు షూటింగులూ
కరోనా, లాక్‌డౌన్స్ తర్వాత ప్రేక్షకులు సినిమా చూసే విధానం మారిందని స్టార్ ప్రొడ్యూసర్ 'దిల్' రాజు తెలిపారు. హిట్టూ ఫ్లాపులపై విశ్లేషణ చేసుకోవడంతో పాటు పది కథల్ని పక్కన పెట్టేశానని చెప్పారు.
''మంచి సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ చూస్తారు. ఇప్పుడు కావాల్సిందల్లా... ప్రేక్షకులను థియేటర్లకు తీసుకొచ్చే సినిమా'' అని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ 'దిల్' రాజు అన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు సక్సెస్ పర్సంటేజ్ 10 ఉండేదని, ఇప్పుడు అది మూడు శాతానికి చేరుకుందని ఆయన తెలిపారు. కరోనా తర్వాత ప్రేక్షకులు సినిమా చూసే దృక్పథం మారిందని ఆయన అన్నారు.
''కరోనా సమయంలో దర్శక, రచయితలు అందరూ ఖాళీగా ఉన్నారు. కథలు రాశారు. హీరోల దగ్గరకు వెళ్లి ఓకే చేయించుకున్నారు. అయితే... కరోనా సమయంలో ప్రేక్షకుడు ప్రపంచ సినిమా చూశాడు. కరోనా తర్వాత అతడు సినిమా చూసే విధానం మారింది. ఆడియన్స్ మైండ్ సెట్ మారింది. ఇండస్ట్రీ కూడా మారాలి'' అని జూలై 22న 'థాంక్యూ' విడుదల సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన 'దిల్' రాజు చెప్పారు.
ఆడియన్స్ మైండ్ సెట్ మారిన కారణంగా పది స్క్రిప్ట్స్ ఓకే చేసినప్పటికీ... వాటిని పక్కన పెట్టేశానని 'దిల్' రాజు అన్నారు. రెండు సినిమాల షూటింగ్స్ కూడా ఆపేశానని ఆయన తెలిపారు. ప్రేక్షకుల అభిరుచి తెలుసుకుని కొత్తగా సినిమాలు చేయాలనుకుంటున్నట్టు ఆయన సెలవిచ్చారు.
Also Read : తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సభ్యులు జనరల్ బాడీ మీటింగ్‌లో నిర్మాతలు చర్చించబోయే అంశాలు ఇవే
ప్రేక్షకులకు మంచి కంటెంట్ ఇవ్వడంతో పాటు టికెట్ రేట్స్ తగ్గిస్తే... జనాలు థియేటర్లకు వస్తారని 'దిల్' రాజు తెలిపారు. రెమ్యూనరేషన్స్, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరగడం ఒకప్పుడు నిర్మాతల సమస్య అని... ఇప్పుడు అది ఇండస్ట్రీ సమస్యగా మారిందని ఆయన చెప్పారు. చలన చిత్ర పరిశ్రమను కాపాడుకోవడం కోసం చర్చలు సాగిస్తున్నామని ఆయన అన్నారు.
Also Read : ప్రొడ్యూసర్ల సమ్మె - అసలు విషయం చెప్పిన దిల్ రాజు
View this post on Instagram